.
ఎక్కడో చదివినట్టు గుర్తు… చిన్న బడ్జెట్‌తో నిర్మితమై భారీ లాభాల్ని ఆర్జిస్తున్న ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల కోవలోకి లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా చేరిందని ఓ వార్తావిశ్లేషణ…
దానికి ఉదాహరణలు ఏం చెప్పారంటే ఆ విశ్లేషణలో… సంక్రాంతికి వస్తున్నాం 50 కోట్ల ఖర్చు కాగా రూ.303 కోట్లు రాబట్టింది… 15 కోట్లతో నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రం రూ.315 కోట్లు రాబట్టింది.., 40 కోట్లతో నిర్మించిన అహాన్ పాండే ‘సైయారా’ మూవీ రూ.569 కోట్లు కలెక్ట్ చేసింది…
Ads
అలాగే మోహన్ లాల్ 35 కోెట్ల తుడరుమ్ రూ.235 కోట్లు, దుల్కర్ 30 కోట్లతో నిర్మించిన కొత్త లోక మూవీకి రూ.185 కోట్లు వచ్చాయి… ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా ఆ సినిమాల జాబితాలో నిలిచింది… ఇదీ విశ్లేషణ…
నిజమే… అవన్నీ కరెక్టే… కానీ వాటి సక్సెస్ రేంజ్ వేరు… హ్యూజ్ హిట్స్… లిటిల్ హార్ట్స్ సక్సెసే, కానీ నిన్నటివరకు దాని వసూళ్లు (5, 6 రోజులు) కేవలం 12- 13 కోట్లు… చిన్న సినిమా, తక్కువ ఖర్చు కాబట్టి… జస్ట్ 2 కోట్లతోనే నిర్మించిన సినిమా కాబట్టి… ఆ కోణంలో చూస్తే ఈ వసూళ్లు ఎక్కువే… మంచి లాభాలే…
మార్కెట్‌లో పెద్దగా మంచి సినిమాలు లేనందున, పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతున్నందున, మంచి రివ్యూలు కూడా జతకలిసినందున… ఇంకా వసూళ్లు వస్తాయి, కానీ మరీ 100 కోట్ల రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయలేమేమో… కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాలి…
ఎస్, సినిమా కథ సరదాగా ఉంటుంది… వినోదాత్మకంగా… హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, హీరో స్నేహితుడి పంచులు, కామెడీ బేస్డ్ కథనం క్లిక్కయ్యాయి… జియో సిమ్ రాని పూర్వకాలంలో, కోచింగ్ సెంటర్ల నేపథ్యంలోని కథ… సో, నైన్టీస్ బాపతు తరం కనెక్టవుతోంది.,. హీరోయిన్‌గా శివానీ నాగరం నటన బాగుంది…
వందల కోట్ల ఖర్చుతో అట్టహాసాలు, భారీ తారాగణంతో నిర్మించిన పలు సినిమాలు బోల్తాకొట్టిన నేపథ్యంలో… ఆ ఖర్చులో పీనట్స్‌తో పోల్చదగిన బడ్జెట్‌తోనే లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు హిట్ కావడం ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఓ పాఠం నేర్పినట్టే…
భారీ ఖర్చులు, పేరుమోసిన నటులు, వందల కోట్ల గ్రాఫిక్స్ కాదురా బాబూ, కాస్త కథ పట్ల, కథ చెప్పే తీరు పట్ల శ్రద్ధ చూపించండిరా, ప్రస్తుతానికి ఎవరికీ పెద్దగా తెలియని చిన్న నటులైనా సరే, మేం సినిమా హిట్ చేస్తాం, డబ్బులూ ఇస్తాం అని ప్రేక్షకుడు చెబుతున్నాడు..!! పరభాషల తెల్లతోలు తారలే కాదు, మన తెలుగమ్మాయిలనూ ఆదరిస్తాం అని కూడా..!!
Share this Article