.
* HOW A SOCIAL MEDIA APP CAN CHANGE A LIFE
DISCLAIMER: ఇది మీడియా కథనాల ఆధారంగా, మరికొంత తెలుసుకున్న సమాచారంతో రాసింది. యథార్థం ఇదే అన్న నిర్ధారణ ఇందులో లేదు. కేవలం ఒక అవగాహన, హెచ్చరిక కోసమే రాస్తున్న కథనం ఇది. గమనించగలరు.
***
ఆ అమ్మాయికి 17 ఏళ్లు. ఆదిలాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమెది అదే పట్టణం కావడంతో రోజూ కాలేజీకి వెళ్తూ, వస్తూ ఉంది. ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. తన చేతిలో కూడా ఉంది. అందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి. తనకీ ఉన్నాయి. అందులో ఒకటి ఇన్‌స్టాగ్రామ్.
Ads
రీల్స్ చూడటం, ఎప్పుడైనా తన ఫొటోలు పోస్ట్ చేయడం.. ఇంతే తనకు తెలుసు! ఉన్నట్లుండి ఒక రోజు ఆ పరిస్థితి మారింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలానికి చెందిన 22 ఏళ్ల ఓ యువకుడు తనకు పరిచయమయ్యాడు. తనేం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు లాంటి విషయాలన్నీ చెప్పాడు. జెన్యూన్ అనుకుంది. బాగా మాట్లాడుతుంటే సరదా మనిషి అనుకుంది. జాగ్రత్తలు చెప్తూ ఉంటే తన మీద చూపే కేరింగ్ అనుకుంది.
మెల్లగా ఆ పరిచయం ప్రేమగా మారింది. 17 ఏళ్ల ఆ అమ్మాయికి అదో గొప్ప వరంలా కనిపించింది. జీవితాంతం తనకు తోడుండేది ఇతనే అని, ఇతనితోనే తను సంతోషంగా ఉండగలనని భావించింది.
సినిమాలు, అందులో ప్రేమికులు కలిసి ఉండటం, ఆ ఆనందాలు, పాటలు.. అన్నీ గుర్తొచ్చాయి. ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటూ, చాట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయాలేవీ ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లకి తెలియదు. ఫోన్ మాట్లాడుతుంటే క్లాస్‌మేట్స్ అనుకున్నారు. చాట్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అనుకున్నారు.
అంతకుమించి మరేదో జరుగుతుందన్న ఆలోచన వాళ్లకి లేదు. ఆ అమ్మాయి కూడా వారితో ఏమీ చెప్పలేదు. ‘ఇంకా ఎన్నాళ్లినా? పెళ్లి చేసుకుందాం’ అన్నాడతను. ‘ఇప్పుడు పెళ్లా? అదీ అమ్మానాన్నలకు తెలియకుండానా’ అని భయపడింది ఆ అమ్మాయి.
‘ఏమీ ఫర్లేదు. ‘సఖి’ సినిమా చూడలేదా? తాళి కడతాను. నువ్వు నీ ఇంట్లో ఉండు. నేను మా ఇంట్లో ఉంటాను. ఇద్దరం జీవితంలో సెటిల్ అయ్యాక ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబుదాం’ అని అభయమిచ్చాడతను. పెళ్లి జరిగితే చాలు, ఇక తమను ఎవ్వరూ విడదీయలేరనే సినిమా డైలాగుల ప్రభావంలో పడ్డ ఆ అమ్మాయి సరేనంది. కానీ ఎలా? ఎక్కడ? ఎప్పుడు? అన్నీ ప్రశ్నలే.
‘హైదరాబాదుకు రా! ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం’ అన్నాడు. సరేనని ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి బస్సెక్కి హైదరాబాదులో దిగింది. సికింద్రాబాద్‌కు వెళ్లి అతణ్ని కలుసుకుంది. ‘ఎలాగూ వచ్చేశావ్ కదా! ఇక ఇద్దరం కలిసి ఉందాం. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు’ అన్నాడు.
