ఫోటో జర్నలిస్ట్ పర్యావరణవేత్తయ్యాడు! ఎడారిని జయించి అడవిని సాధించాడు!!
డీఫారెస్టేషన్.. ఇప్పుడిది పెద్ద సమస్య. ఏదో నాల్గు మొక్కలు నాటితే తిరిగి పర్యావరణ సమతుల్యతను పొందేది కాని భవిష్యత్ ఉత్పాతం. అర్బనైజేషన్ మూలమా అని పల్లెలు పోయి పట్టణాలు అవతరిస్తూ.. ఊళ్లకూళ్లు మట్టి కనిపించని కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న రోజులు. ఎక్కడికక్క వివిధ మానవ అవసరాల కొరకు, విలాసాల పేరిట కొండలు, గుట్టలు, చెట్లు.. తద్వారా ఎన్నో ప్రాణులు.. ఇలా మొత్తంగా జీవవైవిధ్యానికే ప్రమాదం ముంచుకొస్తున్న జమానా ఇది. ఈ ప్రమాదమే.. బ్రెజిల్ లో ఓ ఫోటోగ్రాఫర్ ను ఆలోచింపజేసింది. అవార్డ్ విన్నింగ్ ఫోటో జర్నలిస్టుగా తనలో కల్గిన సంకల్పానికి.. తన భార్య కూడా తోడైంది. ఇద్దరూ కలిసి.. ఎడారిని అడవిగా మార్చేసిన కథ ఇది.
సెబాస్టియో సల్గాడో, లెలియా డెలూయిజ్ వానిక్ సల్గాడో.. ఈ దంపతులిద్దరి రియలైజేషన్… ఫారెస్ట్ నుంచి ఎడారిగా మారిన ప్రాంతాన్ని మళ్లీ దట్టమైన అడవిగా మార్చేసింది. ఆ ప్రాంతం ఇప్పుడు పక్షుల కిలకిలారావాలు, వైల్డ్ లైఫ్ యానిమల్స్ అరుపుల్లో జీవివైవిధ్యంతో తులతూగుతున్నది.
Ads
యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. 1990 నుండి అటవీ నిర్మూలన కారణంగా 129 మిలియన్ హెక్టార్ల అడవి.. అంటే దాదాపు దక్షిణాఫ్రికాకు సమానమైన ప్రాంతమంతా.. డీఫారెస్టేషనైపోయింది. ప్రతీ ఏటా పనామా దేశపు పరిమాణంమంత ప్రాంతం.. అడవులను కోల్పోతూ ఎడారులుగా మారుతున్నాయి. దీంతో సుమారు 15 శాతం గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు భూతాపానికి కారణమవుతున్నాయి. ఇక లెక్కలేనన్న జాతుల మొక్కలు, జంతువులు తమ ఆవాసాలనే కోల్పోతున్నాయి. ఇది రానున్న రోజుల్లో.. మొత్తం భౌగోళికంగా ఓ పెద్ద ప్రమాద హెచ్చరిక.
ఈ హెచ్చరికే.. బ్రెజిల్ ఫోటో జర్నలిస్టైన సెబాస్టియో సల్గాడోలో ఆలోచన రేకెత్తించింది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా తిరిగిన సెబాస్టియో.. ఫోటో జర్నలిస్ట్ గా అందుకోని అవార్డ్స్ లేవు. ఒక అరడజన్ బుక్స్ కూడా సెబాస్టియో రచనలకు సంబంధించి ప్రచురితమయ్యాయి. మొత్తంగా సెబాస్టియో అనే ఫోటో జర్నలిస్ట్ ప్రాశ్చాత్యదేశాల్లో అంత పాప్యులర్ ఫిగర్. 1990 వ దశకంలో అప్పటికే మధ్య ఆఫ్రికాలోని రువాండా జినోసైడ్ అటవీప్రాంతాన్ని ఓ ఫోటో జర్నలిస్ట్ గా బంధించే క్రమంలో సెబాస్టియో చలించిపోయాడు. అంత పెద్ద అటవీప్రాంతంలో డీఫారెస్టేషన్ తో జీవవైవిధ్యం దెబ్బతినడం చూసి.. సెబాస్టియోలో ఒకింత విచారం మొదలైంది. అదే సమయంలో తన సొంత దేశమైన బ్రెజిల్ కు తన భార్యతో తిరిగి పయనమయ్యాడు. కానీ, తను బాల్యం నుంచి యవ్వనం వరకూ చూసిన అడవి కనిపించలేదు. అంతా ఎడారిలాగా మారిపోయింది. తన సొంత ఊళ్లోనూ మధ్యఆఫ్రికా పరిస్థితులే కళ్లకు కట్టాయి. దాంతో.. సెబాస్టియోతో పాటు, ఆయన భార్య లెలియా డెలియూజ్ లో అడవుల పెంపకంపై ఆలోచనలకు బీజం పడింది.
అనారోగ్యంగా ఉండే మనిషి ఏవిధంగా బాధపడుతాడో… చెట్లు లేని ఎడారి ప్రాంతంలోని ప్రకృతీ అదే వేదననుభవిస్తుందనేది సెబాస్టియో భావన. అందుకే సెబాస్టియో.. తన భార్య లెలియా కలిసి… చెట్ల పునరుద్ధరణతో.. 0.5 శాతానికి పడిపోయిన అడవుల పెంపకం కోసం ఏకంగా ఇనిస్టిట్యూట్ టెర్రా అనే ఓస్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అలా సంస్థ ఆధ్వర్యంలో ఏకంగా నాల్గు మిలియన్ల మొక్కలు నాటారు. మొత్తంగా రెండేళ్లల్లో ఎడారిని జయించి.. తిరిగి అడవి అనే విజయాన్ని ఆ ప్రాంతవాసులకందించారు. ఇంకేం బ్రెజిల్ లోని తమ ప్రాంతంలో మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం పర్చుకుని కనిపిస్తుంటే… వివిధ దేశాల నుంచి వచ్చి వాలే పక్షులు, రకరకాల క్రిమీకీటకాలు, వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో… ఇప్పుడా అడవి గ్రీనరీకి ఓ కేరాఫ్ లా కనిపిస్తోంది. మొత్తంగా అడవికి పునర్జన్మనిచ్చింది సెబాస్టియో, లెలియా దంపతుల జంట.
కార్బన్ డై ఆక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చగల్గే ఒకే ఒక పదార్థం ఈ సృష్టిలో చెట్టు మాత్రమే. ఆ చెట్టే లేకపోతే.. భవిష్యత్ అంధకారమవుతుందంటాడు సెబాస్టియో. అయితే, ఆ ప్రాంతంలో అంతకుముందు ఏ చెట్లతోనైతే అడవులుండేవో.. అవే స్థానిక చెట్లను నాటేందుకని వాటికోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది సెబాస్టియో దంపతుల జంట. ఎందుకంటే, ఏవి పడితే అవి తీసుకొచ్చి పెంచితే.. గతం కంటే అడవి గుబురుగా పెరుగొచ్చేమోగానీ.. గతంలో ఉన్న జీవవైవిధ్యం కనిపించదనేది ఈ జంట అభిప్రాయం. అప్పుడు ఆ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఉండే.. క్రిమీకీటకాల నుంచి అడవి జంతువుల వరకూ రాకపోయే అవకాశాలే ఎక్కువ ఉంటుందని.. దాంతో ఆ అడవి పెరిగినా.. జీవవైవిధ్యం కానరాని నిశ్శబ్దమే ఆవరిస్తుందంటాడు సెబాస్టియో.
అలా నాటుతున్న ప్రతీ మొక్కపై స్పష్టత.. తగు జాగ్రత్తలతో ఎఫర్ట్ పెట్టారు కాబట్టే.. ఇరవై ఏళ్లల్లో తమ ప్రాంతాన్ని ఓ దట్టమైన అటవీ ప్రాంతంగా మల్చగల్గారు సెబాస్టియో దంపతులు. ఇప్పుడు వివిధ రకాల వన్యప్రాణులు, 172 రకాల వివిధ జాతుల పక్షులు, 33 రకాల క్షీరదాలు, 293 రకాల వివిధ జాతుల మొక్కలు, 15 రకాల సరీసృపాలు, మరో 15 రకాల ఉభయచరాలు.. ఇలా మొత్తం పర్యావరణ వ్యవస్థకే పునరుజ్జీవం పోసింది సెబాస్టియో భార్యాభర్తల జంట.
సెబాస్టియో ఫోటో జర్నలిస్ట్ గా ఎంత పాప్యులయ్యాడో… బ్రెజిల్ లో తన ప్రాంతంలోని అడవులను పునరుద్ధరించి.. ఇప్పుడంతకన్నా పెద్ద హీరో అయ్యాడు. లక్షల మందికి స్ఫూర్తయ్యాడు. ప్రకృతిని ఆరాధించే భక్తుల్లా కాకుండా… మదమెక్కిన మానవమృగాలమై విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తే.. విలాసాలు, అవసరాల కోసం అడవులను నరికేస్తే.. రాబోయే భవిష్యత్తు ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని.. కాబట్టి, చెట్ల పెంపకంపై ప్రతీవారూ ఎంతో కొంత దృష్టి సారించాలని.. అడవులు, సహజ వనరులను విచ్చలవిడిగా వాడటం తగ్గించాలని కోరుతాడు సెబాస్టియో….. (Article By రమణ కొంటికర్ల … 99126 99960)
Share this Article