Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జర్నలిస్ట్, రైటర్, నావెలిస్ట్, ఎడిటర్… అవన్నీ కావు… ఓన్లీ పతంజలి..!

March 11, 2023 by M S R

————————————————————-
మార్చి 11 , పతంజలి 14వ వర్ధంతి
బెజవాడ 1979.
ఒక సాయంత్రం సబ్ఎడిటర్ పతంజలి, బెంజ్ కంపెనీ సెంటర్లోని ఈనాడు కాంపౌండ్ నుంచి వచ్చాడు. చుట్టుగుంట, చంద్రం బిల్డింగ్స్ లో విశాలాంధ్ర డైలీకి మరో మహాసబెడిటర్ నైన నేను కలిశాను. అరటావు కాయితాల కట్ట అందించాడు. కొక్కిరాయి రాతలో “ఖాకీవనం”
అని రాసుంది. రాత్రికి రాత్రే చదివేశా.
తెల్లారే పరిగెట్టుకుంటూ పోయి విశాలాంధ్ర
నవలల పోటీకిచ్చా. ప్రైజ్ రాలేదు.
*
హైదరాబాద్, 1995 ఒక మధ్యాహ్నం.
శంకర మఠం నుంచి హెర్బల్ హెల్ప్ ఆస్పత్రి వైద్యులు శ్రీ యోగపతంజలి టాంక్ బండ్ దగ్గర
ఇండియన్ ఎక్స్ ప్రెస్ కాంపౌండ్ కు వచ్చాడు.
చేతిలో పదేళ్ళనాటి పాత డైరీ. ఆంధ్రప్రభలో ఎలెక్షన్ కార్టూన్స్ కి కిరాయికి కుదిరిన నన్ను బైటికి రమ్మని ఛాలెంజ్ చేశాడు. టాంక్ బండ్ కేఫ్ లో రెండు రౌండ్ల చాయ్ లూ, గుప్పెడు సిగరెట్లతో బలవంతంగా నవల చదివించాడు. పిలకతిరుగుడు పువ్వు కి రంగుల్లో బొమ్మలేసి ఇండియా టుడేకి యమర్జంట్ గా పంపేయాలన్నాడు. రాత్రికి రాత్రే బొమ్మలేసేసి మర్నాడే ఇండియా టుడే రాజేంద్రకి పోస్టుపని కూడా ఆఘమేఘాల మీద ముగించా.
*

ఆ బెజవాడ సాయంత్రానికి, ఈ హైదరాబాద్ మధ్యాహ్నానికీ మధ్య రెండు దశాబ్దాలున్నాయి. పతంజలి రాతల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది. రచనకీ కళకీ ఏమాత్రం సంబంధం లేని జర్నలిజం కెరీర్ లో మరీ సినిమాటిక్ మార్పులొచ్చాయి.

ఖాకీవనం చదువుతున్నప్పుడు అబ్బో అనిపించింది. తీరా విశాలాంధ్ర వాళ్ళు కనీసం consolation కూడా ఇవ్వలేదని తెల్సి తల్లకిందులయ్యా. హోటల్ గదిలో కేతు విశ్వనాథరెడ్డితో తుమ్మల వెంకట్రామయ్య గారితో తగువు. ప్రైజ్ ఇవ్వకపోవడానికి గల సోషలిస్టు రియలిస్ట్ మార్క్సిస్టు సౌందర్య తత్వశాస్త్ర విశ్లేషణని కేతు చెపుతుంటే బొత్తిగా గిట్టలేదు. తర్వాత “చతుర”లో చలసాని ప్రసాదరావు ఆ నవల వేశాడు. అంతకుముందు కథలు రాసినా జనం ఖాకీవనంతోనే పతంజలిని చూశారు. అప్పుడతను మన సాహిత్య రంగంలో మినీ హీరో.

వెంటనే అదే ఫార్ములాతో మరోటి రాసికొడితే జనం పడతారు కదా. శ్రీకాకుళం నుంచి ఎర్రగాలి వీస్తోంది. విరసం వేవ్. విప్లవ ఫార్ములా వేస్తే చాలు, ఈలలూ చప్పట్లతో ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు.