లాడ్జికి తీసుకెళ్లాడు. ఎలాగూ జీవితాంతం కలిసే ఉండబోతున్నాం కాబట్టి తప్పులేదంటూ వారిద్దరూ శారీరకంగా కలిశారు. అక్కడ కాలేజీకి వెళ్లిన కూతరు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. వెంటనే వెళ్లి విచారించగా అమ్మాయి కాలేజీకి రాలేదని తెలిసింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సప్తసముద్రాల అవతలున్నా సరే, ఇవాళ ఒక మనిషి ఎక్కడున్నాడన్న విషయం కనుక్కోవడం పోలీసులకు చాలా తేలికైన పని. ఎటొచ్చీ వాళ్లు కాస్త దృష్టి పెట్టి, సమయం కేటాయించాలి. వెళ్లిన అమ్మాయి ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తే, ఆ అమ్మాయి సికింద్రాబాద్ వెళ్లినట్లు తెలిసింది.
దీంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి వెతికించగా ఒక్క రోజులో తనెక్కడున్నదీ కనిపెట్టారు. అక్కడి నుంచి ఇద్దర్నీ ఆదిలాబాద్‌కు రప్పించారు. వాళ్లది ప్రేమో, మరేదో పోలీసులకు అనవసరం. కానీ ఆ అమ్మాయి మైనర్. తనకు ఇష్టమై శృంగారం చేసినా అత్యాచారమే కాబట్టి అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు.
పోక్సో చాలా కఠినమైన చట్టం. నేరం నిరూపణ అయితే, శిక్ష 10 ఏళ్లపైనే తప్ప తక్కువగా ఉండదు. అతణ్ని కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు. 22 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు ఆదరవుగా ఉంటూ, ఎంతో సాధించాల్సిన యువకుడు జైల్లోకి వెళ్లాడు. బాగా చదివి, డాక్టర్ కావాల్సిన అమ్మాయి కోర్టుల చుట్టూ తిరుగుతూ, అందరిచేతా మాటలు పడాల్సి వచ్చింది.
ఇక్కడ తప్పు ఆ అమ్మాయిదా? అతనిదా? ఇద్దరిదా? లేక పెద్దలదా? ఏమీ చెప్పలేం. ‘ఇతణ్ని నేను ప్రేమించాను. మాకు పెళ్లి చేయండి’ అని అమ్మాయి ఎమోషనల్‌గా అరవగానే, పోలీసులు హ్యాపీగా వాళ్లకు దండలు మార్పించడం సినిమాల్లోనే ఉంటుంది. నిజజీవితంలో పోలీసులు వారికి కొంతమేరకు రక్షణ కల్పిస్తారు తప్ప వాళ్ల పెళ్లి చేసి, కాపురం పెట్టించరు. జీవితాంతం పోషించరు.
ఎంబీబీఎస్ చదువుతున్న ఆ అమ్మాయి ముందు వచ్చే పరిణామాలు ఆలోచంచకపోవడం మొదటి తప్పు. తెలియని యువకుడు పిలవగానే ఇల్లు విడిచి రావడం రెండో తప్పు. అతనితో మాట్లాడి, తిరిగి వెళ్లకుండా ఉండిపోవడం మూడో తప్పు. శారీరకంగా కలవడం వారిద్దరూ కలిసి చేసిన అతి పెద్ద తప్పు.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలన్నీ ఇలాగే ఉండకపోవచ్చు. కానీ మన మీద మనకు స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు అవసరమని ఈ ఘటన మనల్ని హెచ్చరిస్తోంది. ‘A SOCIAL MEDIA APP CAN CHANGE A LIFE’ అన్నది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
సినిమాల్లో హీరో, హీరోయిన్లను చూసేసి, ఫోన్లో పరిచయమై, యాప్‌లో హాయ్ చెప్పి ఐలవ్యూ అనగానే అదే ప్రేమని, ప్రేమంటే అలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే! అప్పటికప్పుడు పెళ్లి చేసుకుని సమాజాన్ని ఎదురించాలని ఆవేశపూరిత నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత ఎటూ కాని జీవితం తయారవుతుంది.
పైగా అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ నిస్వార్థంగా ఉంటేనే ఈ ఆలోచన. ఇద్దర్లో ఒక్కరు తప్పుడు ఆలోచనతో ఉన్నా, అవతలి వ్యక్తి నిండా మోసపోయి ఇల్లు చేరతాడు. ఆ తర్వాత అవమానాలు, ఏడుపులు, వేధింపులు, కోర్టు కేసులు.. ఇదీ పరిస్థితి.
మీ అమ్మాయి/అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఏదో నిఘా పెట్టినట్లు కాకుండా, స్నేహపూర్వకంగా వారి మనసులో ఉన్నదేంటో కనుక్కోండి. వారి వయసును, అందులోని అమాయకత్వాన్ని, ఆలోచనలనూ అర్థం చేసుకోండి…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article