(‘పోకిరీ’ సినిమాలో ఇలాంటి సిన్ ఉంది గానీ ఇది వేరే)
“…ప్రొద్దున్నవరకూ ఇది కదలదు-” అన్నాడు రవితేజ బలంగా బెల్ నొక్కుతూ. లిఫ్ట్ కదల్లేదు! ప్రియవద అయోమయంగా అతడి వైపు చూసింది.
మొదటి అంతస్తు వరండాలోంచి వచ్చే గాలి, లిఫ్ట్ ఇనుప వూచలగుండా రివ్వున లోపలికి వస్తూంది. వరండా వెలుతురు కాళ్ళ మీద పడుతోంది. “
Ads
“ఇప్పుడేమి చెయ్యటం?” అంది ఆందోళనగా.
“చెయ్యటానికేమీ లేదు. ఎవరికైనా పైకి వచ్చే అవసరం ఉ౦డి. మళ్ళీ లిఫ్ట్ ఉపయోగిస్తే తప్ప లేకపోతే ప్రొద్దున్న వరకూ ఇంతే… మీ ఇంట్లో ఎవరైనా కంగారుపడతారా?”
ఆమె జవాబు చెప్పలేదు.
“ఎంతసేపలా నిల్చుంటావు కూర్చో” అన్నాడు.
“ఫర్వాలేదు సర్!”
తను కూర్చోక పోతే ఆమె కూడా ఆ పని చేయదని గ్రహించి అతడు ఒక వైపు ఆనుకుని కూర్చుంటూ, ఆమె వైపు సైగ చేశాడు. ఆమె బిడియ పడుతూ ఒద్దికంగా ఒక మూలకి కూర్చుంది. ఆమెలో ముందున్న భయం, ఆందోళన తగ్గటం గమనించాడు.
…
రాత్రి ఒంటిగంట దాటింది. మాగన్నుగా పట్టిన నిద్రలోంచి హఠాత్తుగా అతనికి మెలకువ వచ్చింది. తను కూర్చున్న భంగిమ చూసుకుంటే నవ్వొచ్చింది. ఆమె ఆవులిస్తూ నెమ్మదిగా తల వెనక్కి వాల్చటం అతడికి తెలుసు. తనుకూడా నిద్రలోకి జారుకుంటానని మాత్రం అనుకోలేదు. బయట వరండాలో ఎక్కడా అలికిడి లేదు. పగలంతా హడావుడిగా ఉ౦డే ఆఫీసు కూడా రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉ౦ది.
బయటనుంచి వెలుతురు డైరెక్టుగా ఆమె మీద పడుతూంది. ముందు మోకాళ్ళ మీద పడుకుని, నిద్రలోనే పక్కకి జారిపోయినట్టుంది ఆమె. నల్లంచు తెల్ల చీర. తెల్లటి చర్మం మీద నల్లటి బోర్డరు.
అతడు ఆమె వైపే చూస్తున్నాడు. చిత్రమేమిటంటే, తన భార్యను కూడా అతడు ఇంతకుముందు ఎప్పుడూ అలా పరీక్షగా చూడలేదు.
అలసిపోయిన మొహం నిద్రలో మరింత అందంగా కనపడుతుంది.. చూడటానికేమీ లేదు. కోర్కెకన్నా ఎత్తయిన భావం మనసు నిండినపుడు చూపు ఇంద్రధనస్సు అవుతుంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అతడు చిన్న చిన్న కాగితాల మీద గేయాలు వ్రాసుకునేవాడు. ఎక్కువ పాండిత్యం లేదు. కానీ ఆలోచించే భావుకత్వం ఉ౦ది. గత కొన్ని సంవత్సరాలుగా అది కామర్సు వెనుక మరుగు పడింది. ఈ రోజు రాత్రి అది పురి విప్పటానికి సమాయత్తమవుతూంది.
కనురెప్ప విల్లు – చూపు బాణం.
ధనువాకృతి అధరం – పలుకు తేనె శరం.
ఇంటి ముందు జూకా మల్లె తీగె నీ చిరునవ్వు.
నిన్న రాత్రి వర్షంలో తడిసిన నా గేయం బోగస్ విల్లా పందిరిపై ప్రేమై పూసింది.
సామాజిక కొమ్మల మధ్య నుంచి నక్షత్రం చివరి వెలుగు బెరుగ్గా చూస్తోంది.
నా పిరికితనాన్ని చూసి నవ్వే నీ మెడ క్రింది లాకెట్టు.
రెండు రాత్రుళ్ళ మధ్య నలుగుతూన్న పగలులా ఉ౦ది.
ఆమె అట్నుంచి ఇటు తిరగడంతో మెడ మీద నుంచి క్రిందికి జారిన పైట, నేల మీద జీరాడుతుంది. తల క్రింద మోచెయ్యి ఉ౦డటం వల్ల, మెడ క్రిందుగా వెళ్ళే గీత మరింత లోతై కారు మబ్బుల మధ్య కదిలే మెరుపు తీగలా జాకెట్టు లోపలకి వంపు తిరిగి అదృశ్యమైంది. ఒక వక్షోజం సగం వరకూ చేతి మలుపులో కప్పబడి పోవటం వలన, గోచరమైన అర్ధభాగం పరమార్థం పొందింది. రెండోది పూర్ణ కుంభమవటంతో రెండొందల పేజీల కుమారసంభవం పుస్తకం మీద ఆరొందల పేజీల మనుచరిత్ర పుస్తకాన్ని అన్చినట్టుంది. పూర్ణకుంభపు విశృంఖలత్వం కూడా మనుచరిత్రకు సరిపోయేట్టే ఉ౦ది. కుమార సంభవంలో పార్వతి తండ్రి చాటు బిడ్డ కదా. పైట వెనుకే బుద్దిగా ఉ౦టుది. వరూధిని అలాకాదు. అనుకున్నది సాధించ గలదు.
అతడు బలవంతంగా కళ్ళు తిప్పుకుని గాలికి ఎగురుతున్న పైటను నిండుగా కప్పేడు. అలా కప్పుతూ ఉ౦డగా ఆమెకి సగం మెలకువ వచ్చి ఆ సగం నిద్రలోనే అతడి చెయ్యి గట్టిగా పట్టుకుని అలాగే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె స్పర్శ అతడి గుండె లోపలి కవాటాల్లో గంధం రాసినట్టు అయింది. చెయ్యి ఆమె మెడ దగ్గరగా ఉ౦డటంవల్ల ఉచ్వసించేటప్పుడు అతడి చేతి మీదుగా వెళ్ళే హేమంత పవనం- నిశ్వసించేటప్పుడు గ్రీష్మమౌతూంది………… (యండమూరి వీరేంద్రనాథ్…. నల్లంచు తెల్లచీర రీప్రింట్ నుంచి ఓ భాగం)
అవునూ… ఇలాంటిది సినిమాకరించడం ఎలాంటి దర్శకులకు సాధ్యం..? అందుకే సింపుల్‌గా దొంగ మొగుడు సినిమాలో చిరంజీవి, భానుప్రియ ‘‘ నీ కోకకింత కులుకెందుకు.. రప్పపపరప్పప… రప్పపపప… నీ రైకకింత బిగువెందుకు…’’ అంటూ స్టెప్పులేసుకుంటారు… ఫ్యాన్స్ ఈలలు వేస్తారు… శుభం… (ముచ్చట)
Share this Article