పునీత్ రాజకుమార్… అలియాస్ లోహిత్ రాజకుమార్… తెలుగు సమాజం కూడా తన హఠాన్మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తోంది… ఓ పాపులర్ హీరో తన దాతృత్వంలో జనం మనసు గెలుచుకుని, చిన్న వయస్సులోనే వెళ్లిపోయిన తనకు అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల్ని ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం… కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనకు, అంతిమ నివాళికీ ఏర్పాట్లు చేసింది… పునీత్‌కు సరైన అంతిమ గౌరవం..! చాలామంది తనతో ఉన్న అనుబంధాన్ని, పాత అనుభవాల్ని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు… నిజానికి మలయాళ, తమిళ, కన్నడ, హిందీ హీరోలతో తెలుగు ప్రేక్షకులకు అనుబంధం ఉంది… కానీ పునీత్ కన్నడంలో సూపర్ స్టార్ అయినా సరే, తెలుగు ప్రేక్షకజనానికి తెలిసింది మాత్రం తక్కువ… ఐనా సరే, తన మరణం పట్ల ఈ విచారాన్ని వ్యక్తీకరించడం విశేషమే… పునీత్ ధన్యజీవి… ఓ జర్నలిస్టు తనకు తెలిసిన పునీత్ గురించి ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న విషయాలు కాస్త ఇంట్రస్టింగుగా ఉన్నయ్… ఆమె పేరు సౌమ్య అజి… ఆ పోస్టు ఇంగ్లిషులో ఉంది, మన తెలుగులోకి అనువదించుకుందాం…
సౌమ్య అజి…. “నిమ్ జోతే యాక్ మాట్లాడ్బెకు నాను?” అతను నన్ను అడిగాడు. “నాన్ కథే యాక్ హెల్బెకు?” (నేను మీతో ఎందుకు మాట్లాడాలి? నా వివరణ ఎందుకు చెప్పాలి?)
Ads
అతనికి 25 ఏళ్లు, అప్పటికి అప్పూ సినిమా చేయలేదు కాబట్టి సూపర్ స్టార్ కాలేదు… మేం రాజ్‌కుమార్ కిడ్నాప్ కవరేజీలో ఉన్నాం… హింస, ఇతర పరిణామాల భయంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తంగా ఉంది. పెద్దాయన అటవీ స్మగ్లర్ బందీగా ఉండటంపై కన్నడ సమాజంలో తీవ్ర నిస్పృహ ఉంది… తనకు వీరప్పన్ ఏదైనా హాని చేస్తాడనే భయంతో సీఎం ఎస్ఎం కృష్ణ సహా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి… ఆ నిష్క్రియాత్మకతపై కూడా జనంలో అసంతృప్తి ఉంది…
ఈ కిడ్నాప్ ఎపిసోడ్ ముగిసేవరకూ, మొత్తం 108 రోజుల పాటు మేం (జర్నోలు) అక్షరాలా రాజ్‌కుమార్ ఇంటిలో లేదా వారి గేట్ వెలుపల ఉన్న పేవ్‌మెంట్‌లోనే అడ్డా… అక్కడే బీట్… ఆ కుటుంబం అంత బాధ, అంత టెన్షన్‌లో కూడా సంయమనంతో వ్యవహరించింది… రకరకాల వార్తలు వింటూనే ఓర్పుగా ఉంది… నిజానికి ఆ సమయంలోనే నేను పార్వతమ్మగారి (రాజకుమార్ భార్య) అభిమానిని అయిపోయాను…
పునీత్, 25 సంవత్సరాల వయస్సు.., ఇంట్లో చిన్నవాడు… కాస్త ఆవేశం… పైగా వ్యక్తిగతంగా దుఖం… అందుకని తనేమీ మాట్లాడేవాడు కాదు మాతో… ఆ పనిని తల్లి మరియు ఇద్దరు అన్నయ్యలకు వదిలిపెట్టాడు…
కానీ… మీడియా అంటేనే తెలుసు కదా, రకరకాల కథల్ని పసిగడతాం, వింటాం, తవ్వుతాం, రాస్తాం… అలా వినిపించిన ఓ కథ ఏమిటంటే… పునీత్ గ్రానైట్ వ్యాపారానికీ వీరప్పన్ కిడ్నాప్‌కూ లింక్ ఉందనేది ఆ ప్రచారం… త్వరగా వ్యాప్తి చెందింది ఈ కథ… కొంచెం విడ్డూరంగానే ఉంది… వీరప్పన్ చేసిన కిడ్నాప్‌కూ పునీత్ గ్రానైట్ వ్యాపారానికీ లింక్ ఏమిటి..? ఇదేదో వింతగా ఉంది… అసలు ఈ పుకార్లకు మనం స్పందించాలా..? ఇది న్యూస్ స్టోరీ అవుతుందా..? మా బాస్ నహీద్ అభిప్రాయమూ, నా అభిప్రాయమూ అదే…
కానీ అసలు కథేమిటో తెలుసుకోవాలి కదా… పునీత్‌తో మాట్లాడటానికి ఈ కారణం ఒకటి సరైందిగా అనిపించింది… ప్రజలు దీన్ని ఓ పుకారుగా కొట్టేసి, తిరస్కరించే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త సున్నితంగా డీల్ చేయాలని ప్రయత్నం… అదుగో, అప్పుడు పునీత్ అడిగిన ప్రశ్న… ‘దీనికి నా వివరణ అవసరమా..? నేనెందుకు స్పందించాలి..?’
నేనేమన్నానంటే..? ‘‘పునీత్, మీరు నిజానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాట్లాడితే, మీ వెర్షన్ జనానికి చెబితే, వినిపించే కథ ఉత్త ప్రచారం అని జనం తెలుసుకుంటారు కదా, లేకుంటే ప్రచారాలు ఆగవు’’
తను మాట్లాడటానికి ససేమిరా అన్నాడు, కానీ తన గ్రానైట్ వ్యాపారానికీ తండ్రి కిడ్నాప్‌కూ లింకు లేదని జనానికి చెప్పడమే కరెక్టు అని నేను ఒకవిధంగా బలవంతపెట్టాను… తను ఆలోచనలో పడ్డాడు… చెప్పాడు… తాను వేరే వ్యక్తి ద్వారా గ్రానైట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాననీ, కానీ కుటుంబసభ్యులు వద్దనడంతో కొన్నాళ్లకే తాను అందులో నుంచి బయటపడ్డాననీ, ఇప్పుడు ఆ వ్యాపారంతోనే తనకు ఏ లింకూ లేదన్నాడు… అది చట్టవిరుద్ధమైన మైనింగా లేదా నేనడగలేదు, తను చెప్పలేదు, కానీ ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేసి, రచ్చ చేయవద్దని కోరాడు… అది నా చేతిలో ఏముంది..? ఏ మసాలాలూ లేకుండా, రంగులు పూయకుండా వార్తను ప్రొఫెషనల్‌గా ప్రజెంట్ చేస్తానని చెప్పాను తనతో… నన్ను విశ్వసించాడు…
ఆ ఉద్రిక్త వాతావరణంలో పునీత్ ఎవరైనా జర్నలిస్టుతో మాట్లాడాడూ అంటే అది ఇదే… వార్త ఫైల్ చేశాను… మా ఎడిటర్ దాన్ని ఆరో పేజీలో పెట్టాడు… డ్రై స్టోరీ… ఓ రూమర్, దానికి పునీత్ వివరణ… అంతే… కానీ జనానికి నిజమేమిటో తెలియాలి కదా… అది చెప్పగలిగాను…
కొన్ని రోజుల తర్వాత రాజ్‌కుమార్ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కావేరి లేదా మరేదో కన్నడ సంబంధిత సంఘటన (నాకు సరిగ్గా గుర్తు లేదు)… రాజ్‌కుమార్, కుమారులు మరియు మొత్తం సినీ పరిశ్రమ MG రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు… వాళ్ళు ఉన్న చిన్న పోడియం దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉన్నారు… అందులో ఇరుక్కుపోయి ఇబ్బందిగా ఉంది నాకు… అది కవర్ చేస్తున్నది నేనే… స్టేజీ మీద నుంచి ఎవరో తోసేశారు… నన్ను చూసిన పునీత్ తన చేతిని చాచి, కింద నుంచి ఓ బంగాళాదుంపల బస్తాను ఎత్తినట్టుగా అమాంతం పోడియం మీదకు ఎత్తాడు… ఇదేంటి మీరు..? ఈ గుంపులో, ఈ రద్దీలో ఉండాలా..? అనడిగాడు కోపంగా… ‘పునీత్, నేను రిపోర్ట్ చేయాలి కదా, ఇక్కడే ఉండాలి’ అన్నాను…
అతను నన్ను తన పెళ్లికి ఆహ్వానించాడు, నేను వెళ్ళాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టోరీ రాస్తున్నా, కోట్ అవసరం అయినప్పుడు స్పందించేవాడు… ఇతరుల్ని గౌరవిస్తాడు, గుర్తుంచుకుంటాడు, గౌరవం పొందుతాడు కూడా… మా ఇద్దరి నడుమ వృత్తిపరమైన స్నేహం ఉండేది… నేను అతనిని “అప్పు” అని ఎప్పుడూ పిలవలేదు, తను నాకు పునీత్ మాత్రమే…
ఇప్పుడు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు… “కానడంటే మాయవదనో నమ్మ శివా” అని పాడుతూ తిరిగే కుర్రాడు, “జోతే జోతే యాలి, ప్రీతి జోతే యాలి” అని పాడుతూ ఎదిగిపోయాడు, రిషి నుండి “బందనూరా బందెరెల్లా బందు నోడి బంగడా” అని హమ్ చేస్తూ తిరిగే పునీత్ ఇప్పుడు మనలో లేడంటే మనసు కలుక్కుమంటోంది… అప్పట్లో రాజకుమార్ ఇంటి పేవ్మెంట్ మీద నాతోపాటు రిపోర్టింగ్ చేసిన ఓ పాత కొలీగ్ పునీత్ మరణం మీద మెసేజ్ పెట్టాడు… చదివి ఒక్కసారిగా మొద్దుబారిపోయాను… అకస్మాత్తుగా శూన్యత ఆవరించింది… ఈ శూన్యం నుంచి ఎప్పుడు బయటపడగలనో…!!
Share this Article