ఒకసారి ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోయాడు… తన దగ్గరున్న ఫ్లాస్క్‌లోని నీరు అయిపోయింది… ఆకలి, దప్పిక… నీరసం, ఎండ… ఇక కాసేపట్లో ప్రాణాలు పోతాయన్నట్టుగా ఉన్నాడు… కనీసం గుక్కెడు నీళ్లు దొరికితే చాలు, మరికొంత దూరం కష్టమ్మీద నడుస్తాను అనే ఆశ… కానీ ఎడారిలో నీళ్లేవి..?
కాసేపటికి తనకు ఎదురుగా దూరంగా ఓ చిన్న గుడిసె కనిపించింది… ఎండమావిలాగే ఎడారిలో ఎన్నో భ్రమలు అనుకున్నాడు… కానీ వేరే మార్గం లేదు… ఈడుస్తూ ఏడుస్తూ ఆ గుడిసె వరకు కష్టమ్మీద చేరుకున్నాడు…
కళ్ల భ్రమ కాదు, అక్కడ నిజంగానే ఓ కూలిపోతున్న గుడిసె ఉంది… అందులో ఎవరుంటారు..? ఎవరూ లేరు… ఎప్పట్నుంచో ఖాళీ… శిథిలమైపోతోంది… లోపల కాస్త నీరేమైనా దొరుకుతుందేమో అనే ఆశతో లోపలకు వెళ్లాడు…
Ads
ఆశ్చర్యం… ఆ గుడిసెలో ఓ చేతి పంపు ఉంది… హ్యాండిల్ పట్టుకుని కొట్టసాగాడు వడివడిగా… అది తనకు చివరి ఆశ మరి… నీరు బయటికి రావడం లేదు… కొట్టీ కొట్టీ ఆ కాస్త ఓపిక, బలం కూడా అయిపోయాయి… ఆవిరైపోయాయి… ఇక చావు తప్పదు అనుకుంటూ కూలబడ్డాడు అక్కడే…
మూసుకుపోతున్న కళ్లకు ఆ గుడిసెలోని ఓ మూల ఒక సీసా కనిపించింది… అందులో నీళ్లు కనిపిస్తున్నాయి… ఆవిరై పోకుండా ఉండేందుకు దానిపై మూత కూడా బిగించి ఉంది… వెళ్లాడు… మూత తీశాడు, నోట్లోకి ఆ నీళ్లను వంపుకునేవేళ దానికి అతికించిన ఓ కాగితం ముక్క కనిపించింది… ‘‘చేతి పంపు కొట్టేముందు ఈ నీటిని అందులో పోయండి, తరువాత నీళ్లు వచ్చాక మళ్లీ ఈ సీసాను ఆ నీటితో నింపి, మూతపెట్టి, ఇదే మూలన పెట్టండి’’ అని రాసి ఉంది…
అప్పుడు మొదలైంది తనలో మథనం… ఆ సూచనలతో ఆ నీటిని చేతిపంపులో పోస్తే నీళ్లొస్తే సరే, రాకపోతే..? అందుబాటులో ఈ కాసిన్ని చుక్కల్నీ వదులుకున్నట్టవుతుంది… ఏమో, ఆ చేతిపంపే పనిచేయడం లేదేమో… నీళ్లు పోసినా వేస్టేనేమో… చేతిపంపు కింద ఉన్న నీటి ఊట లేదా ధార ఆల్రెడీ ఎండిపోయిందేమో… అప్పుడు తన వివేచన పనిచేసింది…
ఏదయితే అదయింది… ఈ కాసిన్ని నీళ్లు తాగేస్తే, కాసేపటికి మళ్లీ దప్పిక తప్పదు… పోనీ, చేతిపుంపులో పోసి రిస్క్ తీసుకుంటే..? కళ్లు మూసుకున్నాడు… ఆ నీళ్లను చేతిపంపులో పోశాడు… ప్రార్థన చేస్తూ హ్యాండిల్ కొట్టడం స్టార్ట్ చేశాడు… తనకు గలగల శబ్దం వినిపించింది… తను ఊహించినదానికన్నా ఎక్కువ నీటి ధార వస్తోంది… కడుపు నిండా తాగాడు… దేహంపై నీటిని ధారగా పోసుకున్నాడు… ప్రాణం నిలబడింది… కానీ ఇక్కడే ఉండిపోలేడు కదా… గుడిసెలో చుట్టూ చూశాడు…
ఒక పెన్సిల్, ఈ ప్రాంత మ్యాప్ కనిపించాయి… కానీ నాగరిక నివాసాలకు దూరంగానే ఉన్నట్టు చూపిస్తోంది అది… ఐతేనేం, ఓ మార్గం అంటూ కనిపిస్తోంది… చేరుకుంటానా లేదా వేరే సంగతి…
ఖాళీగా ఉన్న తన ఫ్లాస్క్ నింపుకున్నాడు… గుడిసెలోని సీసాను నింపి, మూత బిగించాడు… ఆ కాగితంపై ఆ పెన్సిల్‌తో రాశాడు… ‘‘నన్ను నమ్మండి, ఈ చేతిపంపు పనిచేస్తుంది… బతుకు నిలుపుకున్నవాడిని చెబుతున్నాను…’’
తనలాగే ఎవడైనా అక్కడికి దారితప్పి వస్తే, అనవసర సందిగ్ధాలు, మథనాలు అవసరం లేకుండా నమ్మకం కలిగించడానికి ఆ రాతలు… ఈ కథ ఏం చెబుతోంది… మనం ఏదైనా సమృద్ధిగా పొందాలని అనుకుంటే సంపూర్ణ విశ్వాసంతో మన దగ్గర ఉన్నది ఇవ్వాలి… చర్యకు ప్రతిఫలం అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉంది… జీవితానికి పనిచేసేందుకు వీలుగా కాస్త ఇంధనం ఇవ్వండి… అది మీకు చాలారెట్లు ఎక్కువ ఇస్తుంది…
Share this Article