.
( రమణ కొంటికర్ల )… మనం చూసిన అతి పెద్ద విపత్తుల్లో కరోనా ఒకటైతే.. సునామీ మరొకటి. అలాంటి సునామీ నుంచి బతికి బట్టకట్టిన ఓ అమ్మాయికి.. నాటి సునామీ సమయంలో ఎందర్నో మృత్యుఒడి నుంచి తప్పించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇటీవలే పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగేవరకూ ఆ ఐఏఎస్ అధికారి దంపతులే ఆ అమ్మాయికి గాడ్ ఫాదర్, మదర్ గా నిల్చారు. ఆ కథ వినాలంటే ఓసారి నాగపట్నంలో నాటి సునామీ కాలం 2004కు వెళ్లిరావాలి.
2004 డిసెంబర్ 26న తమిళనాడులోని నాగపట్నం బీచ్ అల్లకల్లోలమైంది. నాడు సునామీ సృష్టించిన బీభత్సం ఏకంగా ఆరువేల మంది ప్రాణాల్ని బలిగొంది. ఆ సమయంలో నరకం అంచుల్లో యముడి చెర నుంచి ఎందరినో తరలించి కాపాడిన మృత్యుంజయుడయ్యాడు నాటి నాగపట్నం జిల్లా కలెక్టర్ జే. రాధాకృష్ణన్. అందులో మీనా ఒకరు.
Ads
నాగపట్నం జిల్లా కలెక్టర్ గా వీలైనంత ఎక్కువ మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎందరికో ప్రాణభిక్ష పెట్టినవాడిగా రాధాకృష్ణన్ ఆ ప్రాంతవాసులకు ఓ దేవుడనుకున్నా.. లేక ఆ దేవుడు పంపిన దైవదూత అనుకున్నా.. లేక నిలువెత్తు మానవీయ రూపమనుకున్నా.. ఎవరి అభిప్రాయాల్ని బట్టి వాళ్లకలా కనబడే వ్యక్తి. అలా నాగపట్నం, తంజావూర్ రెండు జిల్లాల్లో సునామీ సమయంలోనూ.. ఆ తర్వాత కరాళనృత్యం చేసిన కరోనా సమయంలోనూ రాధాకృష్ణన్ సేవలు ప్రపంచవ్యాప్తంగా అప్లాజ్ అందుకున్నాయి.
ప్రస్తుతం రాధాకృష్ణన్ తమిళనాడు అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. 2004 సునామీ కాలాన నాగపట్నం కలెక్టరంటే.. ఇప్పటికే రెండు దశాబ్దాలు గడిచిపోయింది. ఆ చేదుఘటన ఎప్పుడూ వెంటాడేదే. కానీ, గుర్తుంచుకోవాల్సినంత గొప్పది కాదు. కానీ, ఆ చేదు జ్ఞాపకం మిగిల్చిన కన్నీటి అనుభవాలను చెరిపేసుకోలేదు.
ఆ భీతిగొల్పిన ఘటన మిగిల్చిన విచారాన్నీ, విషాదాన్నీ మోస్తూ కాలం గడుపుతున్న వారిపట్ల మానవీయ కోణంలో ఆలోచించాడు రాధాకృష్ణన్. అదిగో అలాంటి కోణంలోనే తాజాగా ఆయన చేతుల మీదుగా పెళ్లి చేసిన మీనాలాంటివారెందరో కనిపిస్తారు.
మీనా ఒక ఉదాహరణ మాత్రమే. ఓ సౌమ్య, ఓ మీనా ఇలా ఎందరికో గాడ్ పేరెంట్స్ గా వారి బాగోగులు పట్టించుకున్న ఒక మానవతావాది రాధాకృష్ణన్.
నాగపట్నం మండలం కీచన్ కుప్పం అనే మత్స్యకార గ్రామశిథిలాల్లో గుట్టలుగా పడి ఉన్న శవాల మధ్య సజీవంగా కనిపించిన ఆడశిశువే మీనా. అలాంటివారందరి కోసం ప్రభుత్వంతో మాట్లాడి అన్నై సత్య అనే ఓ అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బాలల గృహం మీనాలాగే.. వేలంకన్ని బీచ్ ప్రాంతంలో సజీవంగా లభించి అక్కడికొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సౌమ్య వంటివారెందరికో ఓ గూడైంది.
అభం శుభం ఎరుగని వయస్సులో బతుకు, చావంటే ఏంటో కూడా తెలియని పాలబుగ్గల పసిప్రాయంలో అన్నై సత్య శరణాలయమే వారికి సర్వస్వంగా మారితే… రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక అక్కడివారందరికీ గాడ్ పేరెంట్స్ అయ్యారు.
తన ఉద్యోగ జీవితంలో పలు బదిలీలతో కొత్త ప్రాంతాలకు వెళ్తున్నా… రాధాకృష్ణన్ దంపతులు మాత్రం మీనా, సౌమ్య బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. అప్పుడప్పుడు నేరుగా వచ్చి కలిసేవారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు కావల్సిన చదువుల్లో ప్రోత్సహించారు. 2022లో సౌమ్యకు వివాహాన్ని జరిపించగా.. ఆమెకు గత ఏడాదే ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు మీనా వివాహాన్ని కూడా ఐఏఎస్ అధికారి రాధాకృష్ణన్ దంపతులే తమ చేతుల మీదుగా ఘనంగా చేశారు.
మొన్న ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం రోజున మీనా ఓ జాతీయబ్యాంకులో పనిచేస్తున్న పి. మణిమారన్ ను పెళ్లి చేసుకుంది. శ్రీ నెల్లుక్కడై మరియమ్మన్ ఆలయం వారి విహానికి వేదికైంది. నాటి సునామీ సృష్టించిన బీభత్సంలో వేల మంది మృత్యువాత పడగా.. మీనాలాగే బతికి బట్టకట్టి అన్నై సత్య శరణాలయంలో ఆశ్రయం పొందిన తన ఈడువారందరితో మీనా పెళ్లిసందడి తమిళనాడులో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది…
Share this Article