.
Subramanyam Dogiparthi …… ఓ కుంతీపుత్రిక కధ ఈ స్వాతి సినిమా … అయితే ఈ కుంతి ద్వాపర యుగ కుంతి కాదు ; కలియుగ కుంతి … ద్వాపర యుగ కుంతి లోకానికి వెరచి బిడ్డను నీళ్ళపాలు చేసింది … ఈ కలియుగ కుంతి లోకానికి వెరవకుండా బిడ్డను కని , లోకం సూటిపోటి మాటలను భరిస్తూ పెంచుతుంది …
అలా పెరిగిన స్వాతి కర్ణుడిలాగా అవమానాలను సహించకుండా ఎదురు తిరుగుతూ , యుధ్ధం చేస్తూ , జయిస్తూ ముందుకు సాగుతుంది .
Ads
ఓ పేద్ద ఫెమినిస్టుగా మారుతుంది . ఎంతగా అంటే man hours అనే ఎందుకు అనాలి , woman hours అని ఎందుకు అనకూడదు అని ప్రశ్నిస్తుంది . Manual ని Womanual అని ఎందుకు అనకూడదు అని అడుగుతుంది . మాకు రామరాజ్యం అక్కరలేదు ; సీత రాజ్యం కావాలని ధైర్యంగా చెపుతుంది .
రోడ్డు మీద ఆడపిల్లల్ని అల్లరిచేసే చిల్లర గాళ్ళను ఉతుకుతుంది . తననీ , తన తల్లిని ఉంచుకుంటానని అన్న దూరపు బంధువుని తన్ని తరిమేస్తుంది . వేశ్య కూతురు అని అంటే రాళ్ళతో కొట్టి వస్తుంది . ఈ సినిమాలో యుధ్ధం చేసే ఫెమినిస్టు పాత్రలో సుహాసిని గొప్పగా నటించిందా లేక కలియుగ కుంతి పాత్రలో శారద బాగా నటించిందా అంటే చెప్పడం కష్టమే …
ఇద్దరూ చాలా బాగా నటించారు . కూతురే తల్లి అయి తల్లిని పెళ్ళికి ఒప్పించే సీన్లు చాలా బాగుంటాయి . ముఖ్యంగా మహాభారతంలో పరాశర మహర్షి చెప్పిన మాటల్ని వివరించే సీన్ సుహాసిని బాగా నటించింది . భర్త చనిపోయినా , భార్యని విడిచి పారిపోయినా , నపుంసకుడు అయినా స్త్రీ మరలా వివాహం చేసుకొనవచ్చని పరాశరుడు చెప్పాడని తల్లిని ఒప్పిస్తుంది .
ఈ సినిమాకు కధను , స్క్రీన్ ప్లేని నేసుకున్న నిర్మాత కం దర్శకుడు క్రాంతికుమార్ని ప్రత్యేకంగా అభినందించాలి . ప్రధాన పాత్రలను చాలా గట్టిగా రూపొందించారు . మరో ప్రధాన పాత్ర సంయుక్తది . కడుపు నిండా పొడుపు కధలే .
ఆమెకు తగ్గ ప్రియుడు కపిలవాయి దేవుడు అనే పేరు గల శుభలేఖ సుధాకర్ . తన పేరుని కపిల్ దేవ్ గా చెప్పుకుంటూ ఉంటాడు . కపిలవాయి మా బంధువుల ఇంటి పేరు కూడా . నాకు భలే గమ్మత్తుగా అనిపించింది . పైపెచ్చు సంయుక్త క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్ కి పిచ్చ విసనకర్ర . వీళ్ళిద్దరూ ఒక జంట .
మరో జంట రాజేంద్రప్రసాద్ , ముచ్చెర్ల అరుణ . భార్యకు చిన్న నొప్పి కూడా రాకుండా చూసుకునే భర్త తన కళ్ళ ముందే భార్యను సామూహిక మానభంగం చేస్తే తట్టుకోలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు . మరో ప్రధాన పాత్ర జగ్గయ్యది . శారద నర్సుగా పనిచేసే హాస్పిటల్ డాక్టర్ . సహృదయుడు . స్వాతి కన్విన్స్ చేసి తన తల్లిని పెళ్ళి చేసుకునేలా చేస్తుంది . స్వాతి , సంయుక్తలు ఇద్దరూ నడుం బిగించి పెళ్లి పెద్దలవుతారు .
