.
కొన్ని వార్తలు మనసుల్ని ద్రవింపజేస్తాయి… నిస్వార్థంగా కొందరు సమాజసేవకులు చేసే సేవ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తుంది… అలాంటప్పుడు ఆ వార్తల్ని జిల్లా పేజీలకు గాకుండా, స్టేట్ వైడ్ కవర్ చేస్తే… సొసైటీకి కొన్ని పాజిటివ్ వైబ్స్ యాడ్ చేసినట్టవుతుంది… ఇప్పుడు ఇవే అవసరం…
ఎక్కడో విజయనగరం… నెల్లిమర్ల… కోరమల్లి వెంకట్రావు అని ఓ హార్డ్‌వేర్ ఇంజినీర్… వైజాగులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు… భార్యాపిల్లల్లేరు… తిరుమలకు ఒక్కడే దర్శనానికి వచ్చాడు… అన్నదానసత్రం దగ్గర హఠాత్తుగా కళ్లు తిరిగిపడిపోయాడు…
Ads
టీటీడీ స్టాఫ్ రుయా హాస్పిటల్ పంపించింది… రెండురోజులు ఉంచుకుని, ఈయన తన వివరాలు సరిగ్గా చెప్పలేకుండా ఉన్న స్థితిలో డిశ్చార్జ్ చేసేశారు… గవర్నమెంట్ హాస్పిటళ్లు కదా, అవంతే… రోడ్డు పక్కన, పేవ్‌మెంట్ మీద, మరుగుదొడ్ల పక్కన ఎముకల గూడులా పడిఉన్న ఆ అరవై ఏళ్ల పెద్దాయన… తిరుపతి, అలిపిరి ఏరియాలో సోషల్ సర్వీస్ చేసే సుజాతకు కనిపించాడు…
ఆమె ఎందరో అభాగ్యులకు సేవ చేస్తుంది, అనితరసాధ్యం… దేహానికి పుండ్లను కూడా క్లీన్ చేసి, బట్టలు తొడిగి, అన్నం పెట్టి, బిడ్డల్లా ఆదరిస్తుంది… చెప్పుకున్నంత ఈజీ కాదు ఈ సర్వీసు… (ఈమె ఈ కథన రచయిత ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్టులో ఉంది, ఆమె సర్వీస్ మొత్తం తెలుసు…) ఈయనకు కూడా అన్నీ ఒంట్లోనే పోతున్నా కొడుకు సాయంతో నెల రోజులుగా సర్వీస్ చేసింది మనస్విని సుజాత… గ్రేట్, హేట్సాఫ్…
వారి సపర్యలతో కోలుకున్నాడు, తన వివరాలు చెప్పాడు… విజయనగరం, నెల్లిమర్లలో తన సోదరి అరుణ పాఠక్ ఉంటుందని, దయచేసి, నా సమాచారం ఆమెకు చేరనివ్వండి, నన్ను తీసుకుపోతుంది అని చెప్పాడు…
ఫోన్ నంబర్ గుర్తులేదో, ఫోన్ పోయిందో గానీ… తను కాల్ చేయలేకపోయాడు… ఆంధ్రజ్యోతిలో ఈ వార్త రాశారు… హ్యూమన్ ఇంట్రస్టింగ్… వార్త రాసిన విలేకరికి ‘ముచ్చట’ అభినందనలు… ఇదీ ఆ వార్త…
ఆయన చెప్పిన వివరాల ఆధారంగా నెల్లిమర్ల రిపోర్టర్ ఆయన అక్కను వెతుక్కుంటూ వెళ్లాడు, కనుక్కున్నాడు… ఫోన్ చేయించాడు… ఫోన్‌లో తమ్ముడిని చూసి ఏడ్చేసింది… ‘తమ్ముడూ బేగొచ్చెయ్’ అని కన్నీళ్లు పెట్టుకుంది… అక్కా అక్కా అని ఏడవడం తప్ప ఈయనకూ మాటల్లేవు… ఈ రిపోర్టర్‌కు కూడా ‘ముచ్చట’ అభినందనలు…
తరువాత పోలీసులు కూడా స్పందించారు… విజయనగరం ఎస్పీ తిరుపతి పోలీసులకు చెబితే… తిరుపతి పోలీసులు తనను మళ్లీ రుయా హాస్పిటల్‌లో చేర్పించి, అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించి, ఎంపీ అప్పల్నాయుడు ఎంపీ కారు అరేంజ్ చేయడంతో… ఓ కానిస్టేబుల్‌ను సాయం ఇచ్చి ఆయన్ని నెల్లిమర్లకు పంపించారు…
అవును, ఆ ముసలాయన ‘తల్లీ, నీవల్లే బతికాను’ సుజాత చేతులు పట్టుకుని ఏడుస్తుంటే అక్కడున్నవాళ్ల కళ్లూ చెమర్చాయి… ఇలాంటి వార్తలు అరుదు, వేరే పత్రికలకు ఎలాగూ చేతకాలేదు, కనీసం రియాక్టయిన ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో కవర్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పాఠకులు చదివేవాళ్లు కదా… అసలు ఇలాంటి పాజిటివిటీనే కదా ఇప్పుడు సొసైటీలోకి పంప్ చేయాల్సింది..!!
Share this Article