– తోట భావనారాయణ – ఒక ప్రయోజనం ఆశించి అబద్ధమాడటం వేరు, అనైతికంగా చేసిన పని కూడా అనుకోకుండా పనికిరావటం వేరు.
2004 ఎలక్షన్స్ టైమ్ లో తేజా టీవీ కొంతమంది ముఖ్యమైన లీడర్స్ ప్రచారాన్ని A Day with the Leader కాన్సెప్ట్ తో రోజంతా కవర్ చేసి దాన్ని ఒక అర్థ గంటకు కుదించి ప్రసారం చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా ఏప్రిల్ 15న రిపోర్టర్ రాజేశ్వర శర్మ గారు కరీంనగర్ లో చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రచారాన్ని కవర్ చేయటానికి కెమెరా క్రూను వెంటబెట్టుకొని వెళ్లారు. అక్కడ విద్యాసాగర్ రావుకు ప్రత్యర్థి కేసీయార్ కావటం వల్ల కూడా ప్రాధాన్యం బాగా పెరిగింది.
Ads
ఆరోజు ప్రచార కార్యక్రమాలన్నీ రికార్డు చేస్తూ మధ్యాహ్నమయ్యేసరికి లంచ్ బ్రేక్ ఇచ్చారు. కెమెరామన్ కెమెరా ఆఫ్ చేయటం మరచిపోయారు. అప్పుడే విద్యాసాగార రావు గారికి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ సంభాషణ కూడా రికార్డయింది. మరుసటి రోజు ఆ ప్రోగ్రామ్ ఎడిట్ చేసేటప్పుడు ఆయన మాట్లాడేది అనవసరం కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఎడిటింగ్ పూర్తిచేసి ప్రసారం చేశాం. తరువాత ఆయన ఫోన్ సంభాషణను కేసెట్లో నుంచి కూడా తీసేయమన్నా.
- ఆ మరుసటి రోజు (17 వ తేదీ) మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో బెంగళూరు నుంచి మా ఉదయ టీవీ ప్రకాశ్ చంద్ర నుంచి ఫోన్. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయారన్నది ఆ వార్త సారాంశం.
పది నిమిషాల్లో వీడియో పంపుతానన్నాడు గానీ మేం ఆ షాక్ నుంచి కోలుకోవటానికే పది నిమిషాలు పట్టింది. తేరుకున్నాక ఆ బులిటెన్ స్వరూపం ఎలా ఉండాలో చర్చించుకున్నాం. జెమినీ టీవీలో ఆమె ఆఖరి ఇంటర్వ్యూలో కొన్ని భాగాలు ఎడిట్ చేసి ఈ సదర్భానికి తగినట్టు ఆమె మాట్లాడిన తాత్విక విషయాలు వాడుకున్నాం.
వెంటవెంటనే వస్తున్న సినీ ప్రముఖుల సంతాప సందేశాలు కూడా కలిపాం. అప్పుడు మా తేజా రిపోర్టర్ రాజేశ్వర శర్మ గారు ఆ కాసెట్ లో ఉన్న ఫోన్ సంభాషణ గుర్తు చేశారు. అది హెలికాప్టర్ గురించేనని చెబితే ఇంకా ఎరేజ్ చేయలేదా అనుకుంటూనే వెతికాం.
కాసెట్ దొరికింది. అనుకోకుండా రికార్డయిన భాగం ప్లే చేసి విన్నాం. అది సౌందర్య అన్న అమర్ నాథ్ గారికీ, విద్యాసాగర్ రావు గారికీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఆ ఫోన్ సంభాషణకు కొంత నేపథ్యం ఉంది.
బీజేపీలో చేరిన సౌందర్య ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి ఒప్పుకున్నారు. (నిజానికి ఆమె చాలా సింపుల్ లైఫ్ కోరుకుంటారు. హైదరాబాద్ లో షూటింగ్స్ కోసం వస్తే హోటల్ అడగరు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10 లో కార్వీ వెనుక ఉండే ప్రశాంత్ కుటీర్ లోనే ఉంటారు. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్సులు వచ్చాయి).
అందుకే 17 న విద్యాసాగర్ రావు గారికి ప్రచారం చేయటానికి సౌందర్య రావాల్సి ఉంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో కిషన్ రెడ్డి గారికీ ఆమె ప్రచారం చేయాలి. మరుసటి రోజు చెన్నైలో షూటింగ్ కి వెళ్ళిపోవాలి. అందువలన హెలికాప్టర్ అయితేనే ఇవన్నీ కుదురుతాయని అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అది కన్ఫర్మ్ చేసుకోవటానికే సౌందర్య అన్న అమర్ నాథ్ ఆ రోజు విద్యాసాగర్ రావు గారికి ఫోన్ చేశారు. ఆయన మాటలు విన్న తరువాత విద్యాసాగర్ రావు గారి మాటలు స్పష్టంగా రికార్డయ్యాయి.
- “హెలికాప్టర్ పెద్ద సమస్య కాదు. నేను ఖర్చు గురించి ఆలోచించటం లేదు. కానీ ఈ ఎలక్షన్స్ టైమ్ లో సరైన కండిషన్ లో ఉన్న హెలికాప్టర్ దొరకటమే పెద్ద సమస్య. … మీరు తప్పనిసరి అంటే బెంగళూరులో అందుబాటులో ఉన్న హెలికాప్టర్ అరేంజ్ చేసుకోండి. డబ్బు కట్టేద్దాం. ఎల్లుండి మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది” అన్నారు. అలా ఆయన చెప్పటం, అవతల ఉన్న అమర్ నాథ్ సరేననటం, ఫోన్ పెట్టేయటం రికార్డయింది.
అలా రికార్డు చేయటం అనైతికమే అయినా, ఆ రోజు ఆ సంభాషణకు చాలా విలువుంది. ఆమె హెలికాప్టర్ ప్రయాణానికి కారణం చెప్పే వీడియో అది. నిజంగా ఆరోజు విద్యాసాగరరావు గారి మాటలు విని హెలికాప్టర్ ప్రయాణం ఆగిపోయి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేవారేమో. ఇదే విషయం ప్రేక్షకులకు చెప్పటం అవసరమనిపించింది.
అందుకే ఆ సంభాషణ యథాతథంగా ప్రసారం చేశాం. ఆ వార్త అలా రావటం తనకు ఎంతగానో ఉపయోగపడిందని విద్యాసాగర్ రావు గారు పదే పదే థాంక్స్ చెప్పారు. “నా ప్రచారానికి బయలుదేరటం వల్లనే సౌందర్య చనిపోయిందని ఆమె అభిమానులు ఎలాగూ నన్ను జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు. కానీ, కనీసం నేను ముందే హెచ్చరించిన విషయం తెలియటం వల్ల ఆ తీవ్రత కాస్త తగ్గింది” అన్నారు.
ఆ విధంగా అనుకోకుండా రికార్డ్ అయిన ఆ ఫోన్ సంభాషణ తొలగించకపోవటం అనైతికమే అయినా, ఒక నిజాన్ని బయటి ప్రపంచానికి చెప్పటానికి ఉపయోగపడింది. అంతమాత్రాన అలా రికార్డ్ చేయటాన్ని సమర్థించుకోవటం లేదు. సౌందర్య అభిమానులకు నిజమేంటో చెప్పటానికి అవకాశం దొరికిందన్నదే మాకు సంతృప్తినిచ్చింది…..
Share this Article