సినిమాలో గొప్ప ఊహించని మలుపు శారదను వదిలి వెళ్ళిపోయిన భర్త శరత్ బాబు పునఃప్రవేశం . బతుకు చివరి రోజుల్లో ఉంటాడు . ఈ పాత్ర పునఃప్రవేశం తర్వాత సుహాసిని నటన ఇంకా బాగుంటుంది . తల్లికి తెలవకుండా తండ్రిని హాస్పిటల్లో ఉంచుతుంది . ఆఖరి సీన్లను క్రాంతికుమార్ చాలా బాగా ఆవిష్కరించారు .
తనంతట తానే జనజీవన స్రవంతి లోకి వచ్చిన తీవ్రవాదిగా భానుచందర్ నటన బాగుంటుంది .
కుటుంబాన్ని జగన్నాధ చక్రాల కింద తోసేసి జనం కోసం వెళ్ళిపోయాడని డాన్సరుగా మారిన చెల్లెలు భానుచందర్ని ఎత్తిపొడుస్తుంది . ఈ ఎత్తిపొడుపు కుటంబాలను వదిలి అడవుల్లో తమ జీవితాలను వ్యర్థం చేసుకునే తీవ్రవాదులు అందరికీ వర్తిస్తుంది .
తల్లినీ పిల్లనూ ఇద్దరినీ ఉంచుకుంటాననే దూరపు బంధువుగా పి యల్ నారాయణ , డాబుసరి మహిళగా రమాప్రభ నటించారు . సినిమా ఘన విజయానికి మరో ప్రధాన వ్యక్తి గణేష్ పాత్రో . ఆయన వ్రాసిన మాటలు కొన్ని చోట్ల ప్రేక్షకులను సైతం నిలేస్తాయి . ఆలోచింపచేస్తాయి . సినిమాలు ఆలోచింపచేస్తాయా అంటే ఆలోచించే శక్తి ఉన్నవారిని తప్పక ఆలోచింపచేస్తాయని నమ్మే వ్యక్తిని నేను .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలే కాదు ; బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది . కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం పాట చాలా బాగా చిత్రీకరించారు క్రాంతికుమార్ . జగ్గయ్య కూతురు సంయుక్త , శారద కూతురు సుహాసిని ఇద్దరూ కలిసి వారిద్దరినీ పెళ్ళి జంటను చేసి రిసెప్షన్లో పాడే పాట . చాలా బాగుంటుంది . వేటూరి వారిని తప్పక మెచ్చుకోవాలి . పాటలన్నీ ఆయనే వ్రాసారు .
మిగిలిన పాటలు చేమంతి పూల మొగ్గ ఏమన్నది , పండు పండు నా బుజ్జి పండు , పగలంతా గగనానికి పూల హారతి , నిషా నిషా కూడా చాలా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ , అనితారెడ్డి , జయచంద్రన్ శ్రావ్యంగా పాడారు .
ప్రేక్షకుల ఆదరణే కాకుండా అవార్డుల వర్షం కూడా కురిసింది . నాలుగు నంది అవార్డులు వచ్చాయి . ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ కధానాయకి ఉత్తమ మాటల రచయిత అవార్డులు వచ్చాయి . రెండు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి . ఉత్తమ చిత్రం , ఉత్తమ కధానాయకి అవార్డులు . International Film Festival of India లో ప్రదర్శించబడింది .
హిందీలోకి కూడా రీమేక్ అయింది ఇదే టైటిలుతో . హిందీలో శశికపూర్ , షర్మిలా టాగోర్ , మీనాక్షి శేషాద్రి , మాధురీ దీక్షిత్ నటించారు . కన్నడంలోకి ఉష అనే టైటిలుతో రీమేక్ అయింది . సుహాసినే కధానాయకిగా నటించింది .
చక్కటి సినిమా . ఈరోజుల్లో సింగిల్ పేరెంట్లు , సింగిల్ పేరెంట్ పిల్లలు కాస్త సాధారణమయింది కానీ నలభై ఏళ్ల కింద పరిస్థితి ఇది కాదు . ఇప్పటికీ జనం బుర్రల్లో గొప్ప మార్పులు వచ్చాయని చెప్పలేం . మొత్తం మీద అందరూ చూడవలసిన సినిమా .
ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . నాకయితే శారద నటనే బ్రహ్మాండంగా నచ్చింది . కధానాయకి సుహాసిని కాబట్టి క్రెడిట్లన్నీ ఆమె ఎకౌంట్లో పడిపోయాయి . మంచి సినిమా . తప్పక చూడండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు…
Share this Article