.
కుటుంబంలో ఎవరైనా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే చాలు ఆ కుటుంబం స్థితే మారుతుంది… అలాంటిది వరుసగా పలు ఉద్యోగాలు సాధిస్తూ, ఇప్పుడు ఏకంగా గ్రూపు-1 పరీక్ష గట్టెక్కి; ఉన్నతాధికార పోస్టు సాధిస్తే… అభినందనీయమే కదా…
పైగా ఎస్సీ, మహిళ… గ్రూపు-1 సాధించడం మాత్రమే కాదు… ఆమె కథలో ఆమెను మరింత ప్రశంసించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి… నిజానికి అవే ఇంపార్టెంట్… మహిళలకు ఓ స్పూర్తి…
Ads
నిన్న ఉదయం నుంచే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది… సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెను ఓ ప్రకటనలో అభినందించాడు… ఏడాదిలో ఐదు ఉద్యోగాలు, అందులో ఒకటి గ్రూపు-1… నువ్వు గ్రేటమ్మా అని చప్పట్లు చరచడానికి కారణం, ఆమె కథలో మరో పెయిన్‌ఫుల్ అరుదైన అనారోగ్యం ఉంది…
ఆమె పేరు శిరీష… పేదింటి అమ్మాయి… ఖమ్మం జిల్లాలోని మిట్టపల్లి ఊరు… నాన్న సుతారీ మేస్త్రీ… అమ్మ వ్యవసాయ కూలీ… గురుకుల పాఠశాలలో చదువు… తరువాత ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ… ఉస్మానియాలో పీజీ,,, టీటీసీ, బీఈడీ… ఇక పోటీ పరీక్షలు, కొలువు పరీక్షలు…
వరుసగా విద్యార్హతలు జమవుతున్నాయి… కానీ అదంత సులభం కాదు… కారణం, ఆమెకు సికిల్‌సెల్ ఎనీమియా… అంటే తీవ్ర రక్తహీనత… కాళ్లు, చేతులు వాచిపోయేవి రక్తం తగ్గినప్పుడల్లా… తలనొప్పి, ఎముకల్లో సూదులు గుచ్చుతున్నట్టు నొప్పి… యాభై సార్లు రక్తం ఎక్కించారు ఆమెకు…
(సికిల్ సెల్ ఎనీమియా వంశపారంపర్య రక్త రుగ్మత, ఇది ఎర్ర రక్త కణాల ఆకృతిని కొడవలి ఆకారంలోకి మార్చుతుంది, ఫలితంగా అవి రక్త నాళాల ద్వారా సులభంగా కదలలేవు. ఈ అసాధారణ కణాలు ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేయడంలో ఇబ్బందులు కలిగిస్తాయి, చికిత్సకు మందులు, రక్తమార్పిడి, మరీ సీరియస్ అయితే ఎముక మజ్జ మార్పిడి తప్పవు)
అటు హాస్పిటళ్లు, పెయిన్… ఇటు చదువు… గత ఏడాది గ్రూపు-4 వచ్చింది… అదే సమయంలో గురుకుల టీచర్ పరీక్షలో ర్యాంకు రావడంతో ఓ బీసీ గురుకులంలో టీచర్‌గా జాయినైంది… తరువాత డీఎస్సీ ఫలితాలు వచ్చి, అందులోనూ నెగ్గి, సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయ్యింది…
మొన్నటి మార్చిలో ఐసీడీఎస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ కొలువూ వచ్చింది… ఇప్పుడు గ్రూపు-1లో స్టేట్ 604 ర్యాంకు, ఎస్సీ జనరల్ 25వ ర్యాంకు, ఎస్సీ మహిళల విభాగంలో ఏడో ర్యాంకు… ప్రతిభ ఎవరి సొత్తూ కాదు… పేదింట్లో ఉన్నా, ప్యాలెస్‌లో ఉన్నా సరే రాణిస్తుంది… ఐతే ఈ జ్యోతి శిరీష కథ వేరు… అనారోగ్యంతో ఎప్పుడూ కుంగిపోకుండా, చదువు మీద శ్రద్ధ సన్నగిల్లకుండా… వరుసగా ఇన్ని ఉద్యోగాలు సాధించడం విశేషమే…
Share this Article