బాహ్యప్రపంచం కంటపడకుండా నిజాన్ని దాస్తూ తాననుకున్న రాక్ గార్డెన్ ను నిర్మించాలనుకున్న పిచ్చిమాలోకం నెక్ చాంద్ సైనీ. కానీ దాస్తే దాగేదా నిజం..? అంతేగా… ? ప్రభుత్వం ఒక దశలో ఏకంగా ఆ గార్డెన్ నే ధ్వంసం చేయాలని నిర్ణయించింది. కానీ సైనీ ఎంత ఎర్రిమాలోకమైనా… చూపరులను కట్టిపడేసేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఉద్యానవన ఇంజనీరింగ్ నిర్మాణశైలి… మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు ఇవాళ దేశంలోనే అద్భుతమైన రాక్ గార్డెన్ గా అవతరించింది. ఏకంగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నందించేంత గొప్పమాలోకంగా పరిచయం చేసింది.
వృత్తి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్ పెక్టర్… కానీ ప్రవృత్తి మాత్రం రోజూ ఉద్యోగం కాగానే ఇదిగో ఇవాళ భారతదేశంలోనే ఓ అద్భుతమైన రాక్ గార్డెన్ గా చెప్పుకునే చండీగఢ్ లోని ఈ ఉద్యానవన నిర్మాణం. పుట్టింది నాటి పంజాబ్ రాష్ట్రంలో… ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న బెరియన్ కలాన్ అనే గ్రామంలో. భారత విభజన సమయంలో భారత్ కు వచ్చేసింది నెక్ చాంద్ సైనీ కుటుంబం. అయితే చాంద్ రూపుదిద్దిన రాక్ గార్డెన్ ను 1973లో ఎస్.కే.శర్మ అనే అధికారి గుర్తించారు. అటవీస్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా చాంద్ నిర్మించిన రాక్ గార్డెన్ అక్రమ నిర్మాణమని కూల్చేయాలని అప్పటి ప్రభుత్వం కూడా దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది. కానీ రాక్ గార్డెన్ నిర్మాణానికి ఎంత కృషి చేశాడో… ప్రజాభిప్రాయ సేకరణకూ అంతే కష్టపడి… అదే ప్రభుత్వం చేత అదో గొప్ప పర్యాటక స్థలం కాగలదని గుర్తించేలా చేసి ఒప్పించాడు. అలా 1975లో అధికారికంగా చండీగఢ్ లోని రాక్ గార్డెన్ ను గుర్తించిన అక్కడి ప్రభుత్వం… 1976 నుంచి దాన్ని పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించింది.
Ads
అయితే చాంద్ నిర్మించిన ఈ ఉద్యానవనం ఒక రూపు దిద్దుకోవడానికి ఏకంగా 18 ఏళ్ల కృషి అవసరమైంది.1957లో 12 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ రాక్ గార్డెన్… ఇప్పుడు సుమారు నలభై ఎకరాలకు విస్తరించింది. నెక్ చాంద్ సైనీ కృషికి ఆ తర్వాత మరో యాభై మంది శ్రామికులూ ఆయనకు బాసటగా నిలవడంతోనే ఈ అద్భుత నిర్మాణం ఆవిష్కృతమైంది. తానుండేందుకు ఓ రాతి పలకల గూటిని ఇంటిలా నిర్మించుకుని… అక్కడే ఉంటూ అక్కడే తింటూ… అక్కడే పడుకుంటూ… అలా సైనీ కన్న కలే చండీగఢ్ లో సుఖ్నా సరస్సుకు సమీపాన ఉన్న నేటి నెక్ చాంద్ ఉద్యానవనం. చాంద్ నిర్మాణంలో పెద్ద పెద్ద రాళ్లతో పాటే.. గాజువస్తువులు, గాజులు, టైల్సు, సిరామిక్ కుండలు, సింకులు, విద్యుత్ వ్యర్థపదార్థాలు, క్షౌరశాలల్లో కత్తిరించిన జుట్టు, ఖాళీ సీసాలు, పెంకులు ఇలా కాదేదీ గార్డెన్ కు అనర్హమన్న రీతిలో ముడిపదార్థాలను వాడి ఒక అందమైన రాక్ గార్డెన్ నిర్మాణాన్ని చేపట్టి తనకున్న ఇంజనీరింగ్ నైపుణ్యంతో దేశానికే తలమానికం చేసిన ప్రత్యే’కథ’య్యాడు నెక్ చాంద్ సైనీ.
ఇవాళ కన్నులపండువలా కనిపించే చండీగఢ్ రాక్ గార్డెన్ నిర్మాణానికి మొదటి ఏడేళ్లు ఆయన ఉద్యోగ విధులు ముగిసిననంతరం.. కొండల దిగువన తిరుగుతూ.. పక్షులు, వివిధ రకాల జంతువులు, మనిషుల ఆకారాలను పోలి ఉన్న రాళ్ళను గుర్తించి.. తన సైకిల్ పై తీసుకువచ్చేవారు. అవన్నింటినీ 20 వేల కళాకృతులుగా చూపు తిప్పుకోలేనంత అందంగా రూపుదిద్ది… 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనాలు, కళారూపాలతో విస్తుగొలిపే రీతిలో ఏకంగా మానవ ప్రతిసృష్టే చేశాడు సైనీ. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే.. ముందర ఏమి వస్తుందో తెలియని ఉద్విగ్నతతో.. మరొక్క క్షణం ఆగితే.. కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం ఆవిష్కరించే రీతిలో ఈ రాక్ గార్డెన్ నిర్మించి ఒకే ఒక్క మనిషి ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించగలడా… ఏమా ఊహ అనేట్టుగా ఓ దృశ్యకావ్యంలా నిలుస్తోంది నేటికీ చండీగఢ్ రాక్ గార్డెన్. ప్రభుత్వానికి తెలవకుండా ఓ అటవీప్రాంతంలో ఓ ఉద్యానవనాన్ని నిర్మించాలన్న నెక్ చాంద్ సైనీ పిచ్చిసంకల్పమేంటోగానీ… ఆ రాక్ గార్డెన్ కూల్చాలనుకుని నిర్ణయించుకున్నాక.. తిరిగి దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా ప్రకటించి… అదే సైనీ అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని గుర్తించి.. ప్రభుత్వం 1984లో పద్మశ్రీ ప్రసాదించిన సదరు చాంద్ సైనీ కథ నేటి తరానికి తెలవాల్సిన అవసరముంది… అందుకే ఈ కథనం… నిన్న ఆయన వర్ధంతి…!!
- రమణ కొంటికర్ల
Share this Article