Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…

July 11, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల ) ….. గురువుగారు నమస్కారం.. నాకు వచ్చిన ఈ నోబెల్ మీదే. భౌతికంగా సాధకుడిని నేనే అయినా… ఇది నాకు దక్కడానికి.. దీన్ని నేను సాధించేలా ఎదగడానికి మీరే కారణం. మీరు మాత్రమే కారణం…

ఇదీ మొట్టమొదటి పాకిస్తాన్ నోబెల్ లారెట్… మంచంలోంచి లేవలేని స్థితిలో పడుకుని ఉన్న మన ఇండియన్ గురువు మెడలో ఆ నోబెల్ బహుమతిని వేస్తూ చెప్పిన మాటలు… ఒక్కసారి ఊహించుకోండి ఈ సీన్. ఆ సీనే.. ఇదిగో కంటికి కనిపించే ఈ ఛాయాచిత్రం.

Ads

guru

తెల్లార్లేస్తే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పాక్ చేసే కుట్రలు, కవ్వింపు చర్యలు, దాడులు.. పాక్ అంటేనే అగ్గిమీద గుగ్గిలమై తిప్పి కొట్టాలనుకునే అనివార్య పరిస్థితులను చూస్తున్నాం.

మొత్తంగా ఎంత అతికినా సాధారణ స్థితిని పొందలేని పరిస్థితుల్లో రెండింటి మధ్య అగ్గి వేస్తే భగ్గుమనే కాలానికి మనం సాక్షులం. ఉప్పునిప్పు మాదిరిగా రెండు దాయాదీ దేశాలు తయారై.. కనీసం క్రీడలు కూడా తటస్థ వేదికల్లో మినహా.. ఒకరి వేదికల్లో ఇంకొకరు ఆడే పరిస్థితి లేని రోజులవి. ఈ క్రమంలో నిన్నటి గురుపూర్ణిమ సందర్భంగా ఓ భారతీయ గురువుకు శిష్యుడైన పాకిస్తానీ నోబెల్ లారెట్ డాక్టర్ అబ్దుస్ సలాం స్టోరీ ఓసారి చెప్పుకోవాలి మనం.

అది 1979.. సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఓ విప్లవాత్మక ప్రయోగానికి…షెల్డన్ గ్లాషో, స్టీవెన్ వీన్ బర్గ్ తో కలిసి.. అబ్దుస్ సలాంకు నోబెల్ బహుమతి లభించింది. unification of electromagnetism and the weak nuclear force in the electroweak. ఇది 20 శతాబ్దంలో చెప్పుకోదగ్గ ఓ అఛీవ్ మెంట్.

1978లో ఈ థియరీని ప్రతిపాదించగా.. 1979లో అబ్దుస్ సలాం నోబెల్ అందుకున్నారు. అహ్మదీయ తెగలో పుట్టినందుకు ఎక్కడైతే నాన్ ముస్లింగా వివక్షకు గురయ్యాడో.. అదే పాకిస్తాన్ దేశంలో ఒకే ఒక్కడిగా మొట్టమొదట నోబెల్ బహుమతి అందుకున్న విజేత అబ్దుస్ సలాం. ఆయన్ను చూసి ఆ దేశం ఒకవైపు గర్వపడాలో.. లేక, వివక్ష కనబర్చినందుకు మరోవైపు సిగ్గుపడాలో కూడా దిక్కుతోచని పరిస్థితికి నెట్టివేసిన చరిత్ర పాక్ ది.

ఇక ఆ సీన్ కట్ చేస్తే.. ఆయన గురువు కోసం ఆరా తీయడం మొదలెట్టాడు. ఆ క్రమంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కూడా అబ్దుస్ సలాం సంప్రదించినట్టు.. దేశ విభజనకు పూర్వం తనకు లాహోర్ లోని సనాతన ధర్మ్ కళాశాలలో గణితం బోధించిన ప్రొఫెసర్ అనిల్ గంగూలీ జాడ చిరునామాకై అభ్యర్థించినట్టూ చెబుతారు.

మొత్తంగా తనకు 1979లో నోబెల్ బహుమతి లభించినా… గురువును కలిసి ఆ ఆనందాన్ని, అనుభూతిని షేర్ చేసుకోందే ఎందుకో అబ్దుస్ సలాంలో ఏదో అసంతృప్తి కనిపించేదట. అలా మొత్తంగా 1981లో గురువు ఆచూకీ లభించింది.

1981, జనవరి 19వ తేదీ.. అది కలకత్తా నగరంలోని ఓ సాంప్రదాయక పద్ధతిలో ఉన్న ఇల్లు.. ఓ గదిలో పట్టె మంచంపై కదలలేని స్థితిలో పడుకున్న గురువైన ప్రొఫెసర్ అనిలేందర్ గంగూలీ… ఆ మంచం పక్కనే కుర్చీలో నోబెల్ బహుమతి చేతిలో పట్టుకుని కూర్చున్న అబ్దుస్ సలాం..

పాకిస్తాన్ నుంచి నోబెల్ లారెట్ రావడంతో ఆ ఇంటివద్ద కిక్కిరిసిన జనం.. మొత్తంగా అప్పటికే ఎవ్వరూ బాగు చేయలేనంత బీటలు వారిన భారత్, పాక్ బంధం నేపథ్యంలో.. నాటి ఆ దృశ్యం ఓ నోస్టాల్జియా!

గురువును కలవాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న ఓ నోబెల్ లారెట్… కలిసిన తర్వాత దృశ్యరూపమైన ఆ ఉద్విగ్న క్షణాల నడుమ.. అబ్దుస్ సలాం ఆ నోబెల్ బహుమతిని తన గురువు అనిలేందర్ గంగూలీ మెడలో వేశాడు.

  • గణితంపై మీకున్న మక్కువ.. ఆ మక్కువతో మాకొంటబట్టించిన లెక్కలు.. ఇదిగో ఇవాళ నాకు నోబెల్ బహుమతిని తెచ్చేలా చేశాయంటే నేనొక టూల్ ను మాత్రమే.. కానీ, ఈ విజయానికి ప్రథమ కారకులు మీరే సార్ అంటూ డాక్టర్ అబ్దుస్ సలాం.. తన గురువు అనిలేందర్ గంగూలీ పాదాలపై పడిపోయారట.

అదే అనిలేందర్ గంగూలీ.. లాహోర్ లో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఆయనకేనాడూ విభజనకు ముందు కనీసం గౌరవం కూడా దక్కని ప్రాంతమది. కానీ, ఆ దేశానికే మొట్టమొదటి నోబెల్ బహుమతి విన్నర్ గా ఘనత సాధించిన అబ్దుస్ సలాం మాత్రం గురువు కోసం వెతికి.. చివరకు ఆయన్ను చేరుకుని… ఆయన మెడలో తనకొచ్చిన నోబెల్ బహుమతిని వేసి.. గురువు పాదాలకు నమస్కరించడమేదైతో ఉందో… ఓ కదిలించే కథ!

తన దేశంలోనే తనకెదురైన వివక్ష!

అబ్దుస్ సలాం 1926, జనవరి 9న పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ సమీపంలో ఝాంగ్ అనే గ్రామంలో జన్మించాడు. ఓ మధ్య తరగతి కుటుంబీకుడు. ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన అబ్దుస్ సలాం.. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో గణితంలో అత్యధిక మార్కులతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

జస్ట్ 17 ఏళ్ల వయస్సులోనే తన మొదటి పరిశోధనా పత్రాన్ని ప్రచురించాడు. అయితే, తన ఆవిష్కరణలో సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఏకీకరణ సిద్ధాంతాన్ని ప్రపంచానికందిస్తాడని మాత్రం బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు!

పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనలు, న్యూక్లియర్ టెక్నాలజీ పురోగతిలో అబ్దుస్ సలాంది కీలకపాత్ర. 1960 నుంచి 1974 వరకూ పాకిస్తాన్ కు సైన్స్ సంబంధిత విషయాల్లో ప్రధాన సలహాదారుగా పనిచేశారు. 1962లో పాకిస్తాన్ న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ కు అనుబంధకుడిగా… పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా.. అదే దేశానికి చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్ ఐ. హెచ్. ఉస్మానీతో కలిసి పాక్ ను న్యూక్లియర్ టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్లడంలోనూ అబ్దుస్ సలాం కీలకపాత్రధారి.

అయితే 1974లో అహ్మదీ ముస్లింలను ముస్లిమేతరులుగా ప్రకటించే బిల్లును పాక్ ప్రవేశపెట్టడంతో.. నిరసనగా అబ్దుస్ సలాం పాకిస్తాన్ ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయటకొచ్చిన అబ్దుస్ సలాం.. విదేశీ యూనివర్సిటీల్లో పనిచేశారు. లండన్ ఇంపీరియల్ కళాశాల థియరీటికల్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేసిన అబ్దుస్ సలాం.. కేంబ్రిడ్జ్ లోనూ పనిచేశారు.

1996, నవంబర్ 21న బ్రిటీష్ నగరమైన ఆక్స్ ఫర్డ్ లో కన్నుమూసిన సలాం!

అణుపరీక్షలకుగాను శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ పాక్ ప్రభుత్వం కొందరి స్టాంపులను విడుదల చేయగా.. అందులో అబ్దుస్ సలాం ఒకరు. 1960 నుంచి 1974 వరకూ పాక్ అణుపరీక్షలు, సైన్స్ సంబంధిత సాంకేతిక పరీక్షల్లో సలాంది చాలా కీలకపాత్ర. అయినప్పటికీ ఇప్పటికీ పాక్ లో ఆయన జయంతి గానీ, వర్ధంతి గానీ పెద్దగా నిర్వహించడం లేదన్న విమర్శల జడివాన మరోవైపు కురుస్తూనే ఉంది.

అబ్దుస్ సలాం రెహమాన్ జీవితంపై డాక్యుమెంటరీ!

2019లోనే అబ్దుస్ సలాం రెహమాన్ జీవితంపై ఓ డాక్యుమెంటరీని రూపొందించగా.. అది నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో కూడా ఆయన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 6 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డ్సును కూడా అందుకుంది అబ్దుస్ సలాం జీవిత చరిత్ర.

సలాం విషయంలో పాక్ వ్యవహారశైలి.. ఆయన సేవలకు దక్కాల్సిన రీతిలో దక్కకుండా పోయిన గుర్తింపు వంటి ఎన్నో విషయాలతో పాటు.. ఆయన కుటుంబ నేపథ్యం.. సలాం మేథోపటిమ గురించి వివిధ శాస్త్రవేత్తల ఇంటర్వ్యూస్ తో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. మొత్తంగా పాక్ సంకుచితత్వ ధోరణులూ ఈ డాక్యుమెంటరీలో ప్రతిబింబించేలా చిత్రీకరించారు.

అప్పటికే పాక్ పై అబ్దుస్ సలాం విషయంలో అంతర్జాతీయ మేథో సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. 1996లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ కేంద్రంగా వెలసిన క్వాయిద్- ఏ- అజామ్ యూనివర్సిటీలోని నేషనల్ సెంటర్ ఫర్ ఫిజిక్స్ పేరును అబ్దుస్ సలాం సెంటర్ గా మార్చారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఏ దేశం నుంచి మొట్టమొదటగా అత్యున్నత నోబెల్ ప్రైజ్ విన్నర్ గా ఎదిగారో… అదే దేశం గురించి సలాం కొన్ని వ్యాసాల్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ వెనుకబాటుకు.. తిరోగమనానికి ఎడ్యుకేషన్ పాలసీనే ప్రధాన అవరోధంగా ఆయన చెప్పుకొచ్చారు.

విద్యావిధానానికీ, ఆర్థిక పురోగతికి కూడా కచ్చితంగా ముడి పడి ఉన్న విషయాన్ని గమనించాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా ఆ పాలసీని పకడ్బందీగా రూపొందించాల్సిన ఆవశ్యకతనూ ఆయన తన ఆర్టికల్స్ ద్వారా కుండబద్ధలు కొట్టారు.

అయితే, దాయాది దేశమంటే ఏ కోశానా ఒక సదభిప్రాయాన్ని కల్గిలేని పాకిస్తాన్ వంటి దేశం నుంచి… భారత్ లో ఉన్న గురువును కలిసేందుకు సమయం వెచ్చించిన ఓ నోబెల్ లారెట్ పుట్టడం విశేషం. అందుకే ఆయన చరిత్ర సృష్టంచిన నోబెల్ ప్రైజ్ విన్నర్ గానే కాదు.. నోబుల్ మ్యాన్ గా కూడా రికార్డులకెక్కారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions