Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ

October 3, 2026 by M S R

.

Bhandaru Srinivas Rao ….. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?

సరిహద్దుల్లో పోరు భీకరంగా జరుగుతోంది.
మరోపక్క అక్కడికి దాపున వున్న ఆసుపత్రిలో ఓ ముసలాయన చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. యుద్ధరంగంలో వున్న కొడుకును పదే పదే తలచుకుంటున్నాడు. తనకు సేవలు చేస్తున్న నర్సుతో కొడుకు గురించి తాను పడుతున్న ఆరాటాన్ని కేవలం కనుసైగలతో అదేపనిగా వివరిస్తున్నాడు.

Ads

ఆఖరి ఘడియల్లో కన్నకొడుకు ఆఖరి చూపు కోసం ఆ ముసలాయన పడుతున్న బాధను ఆ నర్సు అర్ధం చేసుకోగలిగింది. కానీ ఏమీ చేయలేని పరిస్తితి ఆమెది.
అదే సమయంలో ఓ యువకుడు ఆసుపత్రిలో అడుగుపెట్టాడు. మిలిటరీ దుస్తుల్లో వున్న అతడిని చూడగానే నర్సుకు ప్రాణం లేచి వచ్చింది. వెంటనే అతడిని వెంటబెట్టుకుని ముసలాయన వద్దకు తీసుకు వెళ్ళి ‘ఇదిగో మీ నాన్న గారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మీకోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎంతో సమయం లేదు. తెల్లారుతుందన్న ఆశ కూడా లేదు.’ అంటూ మిగిలిన రోగులను కనుక్కోవడానికి హడావిడిగా వెళ్ళిపోయింది.

మంచానికి అతుక్కుపోయినట్టు పడివున్న ఆ వృద్ధుడి వంక అతడు తేరిపారచూశాడు. ముడతలు పడి బలహీనంగా వున్న చేతిని కదపడానికి అవసానదశలో అతడు చేస్తున్న విఫల ప్రయత్నాన్ని గమనించాడు. ఆ యువకుడే చేయిసాచి వృద్ధుడి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఆప్యాయంగా అదిమాడు. బలిష్టమైన ఆ యువకుడి చేతిలో ఎముకలు, చర్మం తప్ప ఏమీ లేని వృద్ధుడి చేయి అలాగే వుండిపోయింది.
కాసేపటి తరువాత అటుగా వచ్చిన నర్సు అతడిని చూసింది.

a soldier and a father

‘ఇక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మీరు కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తెల్లారిన తరువాత చేయవలసిన తతంగం చాలా వుండవచ్చు’ అంది.
తన చేతిని వొదలడం ఇష్టం లేదన్నట్టు ప్రశాంతంగా నిదురపోతున్న ఆ ముసలి ప్రాణాన్ని వొదిలివెళ్లడానికి అతడికి మనస్కరించలేదు. రాత్రంతా ఆ యువకుడు రోగి మంచం చెంతన అలాగే కూర్చుండిపోయాడు.
తెలతెలవారుతుండగా వృద్ధుడి ప్రాణం పోయింది. చలనంలేని ఆ చేతిని నెమ్మదిగా విడిపించుకుని వెళ్ళి నర్సును కలిసి విషయం చెప్పాడు.

కంటి మీద కునుకు లేకుండా వృద్ధుడి చెంతనే వుండి, ఆఖరి నిమిషం వరకు స్వాంతన చేకూర్చిన ఆ యువకుడిని నర్సు మనసారా అభినందించింది. ‘ఇలాటి కొడుకున్న ఆ వృద్ధుడు ఎంతో అదృష్టవంతుడు’ అని కొనియాడింది. ఆ యువకుడి మోహంలో రంగులు మారాయి.

‘ఆయన నాకు తండ్రా! అసలాయన్ని చూడడం ఇదే మొదటి సారి’ అన్నాడు. ఆశ్చర్యపోవడం ఈసారి నర్సు వంతయింది. ‘అదేమిటి, రాత్రి ఆయనతో చెబుతున్నప్పుడే ఈ విషయం నాకెందుకు చెప్పలేదని’ ఎదురు ప్రశ్నించింది.
‘అప్పుడే నాకు విషయం బోధపడింది. ఆయన నా తండ్రి కాదని చూడగానే తెలిసిపోయింది. రాత్రి గడవదని మీరే చెప్పారు. ఆయనేమో నేను తన కొడుకుననుకుంటున్నాడు. కన్నకొడుకు చెంతనే కన్ను మూసానన్న తృప్తి ఆయనకు మిగలాలని ఏమీ మాట్లాడకుండా వుండిపోయాను.

అది సరే ఈ ఆసుపత్రిలో వర్ధన్ సింగ్ అనే పేషెంటు వుండాలి. ఆయన్ని నేను వెంటనే చూడాలి. ఆయన ఒక్కగానొక్క కొడుకు మొన్న శత్రువులతో పోరాడుతూ వీరమరణం చెందాడు. ఈ కబురు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.’
యువకుడి మాటలు వింటూనే నర్సు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.

‘వర్ధన్ సింగా! ఆయన ఎవరో కాదు. కనుమూసేవరకు మీరు కనిపెట్టుకుచూసిన ఆ వృద్ధుడే వర్ధన్ సింగ్’ అంటూ మంచం మీద అచేతనంగా పడివున్న ఆ వృద్ధుడి శవాన్ని చూపించింది…
(నెట్లో తచ్చాడుతున్న చక్కటి ఇంగ్లీష్ కధకు నా స్వేచ్చానువాదం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ
  • ఒకే ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్… ఓ దివాలా జీవితాన్నే మార్చేసింది…
  • “పాపా… ఒక్కసారి నాకు ఫోన్ చేయండి… ప్లీజ్…”
  • వాష్‌రూంలోకి ఆ ఆరేళ్ల పాప… ఫ్లై దుబాయ్ కథలో అదే కీలకం !!
  • పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!
  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions