Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు… అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు…

April 8, 2025 by M S R

.

A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది.

చెన్నై నగరంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్నారు నటి భువనేశ్వరి. అప్పటికే తెలుగు, తమిళ సీరియల్స్ ద్వారా ఆమె చాలా పాపులర్. తమిళంలో శంకర్ తీసిన ‘బాయ్స్’ సినిమాలో వేశ్య పాత్ర ద్వారా ఆమె తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా తెలిశారు. ఆ తర్వాత తెలుగులో ‘దొంగరాముడు అండ్ పార్టీ’ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ‘గుడుంబా శంకర్’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’, ‘చక్రం’, ‘ఆంజనేయులు’ లాంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తుందన్న ఆరోపణలు రావడంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి.

Ads

శాస్త్రినగర్‌లో నివాసం ఉంటున్న ఆమె చుట్టుపక్కల వారికి ఆ ఇంటి పరిసరాలు, వచ్చీపోయే జనాలు అనుమానాస్పదంగా అనిపించడం మొదలుపెట్టింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 అక్టోబర్‌ 3న పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి, వ్యభిచార గృహం నడుపుతుందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.

పోలీసుస్టేషన్‌లో ఆమె విచారణ అనంతరం బయటకు వచ్చి “నేనొక్కదాన్నేనా? సినిమా పరిశ్రమలో చాలామంది చేస్తున్నారిలా..” అంటూ కొన్ని పేర్లు బయటపెట్టారు. తన మీద పడ్డ నిందల్ని అబద్ధం అని చెప్పే క్రమంలో కొందరు ఇలాంటివి చెప్తూ ఉంటారు. అవి కాస్తా మీడియాకు చేరాయి.

అక్టోబర్ 4న ‘దినమలర్’ అనే తమిళ పత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.‌ కేవలం వార్తగా రాయకుండా భువనేశ్వరి ఎవరి పేర్లయితే చెప్పారో, ఆ నటీమణుల ఫొటోలతో సహా వార్త ప్రచురితమైంది. అంతే! తమిళనాడు రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది.

మొత్తం ఏడుగురు నటీమణులు. అందరూ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాపులర్ అయినవారు. వారిలో ఒక ప్రముఖ తమిళ హీరో భార్య, మరో తమిళ దర్శకుడు, నటుడి భార్య, మరో ప్రముఖ సీనియర్ నటి ఉన్నారు. ఆ ఒక్క వార్త తమిళ సినీ పరిశ్రమను కకావికలం చేసింది.

దక్షిణాదిలో Key Hole Journalism మొదలైందెక్కడో తెలియదు. కానీ తమిళంలో అది చాలా పాపులర్‌. నటీనటుల గురించి రకరకాల పుకార్లు రాసి, తమ సర్క్యులేషన్ పెంచుకునే పత్రికలు అప్పట్లో చెన్నైలో చాలా ఉండేవి. కొందరు నటులు కావాలనే తమ తోటి నటీనటులు మీద పుకార్లు రాయించి, వారి మార్కెట్ డౌన్ అయ్యేలా చేసేవారని అంటారు.

తమ మీద ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు చాలామంది చూసీచూడనట్లు ఉంటారు. మరికొందరు ఆ పత్రికకు నోటీసులు పంపిస్తారు. వాళ్లు ‘సవరణ’ లేదా ‘క్షమాపణ’ ప్రచురిస్తారు. కానీ ఈసారి జరిగిన ఉదంతం చాలా బలమైనది. పరిశ్రమ పరువు తీసేంత గట్టిది. వెంటనే నడిగర్ సంగం ముందుకొచ్చింది.

అప్పట్లో నడిగర్ సంగానికి అధ్యక్షుడిగా నటుడు శరత్‌‌కుమార్ ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనతోపాటు తోటి నటులంతా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. నిరాధారమైన ఇలాంటి వార్త ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్‌ని అరెస్టు చేయించాలని కోరారు. ఆపై పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు‌‌.

స్త్రీల గౌరవం దెబ్బ తీశారనే అభియోగంతో ‘దినమలర్’ పత్రిక ఎడిటర్ లెనిన్‌ని పోలీసులు అరెస్టు చేశారు. అటుపై నడిగర్ సంగం తరఫున చెన్నైలో పెద్ద సభ ఏర్పాటు చేసి, ఆ పత్రిక చేసిన వ్యాఖ్యలను మూకుమ్మడిగా ఖండించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం వారికి మద్దతు తెలిపారు.

ఆపై పత్రికవారు బహిరంగంగా క్షమాపణ చెప్పి, పత్రికలో ‘క్షమాపణ’ వార్త ప్రచురించారు. ఒక విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అందరూ పోరాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో వాళ్లు చేసి చూపించారు.
విషయం అక్కడితో అయిపోలేదు. ఒక పత్రిక ఎడిటర్‌ని అరెస్టు చేయడం పట్ల తమిళనాడు జర్నలిస్టు సంఘం నిరసన తెలిపింది.

నడిగర్ సంగం సమావేశంలో పత్రికలను తూలనాడిన నటీనటులపైనా కేసులు పెట్టింది. వారికి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు వ్యాసాలు రాశాయి. అలా కొంతకాలం ఈ విషయం తీవ్రంగా నడిచింది. ఆపై ఈ అంశం సమసిపోయింది. నటి భువనేశ్వరి మాత్రం ‘తాను ఎవరి పేర్లూ చెప్పలేదని, ఎవరితోనూ తానేమీ మాట్లాడలేదని’ బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కావని, చేతికొచ్చిన అబద్ధాలు రాసిపారేస్తే పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవని చెప్పేందుకు ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది……. – విశీ (వి.సాయివంశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions