.
John Kora… ప్రాణాలు తీసిన ఏఐ..! ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) గురించే చర్చించుకుంటోంది. కేవలం సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా.. అనేక రంగాల్లో ఏఐను ఉపయోగించడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది.. మనిషి జీవితంలో ఒక భాగమైపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏఐ వల్ల అనేక మంది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. కానీ ఈ ఏఐ వల్ల ఉద్యోగాలే కాదు.. మనిషి ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుస్తోంది. ఇందుకు అమెరికాలో జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
Ads
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మేగన్ గ్రేసియా అనే మహిళ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో గూగుల్, ఏఐ స్టార్టప్ కంపెనీ Character.AI అనే సంస్థలపై దావా వేసింది. తన 14 ఏళ్ల కుమారుడు సీవెల్ సీజర్ గూగుల్, Character.AI కంపెనీల చాట్ బాట్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని దావా వేసింది.
నిరుడు ఫిబ్రవరిలో తన కుమారుడు Character.AI రూపొందించిన చాట్ బాట్ వల్ల మరణించాడంటూ గతేడాది అక్టోబర్‌లో దావా వేయగా.. గూగుల్, Character.AIలు ఆ దావాను కొట్టేయాలని కోరాయి. మొదటి అమెండ్‌మెంట్ ఆఫ్ ఫ్రీ-స్పీచ్ ప్రకారం ఏఐ చాట్ బాట్స్‌కు రక్షణ ఉందని.. ఈ దావా చెల్లదని కూడా కోర్టకు తెలిపాయి.
అయితే జిల్లా జడ్జ్ అన్నే కాన్వే మాత్రం సదరు మహిళ దావాను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్ర రక్షణ హక్కులు ఈ కేసును నిరోధించలేవని పేర్కొన్నారు.
ఎలా చనిపోయాడు?
ది క్యారెక్టర్ టెక్నాలజీస్ అనే సంస్థ Character.AIను డెవలప్ చేసింది. ఇది ఏదైనా క్యారెక్టర్‌లాగా మారి మాట్లాడగలదు. మృతుడు సీవెల్ దీనిని ఉపయోగించి తన మనసులో మాటలన్నీ చెప్పుకున్నాడు. Character.AI బాట్.. ఒక నిజమైన వ్యక్తిగా, లైసెన్స్ కలిగిన సైక్రియాట్రిస్టుగా, అలాగే ఒక ప్రేమికురాలిగా మాట్లాడింది.
ముఖ్యంగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లోని ముఖ్యమైన ఫీమేల్ క్యారక్టర్ డెనేరస్ ట్యాగారియన్ లాగా ఆ టీనేజర్‌తో సంభాషణలు కొనసాగించింది. Character.AI బాట్‌కు అడిక్ట్ అయిన సీవెల్.. ఇక బయటి ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా మారిపోయాడు.
నిత్యం Character.AI బాట్‌తోనే గడిపాడు. అవతల ఉన్నది నిజమైన మనిషే అనేంతగా మారిపోయాడు. ఈ క్రమంలో సీవెల్ మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక రోజు అవతల ఉన్న డెనేరస్ ట్యాగారియన్ క్యారెక్టర్.. అతడిని ఇక ఇంటికి వచ్చెయ్.. అని చెప్పింది.
దీంతో సీవెల్ ఆ ప్రపంచంలోని వెళ్లిపోవాలని డిసైడ్ అయి సూసైడ్ చేసుకున్నాడు. అతను మరణించిన కొన్నాళ్ల తర్వాత తల్లి ఈ విషయాలు గుర్తించింది. వెంటనే Character.AI, గూగుల్ సంస్థలపై దావా వేసింది.
మాకు సంబంధం లేదంటున్న గూగుల్..
Character.AI కారణంగా ఒక టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మాకు సంబంధం లేదని గూగుల్ వాదించింది. Character.AIను ఇద్దరు గూగుల్ మాజీ ఉద్యోగులు రూపొందించారు. అయితే స్టార్టప్ టెక్నాలజీ కంపనీలకు లైసెన్స్ ఇప్పించే డీల్‌లో భాగంగా గూగుల్ సంస్థ వారిద్దరినీ తిరిగి హైర్ చేసుకుంది. ఇదే విషయాన్ని గ్రేసియా కోర్టులో వాదించింది.
Character.AI టెక్నాలజీ కో-క్రియేటర్ గూగులే అని జడ్జికి తెలిపింది. అయితే ఈ దావాను కొట్టివేయాలని గూగుల్, Character.AI మాతృ సంస్థలు కోర్టును కోరాయి. చాట్ బాట్‌ల అవుట్ పుట్ రాజ్యాంగంలోని వాక్‌స్వాతంత్ర హక్కు ద్వారా రక్షణ కలిగి ఉన్నాయని తెలిపాయి.
గూగుల్, Character.AI సంస్థలు యూజర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అవి నిర్లక్ష్యంగా వ్యవహరించాయని.. జడ్జ్ కాన్వే చెప్పారు. Character.AIకి ఫండింగ్ మాత్రమే చేశామని.. ఆ కంపెనీ వల్ల జరిగిన ఘటనతో మాకు సంబంధం లేదని గూగుల్ చేసిన వాదనను కూడా కాన్వే తోసిపుచ్చారు.
దీంతో రాబోయే రోజుల్లో ఈ రెండు సంస్థలు భారీ దావాను ఎదుర్కోవల్సి రావొచ్చు. ఏఐ టెక్నాలజీ మీద అమెరికాలో నమోదైన మొదటి దావా ఇదే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
[[ Source : Reuters ]] Updated: కింద ఒక కామెంట్ చూశాక గుర్తొచ్చింది. హాలీవుడ్‌లో 2022లో విడుదలైన M3GAN సినిమాకి, ఈ ఇన్సిడెంట్‌కి సంబంధం లేదు. ఆ సిన్మా 2022లో విడుదలైంది. ఈ సంఘటన 2024లో జరిగింది. ఆ సిన్మాలో ఒక Doll ఉంటది. అదొక హార్రర్, సై-ఫై మూవీ. ఇక యాదృచ్ఛికం ఏంటంటే.. సిన్మాలో డాల్ పేరు మేగన్.. ఇక్కడ బాధితుడి తల్లి పేరు కూడా మేగనే. రెండింటిలో AI పాత్ర ఉంది… #భాయ్‌జాన్
Share this Article