Ads

కానీ ఖాకీవనం క్లోన్ మళ్ళీ రాలేదు.

చాలాకాలం పతంజలి (అచ్చులో) ఏం రాయలేదు. పురాణం గారి జ్యోతి వీక్లీ స్పెషల్ ఇష్యూ “వీరబొబ్బిలి”ని తెచ్చింది. ఖాకీవనానికి, దానికి చాలా తేడా. చెప్పడంలో, చూపడంలో, రాసేవరుసలో అసలు పోలికే లేదు. పతంజలి బ్రాండ్ హ్యూమరూ వెటకారాల్లాంటి క్వాలిటీ గ్యారెంటీ మామూలే, ఐఎస్ఐ మార్కులేని అనేక అభిప్రాయాలు గల మేము అటూ ఇటూ చూసి ఒపీనియన్స్ చేంజ్ చేశాం. అజ్ఞాన సంపద ఉండగా అభిప్రాయాలకు కొదవేంటి?

అయితే ఒపీనియన్స్ చేంజ్ చేసింది మేం కాదు, పతంజలే. రావిశాస్త్రి మిమిక్రీ రాస్తే వేయడానికి పురాణం రెడీ. క్రైం థ్రిల్లర్ కోసం సకల సపరివార పత్రికలూ పేజీలు పరచుకున్నాయి. అర్జంట్ గా అరుణపతాకను చేబూనితే సాహితీలోకాన్ని శాసిస్తున్న గాలివాలులో ఎర్రెర్రగా ఎగిరిపోవచ్చు. ఆదివారం సాహిత్య పేజీల వివాదాల్లో హాట్ కేక్ కావచ్చు, కానీ పతంజలి అలా చేయలేదు.

పతంజలికి అలా జరగనూ లేదు. ఎందువలన? అంటే ఆ దైవఘటన గురించి తెలుగు సాహితీ విమర్శకులు ఎప్పుడో ఒకప్పుడు కనీసం మోకాలు లోతుకైనా విశ్లేషించాలి. (విమర్శకులు వింటారంటారా? వాళ్ళకు తీరిక ఉంటుందంటారా?)

మాలాగా పతంజలితో కలిసి పనిచేసిన వాళ్ళం మాత్రం వైజాగ్ ఈనాడులో ఉన్నప్పుడు ఆ కథ రాశాడూ! తిరుపతికి ట్రాన్స్ ఫరయ్యాక ‘పెంపుడు జంతువులు… ‘ మరి ‘చూపున్నపాట’ ఉదయానికొచ్చాక అని మాటాడుకొంటాం. లేదా నాలాంటివాడు పతంజలి దగ్గరికెళ్ళి కూచుని ఆ చూపున్నపాటేంటండి బాబో, మెలోడ్రామా తాతలాగుందంటే, నీకు తెల్దులేరా అబ్బాయ్! మేజికల్ రియలిజం అని ఒకడున్నాడూ. మార్క్వెజ్ అని మరొకడున్నాడూ అని తెగ డిఫెండ్ చేసుకునేవాడు. మాకు తెలుసులేండీ, మేవూ చదూకునే చచ్చాం, కానీ ఆ మెలోడ్రామా సంగతేటి అని నిలదీస్తే ‘ఏటంతవ్ ఏటంతన్ అంటే నానేటంతనూ” అని వెటకరించేవాడు.

పికాసోకి పింక్ పీరియడ్, ఎల్లో పిరియడ్లున్నయ్. పతంజలికి చేపలు పెంచే పీరియడ్, పిట్టలు పెంచే పీరియడ్, జాతకాలూ ఎస్ట్రాలజీ పీరియడ్ పైకి కనిపించాయి. ఉదయం పత్రిక నుండి బయటికెళ్ళి సొంత పత్రిక పెట్టడం తిరిగొచ్చి పచ్చళ్ళ కొట్టు పెట్టి, అందులో కూచుని ఆస్కార్ వైల్డ్ కంప్లీట్ వర్క్స్ చదువుకుంటుంటే ఫణికుమార్ లాంటి అమాయక సాహిత్యాభిమానులొచ్చి ప్రేమకోసమై పచ్చళ్ళు కొనడం వంటివి కంటికి కనిపించాయి.

టాల్ స్టాయ్ రచయిత. మిగతావాళ్ళంతా తక్కువోళ్ళు, ఫలానోడే గాయకుడు అంటూ అర్ధరాత్రి పతంజలి పాడిన గద్దర్ పాటలే వినిపించాయి. పతంజలిలా కనిపించింది, పతంజలిలా వినిపించింది, అసలు పతంజలి చాలా వేరేమో! అందరూ చేసేపనే చేస్తున్నా ఆయన మాత్రం రచన గురించి… రచన కాని దాని గురించి వంటరిగా వెతుక్కున్నాడు. ఎవరి అడ్రస్ గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగిన దాఖలాల్లేవు. దారి మధ్య లోకువగా కనిపించిన నామిని సుబ్రమణి లాంటి వాళ్ళకి తనకి తెలిసిందో, తెలుసుకున్నా ననుకుందో

చెప్పి వుంటాడంతే.

చివరికి ఇది రచన. ఇది కాదని పతంజలి పట్టాడో లేదో కాని పురాణం మాత్రం ఏదో పసిగట్టాడు.

ఇలాటి భవంతి కట్టలేనందుకూ, ఇలాటి కారు కొనలేనందుకూ, పక్కవాడి మీద పడేడ్చే మల్టీ మిలియనీర్ లాగా “ఇలాటి రచన చేయలేనందుకు” అసూయపడుతున్నానన్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళి గురజాడ తర్వాత వీడేనన్నాడు. వీడు వాడు కదా అని బెంగెట్టుకోవవసరం లేదు. రచనలున్నాయి చాలు, విజయనగరం దగ్గర అలమండ గ్రామ వాస్తవ్యులు కాకర్లపూడి నారసింహ యోగపతంజలి 70వ దశకం మొదట్లో ‘దిక్కుమాలిన కాలేజి’ కథల సంపుటితో కొద్దిపాటి పాఠకజనానికి కనిపించాడు.

జర్నలిస్టు ఉద్యోగం రీత్యా విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ మళ్ళీ వైజాగ్ చుట్టివచ్చినా, ఉదయం, సమయం, ఆంధ్రభూమి ఎడిటర్ గా పనిచేసినా సరే, మా అలమండ, మా జామి పోలీస్ స్టేషన్ అంటూ కబుర్లు చెప్పే విలేజ్ బమ్ గానే మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆయన రాసిన వాల్యూం లెక్కలేనంత ఉంది. అందుకోసం ఆయన వెతికిందీ చదివిందీ వందరెట్లు ఎక్కువ. ఒక సిట్టింగ్ లో కాఫ్కా. కామూ కథలు చెప్తే మరో మీటింగ్ లో దాస్తో విస్కీ

టాల్ స్టాయ్ నవలలొచ్చాయి.

ఇలాటి రీటోల్ద్ కథలన్నీ జ్ఞాపక కథలు’

పేరిట మహానగర్ లో రాశాడు.

‘శభాసో మపాసా’ పేరిట ఉదయం వీక్లిలో మొపాసా కథలెన్నో మళ్ళీ చెప్పాడు. రచయిత కావాలనుకునేవాళ్ళకు బతుకుని పెయింట్ చేద్దామనుకునే వాళ్ళకి ఇవి రెడీమేడ్ గైడ్స్.

80వ దశకం మొదట్లో మా జర్నలిస్టుల బతుకుల మీద ‘పెంపుడు జంతువులు’ నవల మంచి జోకులూ, క్రైమ్, థ్రిల్ తో నడుస్తుంది గానీ ఆ తర్వాత పతంజలి రచనలో పెద్ద స్వీప్, గ్రేట్ లీప్ కనిపించింది.

