Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కురిసిన ఈ సిరివెన్నెల వెలుగుల్లో తడవని ప్రేక్షకుడు లేడు అప్పట్లో…

August 30, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. ఈ సిరివెన్నెల సినిమా పేరు వినగానే నాకు మొదటగా గుర్తుకొచ్చేది మూన్ మూన్ సేన్ సూర్యోదయాన్ని అంధుడయిన కధానాయకుడు సర్వదమన్ బెనర్జీకి వివరించే సీన్ . విశ్వనాధ్ ఎంత సృజనాత్మకంగా ఆలోచించారో ! రెండవది వేణు విద్వాంసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హరిప్రసాద్ చిత్రపటం .

సూర్యచంద్రులు రెండు కళ్ళుగా వేణువు నాసికగా ఓంకారం ఉద్భవిస్తూ సింబాలిగ్గా గీయబడుతుంది . ఒక ఇంటర్వ్యూలో విశ్వనాధ్ గారే చెప్పారు . దీన్ని ఆలోచించటానికి వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ కి వారం పట్టిందట . అంతటి తపస్సుతో ప్రతీ ఫ్రేమూ తీయబడింది కాబట్టే ఓ కళాఖండంగా నిలిచిపోయింది ఈ సినిమా .

Ads

  • మూడవది జ్యోతిర్మయి పాత్రధారిణి మూన్ మూన్ సేన్ అంతిమ యాత్ర . తనను ఎంతగానో ఆరాధించే హరికి తాను పెళ్లి చేసుకొనే వెళ్ళిపోయినట్లు తతంగం అంతా జరగాలని ఉత్తరం వ్రాస్తుంది . అందరూ హీరో అలాగే భ్రమిస్తున్నాడని భావిస్తారు . అంతా అయిపోయాక ఆమె ప్రకృతిలో కలిసిపోయిన విషయం నా హృదయానికి తెలియదా , చేరదా అని ఆమె సమాధి వద్దకు వెళతాడు హీరో . గుండెను పిండేసే సన్నివేశం .

 

హీరో అంధుడు , హీరోయిన్ మూగది . ఒకరు ఎలాంటి శిక్షణ లేకుండానే గొప్ప వేణు కళాకారుడు . మరొకరు చిత్రకారిణి , శిల్పి , రచయిత . రెండు పాత్రల్లో ధీరోదాత్తత ఉట్టి పడుతుంటుంది . ఆలోచించగల ప్రేక్షకులకు ఎన్ని సందేశాలో ! మరో ప్రధాన పాత్ర మూన్ మూన్ సేన్ ది . విశ్వనాధుడికి ఈమె ఎలా తట్టిందో !

నాకయితే ఆమె పేరు వినటం ఈ సినిమా తోనే . అప్పటికే ఆమె ఇతర భాషల్లో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న నటి . ఆమె పాత్ర , నటన ఎంత గొప్పగా ఉంటాయంటే ఈ సినిమాకు ఎవరు హీరోయిన్ అనే సందేహం వస్తుంది ఎవరికయినా !?

  • మూగదానిగా అద్భుతంగా నటించిన సుహాసినా లేక సినిమానంతా చలాకీగా , ఎంతో లోతైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోయే మూన్ మూన్ సేనా ! చాలా కష్టం చెప్పటం . సానుభూతి అంతా మూన్ మూన్ సేనుకే దక్కుతుంది . బహుశా అందువలనే ఆమెకు బెస్ట్ సపోర్టింగ్ నటిగా నంది అవార్డు వచ్చి ఉంటుంది .

ఈ సినిమా ఓ క్లాసిగ్గా మిగిలిపోవటానికి ప్రధాన కారకుడు సీతారామ శాస్త్రి గారే . అదృష్టదేవత ఆయన ఇంటి తలుపు తట్టినప్పుడు చక్కగా సద్వినియోగం చేసుకొని సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నాడు . ఈ సినిమా టైంలో వేటూరి విశ్వనాధ్ మీద అలిగి ఉన్నాడట .

అప్పటికే సీతారామ శాస్త్రి గంగావతరణం విని ఉన్న విశ్వనాధ్ ఈ సినిమా పాటల్ని శాస్త్రి గారికి అప్పచెప్పారట .‌ సరస్వతీ దేవి ఆయన కలంలోకి ప్రవేశించి పాటలన్నీ వ్రాసి వెళ్ళింది . వ్రాసినవి పాటలే అయినా వ్రాయించింది మాత్రం శారదా మాతే . లేకుంటే ఆ సాహిత్యం ఏంటి బాబో ! ఒక్కొక్క పాట ఒక్కొక్క M Phil టాపిగ్గా తీసుకోవచ్చు . తెలుగు విశ్వవిద్యాలయం ఇలాంటి అజరామర పాటల సాహిత్యం మీద M Phils చేయించాలి .

శాస్త్రి గారికి నంది అవార్డు తెచ్చిన పాట తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం , ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం . ఒక్క ఈ పాటను విశ్లేషించాలంటే ఒక రోజు పట్టుతుంది . అన్ని పాటలూ అలాంటి సాహిత్యంతో నిండి ఉంటాయి . ఈ పాట వ్రాసిన శాస్త్రి గారికి పాడిన బాలసుబ్రమణ్యానికి ఇరువురికీ నంది అవార్డులు వచ్చాయి .

సంగీతారాధకులు మరచిపోలేని మరో మధుర మధురమైన పాట ఆది భిక్షువు వాడినేది కోరేది , బూడిదిచ్చె వాడినేది అడిగేది . ఆది భిక్షువు !! ఎక్కడ పట్టాడో ఈ మాటను శాస్త్రి గారు !? చెప్పకపోతే తప్పయ్యేది… సినిమాలో అనితర సాధ్యమైన వేణుగానం పండిత్ హరిప్రసాద్ చౌరాసియా…

ఈ సినిమాలో నాకు బ్రహ్మాండంగా నచ్చిన మరో పాట చందమామ రావే జాబిల్లి రావే . మన చిన్నప్పుడు మన అమ్మలు మనకు వినిపించిన పాట . ఈ పాట చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉంటుందో ! నాకయితే పాండురంగ మహాత్మ్యం సినిమాలో జయకృష్ణా ముకుందా మురారే పాట చిత్రీకరణే గుర్తుకొస్తుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , వసంతలు పాడారు ఈ పాటని . ప్రేక్షకులకు బృందావనాన్ని చూపించారు . మీనా కళ్ళు లేని చిన్న పిల్లగా చక్కగా నటిస్తుంది .

తాను పెరిగిన ఊరికి వచ్చిన చిన్నప్పుడు తనకు అన్నం పెట్టిన ప్రదేశాలను తనివితీరా తడుముకోవాలని వచ్చి పాడిన పాట ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు , నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు . మనం పుట్టి పెరిగిన ఊళ్ళు , చదువుకున్న విద్యాలయాలు , మన బతుకులకు బాటలేసిన ప్రదేశాలు చూసినప్పుడు మనందరికీ ఇలాంటి అనుభూతే కలుగుతుంది . ఈ పాటలో ఒక చోట స్వర్ణ స్వప్నమై అనే పదం ఉపయోగించబడుతుంది . స్వర్ణ స్వప్నం ! Golden dream !! వ్వాహ్ శాస్త్రి గారూ !

ఒక్కొక్క పాట ఒక్కొక్క సాహిత్య భాండం . చినుకు చినుకు చినుకు చినుకు తొలితూరి తొలకరి చిలికిన చినుకులు , మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం అది నా కంటికి శూన్యం ; మనసున కొలువై మమతల నెలవై వెలిసిన దేవిది ఏ రూపం అంటూ సాగే బరువైన పాట , పొలిమేర దాటిపోతున్న గువ్వల చెన్నా , పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి .

ఇంతటి మధురాతిమధురమైన సంగీతాన్ని పాటల రూపంలో అందించిన కె వి మహదేవన్ , ఆయన సహాయకుడు పుహళేందికి మనఃపూర్వక నమస్సులు . సినిమా అంతా సంగీతం , సాహిత్య భరిత పాటలే . విశ్వనాధ్ సినిమాలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి . ఉన్న కాసిని మాటలను మరచిపోలేని విధంగా వ్రాసిన సాయినాధ్ , ఆకెళ్ళలను అభినందించవలసిందే .

ఇంతటి కళాఖండాన్ని , విశ్వనాధుని నమ్మి నిర్మించిన సిహెచ్ రామకృష్ణారెడ్డి , యన్ భాస్కరరెడ్డి , యు చిన వీర్రాజులను మెచ్చుకోవాలి . ఇంత గొప్ప దృశ్య శ్రవణ కావ్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పాలి . ఎన్నో ఫిలిం ఫెస్టివల్సులో ప్రదర్శించబడింది . తమిళంలోకి డబ్ చేయబడింది . కళాతపస్వి కీర్తి కిరాటంలో మరో కలికితురాయి అయింది .

ప్రతీ సినిమాలో అంతర్లీనంగా విశ్వనాధ్ ఎన్నో సందేశాలను ఇస్తారు . హీరో బెనర్జీ స్నేహితుడు ఈశ్వరరావు ముస్లిం , హీరో మరియు అతని చెల్లెలిని చిన్నప్పుడు ఆదుకునే డేవిడ్ ఒక క్రిస్టియన్ . మనం ఎంత ఎదిగినా పెద్దల వద్ద , మనల్ని పెద్దవాళ్ళని చేసిన పెద్దవాళ్ళ వద్ద ఒదిగి ఒదిగి ఉండాలి . ఇలాంటి ఎన్నో ఆదర్శ సందేశాలు ఉంటాయి ఈ సినిమాలో . అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత .

విశ్వనాధ్ సినిమాలలో ప్రతీ పాత్ర ప్రాధాన్యత కలిగి ఉంటుంది . ఆ పాత్రల్లో శుభ , శుభలేఖ సుధాకర్ , సంయుక్త , వరలక్ష్మి , సాక్షి రంగారావు , మిశ్రో ,జిత్ మోహన్ మిత్రా , పద్మ , ప్రభృతులు నటించారు . ఈ సినిమా ఫొటోగ్రఫీ డైరెక్టర్ యం వి రఘుకి కూడా నంది అవార్డు వచ్చింది .

ఈ సంగీత సాహిత్య కావ్యం యూట్యూబులో ఉంది . ఎన్ని సార్లు చూసి ఉన్నా ఇంకెన్ని సార్లయినా చూడతగ్గ చిత్రం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా నడుం తాకుతావా..? నాన్సెన్స్, ఇక మీ భాషాసినిమాల్లోనే నటించను…
  • పారాసెటమాల్, ఐబుప్రొఫెన్‌లతో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్..!!
  • ఫాఫం మోడీ భాయ్… నువ్వూ కాళేశ్వరం కుట్రలో భాగస్వామివేనట..!!
  • రేవంత్‌రెడ్డి సైలెంట్ ర్యాగింగ్… కేసీయార్ క్యాంపు పరుగులు, ఆపసోపాలు…
  • సంకేతాలు అవేనా..? తదుపరి అగ్రదేశ అధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు..?
  • కురిసిన ఈ సిరివెన్నెల వెలుగుల్లో తడవని ప్రేక్షకుడు లేడు అప్పట్లో…
  • ఇల్యూమినాటి..! ప్రపంచాన్ని శాసించే ఈ గ్రూపు టార్గెట్ మోడీ..?!
  • ఖంగుమనే ఆ గొంతు నుంచి జాలువారిన తీయని పాటలూ ఎన్నో
  • ఈ సినిమా రిజల్ట్‌పై వెక్కివెక్కి ఏడ్చానని చిరంజీవే చెప్పాడు..!!
  • బిట్‌కాయిన్ కేసు..! ఇండియాలో ఓ క్రిప్టో సెన్సేషన్… శిక్షలు ఖరారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions