సన్యాసులు చాలారకాలు… ముఖ్యమంత్రుల్ని ఆడించగల కార్పొరేట్ సన్యాసులు తెలుసు మనకు… మోడీ రాజసన్యాసి… కుర్చీ మినహా అన్నీ వదిలేయగల వైరాగ్యం… యోగి మరీ మోడీ తరహాలో కుర్చీప్రేమికుడు అనలేం గానీ, కర్మ సన్యాసి… ఓ విశిష్ట సన్యాసం తనది… కొందరు ఫేక్ యోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు… వాళ్లది కొంగజప సన్యాసం… ఏ హిమాలయాల్లోనో, కొన్ని నిజమైన ఆధ్యాత్మిక ఆశ్రమాల్లోనో నిజమైన సన్యాసులు కనిపిస్తారు, వాళ్లు అన్నింటినీ వదిలేసిన బైరాగులు… వాళ్లది మార్మిక సన్యాసం… ఆ బాట అందరికీ చేతకాదు… గతంలో ఎన్టీయార్ మార్క్ వేష సన్యాసం, చంద్రస్వామి తాంత్రిక సన్యాసం, పీవీ కుర్తాళం పీఠ సన్యాసం వంటివి చాలా చదివాం… మాటలతో మాయలు చేసి, డబ్బులు గుంజే అర్థ సన్యాసుల్నీ చూశాం… డేరా బాబా కథ అల్టిమేట్… ఇదంతా ఎందుకంటే..? ఓ వార్త చదివాక చకచకా ఇవన్నీ గుర్తొచ్చినయ్… విభ్రమను కలిగించింది ఆ వార్త… అసలు ఇదేమిటి అనిపించింది… బద్వెల్ మాజీ ఎమ్మెల్యే వడ్డమాని శివరామకృష్ణారావు రాజకీయ సన్యాసం ప్రకటించి, నిజమైన సన్యాసిగా మారిపోవడం, తన పేరును కూడా శివరామానంద సరస్వతిగా మార్చుకున్నాడు… అసలేమిటిది..?
సన్యాసంలో ఉన్నవాళ్లనే రాజకీయాలు వదలడం లేదు, రాజకీయాలు ఆకర్షిస్తున్నాయి, రాజకీయంపై వ్యామోహం ప్రబలుతోంది… రాజకీయం అంటేనే ఓ వారకాంత… అది వదలదు… అలాంటిది నలభై యాభై ఏళ్లు రాజకీయాలే జీవితంగా గడిపిన ఒక నాయకుడు తను సన్యసించి, కాషాయం కట్టడం ఏమిటి..? డిబేటబుల్ ప్రశ్నే కదా..! ఈయన వృత్తి రీత్యా డాక్టర్… తరువాత రాజకీయాల్లో వచ్చాడు… వైఎస్ సన్నిహితుడని చెబుతారు మరి… 1978లోనే ఆయన జనతా పార్టీ నుంచి ఎమ్యెల్యే అయ్యాడు… తరువాత 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచాడు… తక్కువేమీ కాదు, మొదటిసారి 44 వేలు, తరువాత 60 వేల మెజారిటీ… 1972, 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయాడు… 2001లో భారీ ఓటమి… అంతే, ఇక, ఎన్నికల జోలికి పోవడం లేదు… 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ప్రచారం చేసినా, తను మాత్రం ఏ పోటీలోనూ లేడు… ఇంత సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్ ఉన్నవాళ్లను అసలు రాజకీయాలు ఎలా వదిలేశాయి..? రాజకీయాల్ని వదిలించుకోవడం చాలా చాలా పెద్ద టాస్కు…
Ads
కావచ్చు… కొందరికి అకస్మాత్తుగా జీవితం మీద దృక్పథం మారుతుంది… ఇదీ అదే కావచ్చు… ధార్మిక భావనలతో, ఆధ్యాత్మక చింతనతో కాలం గడపాలనే నిజమైన వైరాగ్యమే కావచ్చు… ఆ ఆచరణ కోసమే కాషాయం కట్టి, పేరు మార్చుకుని, తన పంథాను సమూలంగా మార్చుకోవచ్చు… కానీ ప్రస్తుత సమాజపు ట్రెండ్‌లో ఇదొక విశేషం… ఆశ్చర్యంగా గమనించే ఓ వైరల్ వార్త… మనిషి జీవితానికి పరిపూర్ణత, సమగ్రత ఎప్పుడు లభిస్తుంది..? కేవలం దైవచింతనతోనే సాధ్యమా..? ఇది పెద్ద పెద్ద విజ్ఞులే సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న… ఏదయితేనేం… తన మనస్సుకు నచ్చిన పంథాను ఎంచుకున్నాడు ఆయన… ఐహిక సుఖభోగలాలసను త్యజించడంకన్నా అసలు వైరాగ్యం ఏముంటుంది..? అందుకని ఈ నూతన కాషాయాంబరధారిని అభినందిద్దాం… ఎందుకంటే..? ఈ క్షుద్ర రాజకీయాల్ని పూర్తిగా త్యజించడం అంటే మాటలా మరి..?! అదీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..!!
Share this Article