ఉదయం పత్రిక మొదలయినప్పుడు ఆయన రాసిన 36 వేట కథలు అబ్బురపరుస్తాయి. మా జిమ్ కార్బెట్ అని గానీ మన కార్బెట్ ముత్తాత అని గానీ తెలుగువాళ్ళు బోరవిరుచుకోవచ్చు.

‘అప్పన్న సర్దార్’ చదివి విరగబడి నవ్వలేక చస్తే సంక్షోభకాలంలో ఆయన రాసిన ‘పతంజలి భాష్యం’ ఇమోషనల్ ఇంపల్సివ్ థింకర్‌గా నిలబెడుతుంది.

తర్వాత వచ్చిన ‘గోపాత్రుడు’, ‘పిలకతిరుగుడు పువ్వు’, ‘దెయ్యం ఆత్మకథ’ తెలుగుదేశం అపురూపంగా ప్రపంచానికి చూపి గర్వపడే మాన్యుమెంట్స్ • ప్రపంచంలో జరిగే అనేకమైన అడ్డమైన ఘటనల మీద ప్రతిరోజూ ఎడిటోరియల్ రాయడం కంటే పరమనీచమైన పని లేదని అసహ్యించుకునే పతంజలి రాసిన కొన్ని ఎడిట్స్ జిగేలుమంటాయి.

రాచమల్లు రామచంద్రారెడ్డి చనిపోయినపుడు ఒక్క పావుగంటలో ఆయన రాసిన ‘ఆ ఒక్కడు …’ సంపాదకీయం అంత ఎత్తున కట్టిన పిరమిడ్! గురజాడ, శివశంకరశాస్త్రి, మల్లాది, చాసో, చలం, కొకు, రావిశాస్త్రి లాంటి మనందరి సాంస్కృతిక వారసత్వాన్ని ఒక చిన్న ఎడిట్ ‘కాల్జేతులు లేని’ సాహిత్యంలో పతంజలి ఛాలెంజ్ చేస్తాడు. మనకింతకాలం పాతుకున్న పవిత్రమైన నమ్మకాల కాళ్ళు తెగనరుకుతాడు.

‘గోపీ స్మృతి’ ఈ కథల్ని వేస్తుందంటే ఎంతో గొప్పనిపిస్తోంది. ఇంతకాలం పతంజలి నవలలూ కథలు చాలా నాసిగా అనామకంగా అచ్చయ్యాయి. ఒక్కటీ తిన్నగా రాలేదు. పతంజలి కలెక్టెడ్ వర్క్స్ ని అందంగా ఎవరైనా తీసుకొస్తే బావుంటుంది. ఎవ్వరూ తీసుకురాపోతే యాచన, దొంగతనం, కిడ్నాప్ లేదా క్లేమోర్ లాంటి ఆధునిక పద్ధతుల్లో డబ్బు సంపాయించి నేనే తీసుకువస్తానని భయంగా ఉంది.
ఎందుకంటే పతంజలి లాంటి విస్తృతిగల, తలతిక్క గల ఆలోచన గల, చదవగల, రాయగల పరమ అవకతవక పిచ్చోడు తెలుగు సాహిత్యానికి దొరకడు.

అందుకే ఆ మధ్య ఎవరో వచ్చి ఏదో ఆవిష్కరణ సభలో ఆయన పేరు వేయడానికి ముందు జర్నలిస్ట్, ఎడిటర్, నావలిస్ట్, రైటర్… ఏం రాయమంటారంటే ఏదీ వద్దన్నాడాయన. పేరు ముందు ఏదీ రాయకుండా ఓన్లీ పతంజలి అని వదిలేయమంటారా అని అడిగితే… అవును, ‘ఓన్లీ పతంజలి’ అని రాయండన్నాడు. నిజమేగా!

– Mohan artist
*** *** ***
22-25 ఏళ్ల క్రితం వచ్చిన పతంజలి చూపున్న పాట పుస్తకానికి మోహన్ రాసిన ముందు మాట ఇది.
– Taadi Prakash 9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions