Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ లేడీ ఎస్పీకి అభినందనలు… మనుషుల్ని ప్రేమించే గుణమున్నందుకు…

April 12, 2025 by M S R

.

ఒక వార్త… నచ్చింది… బాగా నచ్చింది… అధికార యంత్రాంగం అంటే, అధికారి అంటే పెత్తనాలు కాదు… సమాజాన్ని, మనుషుల్ని ప్రేమించడం… కన్సర్న్ చూపించడం… 99 శాతం మంది ఉన్నతాధికారులకు ఇది తెలియదు… శిక్షణలో ఎవరూ చెప్పరు… ఒక మహిళా ఎస్పీని మనసారా అభినందించడానికి ఈ వార్తను షేర్ చేసుకుంటున్నాను… 

ఇది సాక్షిలో ఓ జిల్లా పేజీలో బ్యానర్… స్పేస్ సర్దుబాటు చేసి, మెయిన్ పేజీల్లో అందరూ చదివేలా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది… డెస్కుల్లో ఆ సున్నితత్వం లేకుండా పోయి చాన్నాళ్లయింది కదా వదిలేద్దాం… ఇంతకీ ఆ వార్త ఏమిటో మన భాషలో మనం చెప్పుకుందాం…

Ads



అడవి అంటేనే అదో తెలియని భయం… పట్టపగలే అడుగు పెట్టడానికి చాలదు ధైర్యం… అలాంటిది.. నలుగురు ఆడవాళ్లు… ఉపాధి కోసం అడుగులో అడుగు వేసుకుంటూ అడవితల్లి దిక్కు వెళ్లారు… దినమంతా.. తునికాకు ఏరి.. పొద్దుగూకే వేళ.. ఇంటి దారిని తప్పిపోయారు.

రాత్రంతా.. ఆ దట్టమైన అడవిలో.. చిమ్మ చీకటిలో.. అడవి తల్లే దిక్కంటూ… బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ ఊరి మహిళలను.. క్షేమంగా తీసుకువచ్చేందుకు గ్రామస్తులు స్పందించిన తీరు.. ఎస్పీ జానకి షర్మిల స్వయంగా రంగంలోకి దిగిన వైనం.. ఆకట్టుకుంది.

forest

నిర్మల్‌ జిల్లా మామడ మండలం… కప్పన్‌పల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, గట్టుమీది లక్ష్మి, కంబాల లింగవ్వ, బత్తుల సరోజలు గ్రామం సమీపంలోనే ఉండే అటవీ ప్రాంతానికి గురువారం సాయంత్రం 3.30 గంటలకు తునికి ఆకు కోసం వెళ్తున్నామని, తొందరగానే వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు…

తునికాకు నిల్వ చేసుకుని, వ్యవసాయ పనులు లేని సమయంలో బీడిలు చుడుతూ ఉపాధి పొందుతారు. ఆకు కోసం వెళ్లిన మహిళలు సాయంత్రం 5 గంటల వరకు కోసుకుని ఇంటికి వెళ్లెందుకు తిరుగు పయనమయ్యారు. ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు రావడం, ఉరుములు మెరుపులు వచ్చి చీకటిగా మారడంతో ఆందోళనలో తాము వచ్చిన దారిని తప్పారు…

నడకను పెంచారు… సాయంత్రం 7 గంటలయింది… చీకటి కమ్ముకుంది… చుట్టూ గుట్టలు, లోయలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు… దారి తప్పామని గుర్తించారు… తమ వెంట ఉన్న ఫోన్‌తో తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందిద్దామని ప్రయత్నించినా సిగ్నల్స్‌ అందక పోవడంతో, చేసేదేమీ లేక ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఎటునుండి ఏ అటవీ మృగాలు వస్తాయో తెలియక వాటి అరుపుల మద్య రాత్రంతా భయం భయంగా గడిపారు…

ఆకు సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన వారు రాత్రి 8 గంటల వరకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, పోలీసులు 50 మంది రెండు బృందాలుగా ఏర్పడి రాత్రంతా గాలించారు.

నలుగురు మహిళలు ఉన్న లొంకపాడు లోయకు సమీపంలోకి వెళ్లారు. గ్రామస్తుల మాటలు, అరుపులు మహిళలకు వినిపిస్తున్నప్పటికి, మహిళలు చేసిన రక్షించండీ అనే మాటలు వీరికి వినిపించక పోవడంతో వారి సరైన జాడ తెలియక వెనుతిరిగారు…

రాత్రంతా భయం భయంగా గడిపిన మహిళలు చెట్టు ఎక్కి ఫోన్‌ చేసినప్పటికి సిగ్నల్స్‌ లేక పోవడంతో సమాచారం అందించలేక పోయారు, ఉదయం ఫోన్‌ సిగ్నల్‌ కోసం సమీపంలోని గుట్ట పైకి కష్టంగా ఎక్కి ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహిళల ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని టెక్నాలజీ ద్వారా గుర్తించినప్పటికి వారున్న ప్రాంతానికి వెళ్లడం కష్టంగా మారింది…

forest

నలుగురు మహిళలు దట్టమైన అటవీ ప్రాంతంలో తప్పిపోయారనే సమాచారం గురువారం రాత్రి తెలియడంతో ఆ రాత్రంతా ఎస్పీ జానకి షర్మిల ఫాలోఅప్‌ చేస్తూనే ఉంది… శుక్రవారం తెల్లవారు జామున స్వయంగా రంగంలోకి దిగింది ఆమె… నిర్మల్‌ ఏఎస్‌పి రాజేష్‌ మీనా, సోన్‌ సిఐ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ అధికారులు, గ్రామస్తుల సహకారంతో గాలింపు చేపట్టారు…

సాంకేతికతపై పట్టున్న ఎస్పీ ఈ ఆపరేషన్‌లో దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. డ్రోన్‌లు, వైర్‌లెస్‌ సెట్లు, జీపీఎస్‌ తదితర టెక్నాలజీలన్నీ సద్వినియోగం చేసుకుంటూ నలుగురు మహిళలు చిక్కుకున్న ప్రాంతాన్ని గుర్తించారు…

కానీ.. ఆప్రాంతం దట్టంగా ఉండటంతో కాలినడకన కొంతదూరం, ద్విచక్రవాహనంపై కొంతదూరం… దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఎట్టకేలకు వారిని గుర్తించి, తీసుకువచ్చారు… తమను తీసుకుపోవడానికి ఏకంగా తనే వచ్చిన ఎస్పీని చూసిన వెంటనే ఆ మహిళలు ఉద్విగ్నతకు గురయ్యారు…

ఆమె వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. రోజంతా డీహైడ్రేషన్‌ కారణంగా నీరసమైన వారికి తాగునీరు, పండ్లు అందించారు. అనంతరం ట్రాక్టర్లలో వారిని వెంట తీసుకుని గ్రామానికి సురక్షితంగా తీసుకువచ్చారు. అప్పటి వరకు అందోళనలో ఉన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు తమవారిని చూసి ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనయ్యారు…

తమ గ్రామానికి చెందిన మహిళలను అటవీ ప్రాంతం నుండి స్వయంగా దగ్గరుండి తీసుకువచ్చిన నిర్మల్‌ ఎస్పీ జానకి షర్మిలకు గ్రామస్తులు, కుటుంబసభ్యులు పూలు చల్లుతూ కృతజ్ఞతలు తెలిపారు…

ముచ్చట ఈ కథనం పబ్లిష్ చేయడానికి కారణం… కన్సర్న్ ఫీలై తనే రంగంలోకి దిగి అడవిని జల్లెడపట్టి నలుగురు మహిళల్ని తమ ఊరికి తీసుకువచ్చిన సుగుణం… అభినందనలు మేడమ్… కీప్ ద స్పిరిట్…!!



ఈ ఎస్పీ బయోడేటా కోసం అడిగితే గ్రోక్ దగ్గర అసలు సమాచారమే లేదు… అదీ దాని పరిమితి… ఆ గ్రోక్ అది చెప్పింది, ఇది చెప్పింది అంటూ రోజూ వరుసగా పార్టీల మీద, వ్యక్తుల మీద బురద జల్లుతున్న అద్భుత పాత్రికేయం పట్ల జాలిపడుతూ…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions