2021… ఏప్రిల్ 19 దాటి 20లో పడబోతోంది… అవి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ క్వార్టర్స్… ఓ ఆఫీసర్ అప్పటిదాకా మందుకొట్టాడు… మనిషి సోయిలో లేడు… ఏమనిపించిందో ఏమో, బయటికి వచ్చాడు, పక్కింటి తలుపు తట్టాడు…
ఆ పక్కింట్లో ఒక లేడీ… పెళ్లయింది… తోడుగా ఆరేళ్ల పిల్లాడు… భర్త కూడా సీఐఎస్ఎఫ్ అధికారే… ఈ మందుబాబుకు కొలీగ్… తను అప్పుడు బెంగాల్‌లో ఎన్నికల డ్యూటీకి వెళ్లాడు… సో, ఆమె తన చిన్న వయస్సు కొడుకుతో ఉంది… తన తలుపుతట్టిన పక్కింటి మందుబాబు వైపు ప్రశ్నార్థకంగా చూసింది… ఏమిటీ అన్నట్టుగా…
‘ఎస్‌కుస్‌మీ… మందెక్కువై కడుపు అప్‌సెట్ అయ్యింది… ఇంట్లో రెండు నిమ్మకాయలు ఉంటే ఇస్తారా..? లోపలకు వచ్చి తీసుకోనా..?’ అన్నాడు ఖుషీ సినిమాలో ఆలీ టైపులో… కంపు వాసన… పైగా అదేదో పిచ్చి కారణం చెబుతున్నాడు… మనిషి మామూలుగా బాగానే మర్యాదగానే ఉంటాడు కదా, మరి ఇదేం రోగం, అదీ ఈ దొంగ రాత్రి వేళ అనుకుని మొహం చిట్లించింది…
Ads
తను కదల్లేదు, నిమ్మకాయలు ప్లీజ్ అంటున్నాడు… ఆమె భయంతో తనను వెనక్కి నెట్టేసి, తలుపు వేసుకుంది… ఛిఛీ, పొరుగిల్లే అయినా కాసింత కూడా మర్యాద లేదు అనుకుంటూ సదరు ఆఫీసర్ తనింట్లోకి వెళ్లిపోయాడు… సీన్ కట్ చేస్తే…
భర్తకు చెపింది… భర్త కోపంగా తన పైఅధికారులకు చెప్పాడు… వాళ్లేం చేశారంటే… ఒరేయ్, నీకిదేం రోగంరా… అంత దెయ్యాల రాత్రి ఆమె ఒక్కతే ఉందని తెలిసీ అక్కడికి ఎందుకెళ్లినట్టు..? ఏదో దురుద్దేశం ఉంది నీకు… నాన్సెన్స్, నీ జీతంలో కోత పెడుతున్నాం, మూడేళ్లపాటు ఇంక్రిమెంట్ కూడా లేదు… పిచ్చిపిచ్చిగా సమర్థించుకోవాలని చూస్తే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పారు…
జీతంలో కోత సరే, కానీ తోటి ఉద్యోగుల్లో ఇజ్జత్ పోయింది… దాంతో కోర్టుకెక్కాడు మన మందుబాబు… ఛస్, మా సుపీరియర్స్ తీసుకున్నది నాన్సెన్స్, స్టుపిడ్, అబ్సర్డ్ ఎట్సెట్రా డెసిషన్… అరె, కడుపు అప్‌సెటయితే పక్కింటికి వెళ్లి నిమ్మకాయలు అడిగితే తప్పా..? ఆమాత్రం ఆదుకోకపోతే ఇక పక్కిల్లు దేనికి..? మా అధికారులు తీసుకున్నది చెత్తా డెసిషన్, మీరైనా గడ్డిపెట్టండి మావాళ్లకు అని వాదించాడు…
దిగువ కోర్టులు దాటి, బాంబే హైకోర్టు దాకా వచ్చింది కేసు, అదీ సింగిల్ జడ్జి కాదు, జస్టిస్ నితిన్ జామ్‌దార్, జస్టిస్ ఎంఎంసథయే ఉన్న డివిజన్ బెంచ్… మావాళ్లు జీతం కోశారు, పెనాల్టీ వేశారు, ఇంక్రిమెంట్ ఆపారు, ఇదేం అన్యాయం యువరానర్, రాజ్యాంగంలోని అన్నిరకాల హక్కులకూ ఇది భంగకరం కాదా అనడిగాడు… నాది అప్పుడు మెడికల్ యమర్జెన్సీ అనీ అన్నాడు…
మందెక్కువైతే డీహైడ్రేషన్ తప్పదు, కడుపు అప్‌సెట్ కాకతప్పదు, వెంటనే డీహైడ్రేషన్ తగ్గించే చిట్కాలు పాటించకపోతే ఇంకా డేంజర్, ఆ ప్రాణావసర వేళ నేను పక్కింటి తలుపు కొడితే తప్పా యువరానర్ అని అమాయకంగా ప్రశ్నించాడు… జడ్జిలకు మతి తిరిగిపోయింది…
‘ఠాట్, నీ వివరణ ఫూలిష్‌గా ఉంది… ఎవరు నమ్ముతారు ఈ దిక్కుమాలిన పిచ్చి సాకులు..? నీ ప్రవర్తన నీ ఉద్యోగానికి తగినట్టు లేదు, నీ పైఅధికారులు తీసుకున్న నిర్ణయం కరెక్టే… మేమయితే ఇంకా ఎక్కువ శిక్షే వేసేవాళ్లం, మూసుకుని వెళ్లిపో’ అన్నట్టుగా చెప్పి కేసు క్లోజ్ చేసేశారు… ఈ తీర్పుతో హతాశుడైన ఆయన ఆ రాత్రి ఎంత తాగాడో మాత్రం తెలియదు… పక్కింటి కొలీగ్ జాగ్రత్తగా ఉంటున్నాడు కదా, ఆ తలుపు మాత్రం తట్టిఉండడు మళ్లీ..!!
(ఇంతకీ సదరు అధికారి ఏ ఉద్దేశంతో ఆ రాత్రి ఆమె తలుపు తట్టాడు… ఎందుకు ఈ నిమ్మకాయల కథ అల్లాడు..? పబ్బుకు ఎందుకు పోయావురా అంటే అక్కడ పునుగులు బాగుంటాయి అని చెప్పినట్టు ఉందా…? మీ ఇష్టం, మీరే అర్థం చేసుకోవాలి…)
Share this Article