వావ్, అపురూపం, అద్భుతం అని ఆశ్చర్యపోతారో…. అబ్బే, ఏదో యాదృచ్చికంలే అని కొట్టిపడేస్తారో మీ ఇష్టం… చిన్నవో, పెద్దవో కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతూ ఉంటయ్… ఇదీ అలాంటిదే… తమిళనాడులోని ఈరోడ్ జిల్లా, సత్యమంగళ ప్రాంతాల్లో ఏనుగుల బెడద ఎక్కువ… విలముంది అడవుల నుంచి వచ్చేసి, సమీపంలోని పంటచేలపై పడుతుంటయ్, ధ్వంసం చేస్తుంటయ్… ప్రధానంగా అరటి తోటలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంటయ్… మొన్న అయిదారు ఏనుగులున్న ఓ మంద ఇలాగే అడవుల నుంచి వచ్చి ఓ అరటి తోటపై పడింది… మొత్తం తోట ధ్వంసం… దాదాపు 300 చెట్లు మటాష్… కళ్లారా చూస్తూ ఆ రైతు లబోదిబో… ఏనుగుల్ని తరమలేడు, తోటను కాపాడుకోలేడు… కాసేపు స్వైరవిహారం చేసిన ఏనుగులు వెళ్లిపోయాయి… ఆ తోటలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న రైతు ఓ దృశ్యం చూసి నివ్వెరపోయాడు..
ఆ ఏనుగులు అందులోని ప్రతి చెట్టునూ ధ్వంసం చేశాయి కానీ ఒక్క చెట్లు జోలికి మాత్రం పోలేదు… వదిలేశాయి… ఆ చెట్టుకు ఒక గెల… ఆ గెలపై ఓ పక్షి గూడు కట్టుకుని ఉంది… అందులో దాని పిల్లలున్నయ్… ఆ ఒక్క చెట్టు మాత్రమే సురక్షితంగా ఉండిపోయింది… అక్కడ చేరిన గ్రామస్థులు అబ్బురపడ్డారు… ‘‘ఆ ఏనుగులకు ఎంత భూతదయ… మన మనుషులకన్నా నయం సుమా’’ అని మెచ్చుకునేవాళ్లు… ‘‘కాదులే, ఏనుగులకు అవేమీ పట్టవు… ఏదో పొరపాటున వదిలేసి ఉంటయ్… అంతేతప్ప అయ్యో, ఇక్కడ పిట్ట గూడుంది, ఆ గూట్లో పిట్ల పిల్లలున్నయ్ అనుకుని వదిలేయవులే’’ అనేవాళ్లు కొందరు… ఈలోపు అక్కడికి చేరిన తంతి టీవీ రిపోర్టర్ ఈ సంఘటనలోని ఈ ఆఫ్ బీట్ కోణాన్ని సరిగ్గా పట్టుకున్నాడు… అందరిలాగా ‘‘ఏనుగులొచ్చినయ్, పంటను తొక్కినయ్, రైతు ఏడ్చాడు, ప్రభుత్వం ఆదుకోవాలి, అధికారులు పత్తాలేరు, ఈ దురవస్థ ఎన్నాళ్లు’’ అనే స్టీరియో టైపు వార్త గాకుండా ఆ పిట్ట పిల్లలు బతికిన తీరును వార్తగా చేశాడు…
Ads
https://twitter.com/ParveenKaswan/status/1390553072510767105
ఆ ప్రాంత అటవీ అధికారి పర్వీన్ కస్వాన్ ఆ వీడియో బిట్‌ను యథాతథంగా ట్వీట్ చేశాడు.. ఏ వ్యాఖ్యానాల జోలికీ పోలేదు తను… జరిగింది చెప్పి, మాటల్లేవ్ అని రాసుకున్నాడు… అంతే, నిన్నంతా ఆ వీడియో ట్వీట్ తెగ వైరల్ అయిపోయింది… దాదాపు 27 వేల దాకా వ్యూస్, ఆరేడు వేల రీట్వీట్లు… తమ కామెంట్లలో నెటిజన్లు ఎక్కడికో వెళ్లిపోయారు… సరే, ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… వీడియో మాత్రం ఇంట్రస్టింగుగా ఉంది… ఆ పిట్ట పిల్లలకు తల్లి పిట్ట తెచ్చి పెట్టే నూకలు, గింజలు ఇంకా బాకీ ఉన్నట్టున్నయ్… బతికిపోయినయ్…!!
Share this Article