నిజానికి ఇది ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం, తన బయోపిక్‌లో ఓ చిన్న సీన్… పెరిఫెరల్‌గా చూస్తే ఇందులో న్యూస్ ఎలిమెంట్ ఏమీ లేదు… కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… ఒకప్పుడు ఈనాడును రామోజీరావు ఎంత జాగ్రత్తగా నిర్మించాడో అర్థమవుతుంది… ఇప్పుడంటే ఈనాడును ఎవరుపడితే వాళ్లు ఆడేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు రామోజీరావు ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటూ, దాన్ని జాగ్రత్తగా పెంచాడు… ఈనాడులో ఒకప్పుడు ప్రతిదీ సిస్టమాటిక్, మెటిక్యులస్… ఆ పునాదులు అంత బలంగా పడ్డాయి కాబట్టే ఇప్పటి ఇంత నాణ్యతారాహిత్యంలోనూ ఈనాడు బతుకుతోంది… ఆయన దూరమైన వేళ … మిత్రుడు Prasen Bellamkonda రాసుకున్న ఓ జ్ఞాపకం… యథాతథంగా…
సాధారణంగా ఎవరైనా సక్సెస్ స్టోరీ లే చెప్పుకుంటారు. కానీ నాదిది ఫేయిల్యూర్ స్టోరీ.
Ads
రామోజీరావ్ తో లింకున్న స్టోరీ కనుకా ఇవాళ ఆయన పుట్టినరోజు కనుకా ఫెయిల్యూరే అయినా నాకు బాగా ఇష్టమైన సంఘటన కనుకా ఇప్పుడీ ప్రస్తావన సరదాగా…
****
1984…
అప్పటికి ఈనాడులో సబ్ ఎడిటర్లను పరీక్ష పెట్టీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే విధానమే ఉండేది. జర్నలిజం స్కూల్ ఇంకా పెట్టలేదప్పటికి.
ఇప్పుడంటే సబ్ ఎడిటర్ కరివేపాకు కంటే హీనం అయ్యాడు గానీ
పత్రిక రూప కల్పనలో సబ్ ఎడిటర్ పాత్ర చాలా కీలకం అని రామోజీ అప్పట్లో బలంగా నమ్మే వారు.
పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి 800 పదాలతో ఒక వ్యాసం రాయమని దాని ఆధారంగా రిటెన్ టెస్ట్ కు పిలిచి ఆ తరవాత ఇంటర్వ్యూ స్వయంగా రామోజీయే చేసి ఎంపిక నిర్ణయం కూడా ఆయన తన చేతిలోనే ఉంచుకుని…… ఇంత పకడ్బందీగా ఉండేది ప్రాసెస్.
వ్యాసం యే విషయం మీద రాసానో గుర్తులేదు కానీ రిటెన్ టెస్టుకైతే పిలుపొచ్చింది. 75 మందిమి రాసాం. ఇంటర్వ్యూ కు కూడా సెలెక్టయ్యాను.
*****
డూమ్స్ డే
—————
ఉదయం పదిగంటలకు ఇంటర్వ్యూ. మమ్మల్ని మేమ్ లెక్కేసుకుంటే ఆరుగురం ఉన్నామని తెలిసింది. ఆ రోజు టెస్ట్ రాసిన 75 మందిలో మా ఆరుగురినే పిలిచారని కూడా అర్ధమైంది.
ఇక్కడ ఒక పిట్ట కథ. ఈనాడులో కొన్ని విషయాలు ఎంత మెటిక్యులస్ గా జరుగుతాయో చెప్పే కథ….. ఆ రోజు పది గంటలకు రామోజీకి షెడ్యూల్ లో లేని ముఖ్యమైన పనేదో తగిలింది. పరిహారంగా మాకు రెండు సార్లు టీ పంపారు. 12 గంటలకు ఒక జి ఎమ్ స్థాయి వ్యక్తి వచ్చి మాకు పదేపదే సారీ చెప్పి రామోజీ గారికి ఏదో పనిపడిందనీ మరింత ఆలస్యమవుతుందనీ చెప్పి మరోసారి సారీ చెప్పి వెళ్లిపోయారు. ఒంటి గంటకు మేల్కొటె వచ్చారు. ఆయన ఈనాడులో మంచి పొజిషన్ లో ఉన్నారు. అప్పుడవి శ్రీవారికి ప్రేమలేఖ సూపర్ డూపర్ హిట్టయి నడుస్తున్న రోజులు. పిల్లి గెడ్డం, విచిత్రమైన ట్రేడ్ మార్క్ నవ్వుతో శ్రీవారికి ప్రేమలేఖలో చిన్న పాత్రలో కనిపించిన ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆయన మా ఆరుగురినీ చూసి ‘ఏమిటి మీరంతా ఎందుకొచ్చారు ‘ అన్నారు పిల్లి గెడ్డంలోంచి నవ్వుతూ. నేను వెంటనే ‘ సినిమాలో నటించడానికి వచ్చామండీ ‘ అన్నాను.
‘అదేంటి ‘ అన్నారు మేల్కొటే కొంచెం అయోమయంగా. ‘అవును సార్ ఈనాడులో ఉద్యోగం చేస్తే సినిమాల్లో అవకాశా లొస్తాయి కదా మీకులాగా…. అందుకే ఈనాడులో ఉద్యోగం కోసం వచ్చాం ‘ అన్నాన్నేను సీరియసుగా . ‘ఈజ్ ఇట్ ‘ అని నవ్వుకుంటూ వెళ్లిపోయారాయన.
రెండైనా మాకు పిలుపు రాలేదు. మరొకరొచ్చి మళ్ళీ సారీ చెప్పి మమ్మల్ని క్యాంటిన్ కు తీసుకెళ్లి లంచ్ పెట్టించారు.
సరే మొత్తం మీద అయిదు గంటలకు ఇంటర్వ్యులు మొదలయ్యాయి. ఈలోగా మాకు మరో రెండు సార్లు టీలొచ్చాయనుకొండి.
( కొద్దికాలం తరవాత నేను ఉదయం ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్. దాసరి 11 గంటలకు ఇంటర్వ్యూలు చెయ్యాల్సింది రాత్రి తొమ్మిది గంటలకు కానీ ఆయనకు వీలవలేదు. అప్పటి దాకా ఇంటర్వ్యూకి వచ్చిన మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు. అదీ తేడా.)
****
మెయిన్ కోర్స్
——————-
ఉన్నది ఆరుగురమే కనుక, ఆరుపైనే ఖాళీలున్నాయని కొంత లీకేజ్ మాలో ఒకరు సంపాదించారు కనుకా మాకు ఉద్యోగం ఖాయమని అందరమూ నమ్మాం. ఆ మేరకు అందరమూ రిలాక్స్డ్ గానే ఉన్నాం.
పిలుపుల వరసలో నేను ఐదో వాడ్ని. నా ముందటి నలుగురూ ఐదైదు నిముషాల కన్నా ముందే బయటకొచ్చారు.
నేను రామోజీ ఎదుట నలభై అయిదు నిముషాలున్నాను. ఇంటర్వ్యూ లాగా సాగలేదు. పిచ్చాపాటి గానే నడిచింది. అది ఆయన టెక్నీక్ అనుకుంటా. అప్పటికి మన బ్లడ్డు చాలా హాటు.
ఏదైనా యాజ్ యాన్ యారో స్ట్రయిటు.
నేను అప్పటికే కవిత్వం రాస్తున్నట్టు నా దరఖాస్తులో ఉండడం వల్ల ‘ ప్రసేన్ అసలు పేరేనా కలం పేరా’ అని అడిగారాయన. ‘లేదండీ దేహం పేరే’ అన్నాను. ఆయన ఓ చిన్న నవ్వు నవ్వారు. ఆయన నవ్వడం ఒన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అట మరి. ఆ నవ్వుతో నేను టెన్షన్ నుంచి రిలీవ్ అయ్యాను.
పిచ్చాపాటీ లొ నేషనల్ ప్రోడక్టివిటీ, వేస్టేజ్ వంటి టాపిక్ వచ్చినప్పుడు ‘మార్నింగ్ షోలు మ్యాటినీలు రద్దు చెయ్యాలి వాటివల్ల యూత్ టైం వేస్ట్ అవుతోంది’ అన్నాను. ఇది ఆయనకు నచ్చలేదు.
హైదరాబాద్ అతి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అనే విషయం చర్చకు వచ్చినపుడు నేను ప్రతి వ్యక్తీ తన వర్క్ ప్లేస్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లోనే నివాసముండాలి అనే రూల్ పెట్టాలి అన్నాను. ఇది ఆయనకు నచ్చింది. చివరగా పాండిచేరి సీఎం ఎవరు అన్న ప్రశ్నకు కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్ట్నేంట్ జనరల్ ఉంటారుకానీ సీయెమ్ ఉండరు కదా అని సమాధానం ఇచ్చాను. నేను తప్పు అని ఆ తరవాత తెలిసాక తెలియదు అని చెపితే పోయేది కదా అని అనుకున్నాను కానీ అందరితో అయిదు నిమిషాలకంటే తక్కువ మాట్లాడి నాతో మాత్రమే నలభై అయిదు నిముషాలు మాట్లాడారు కనుక నాకు ఉద్యోగం వచ్చేసినట్టే అని సంతోషంగానే బయటపడ్డా.
రెండ్నెల్ల పాటు అప్పాయింట్ మెంట్ లెటర్ కోసం ఎదురు చూసా… కానీ రాలే. మా ఆరుగురిలో ఎవరికీ ఉద్యోగం రాలేదని తెలిసి ఆశ్చర్య పోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయామ్.
మనల్ని తీసుకోడంలో ఆయన ఇబ్బందులేవో ఆయనకుంటాయిలే అని నన్ను నేను సమాధాన పరుచుకుంటున్నపుడు తన దగ్గర ఆరునెలలో సంవత్సరమో చేసి వేరే ఉద్యోగం వెతుక్కునే పోటెంషియల్ ఉన్నట్టు కనపడే వాళ్ళను రామోజీ ఎంపిక చెయ్యరు అని ఒక ఈనాడు ఉద్యోగి చెప్పిన కిటుకు నా ఈగోని సంతృప్తి పరిచింది.
ఇది నా మొదటి ఇంటర్వ్యూ. అదీ ఒక జైజాంటిక్ ఫిగర్ తో. ఉద్యోగం రాలేదన్న బాధ పెద్దగా లేకుండే. ఆ పై 86 లొ ఉదయంలో దాసరి చేతుల మీదుగా సబ్ ఎడిటర్ అయ్యాను. అప్పటినుంచి ఉదయం, భూమి, జ్యోతి, వార్త, tv5 అప్రతిహతంగా…అటు డెస్క్ లోనూ ఇటు ఫీల్డ్ లోనూ….
ఇదీ నా ఫేల్యూర్ స్టోరీ.
అయినా ఓ మంచి జ్ఞాపకం.
Share this Article