ముందుగా ఓ వార్త చదవండి… బ్రిటిషర్లు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు… కానీ అధికారాన్ని ఎలా బదిలీ చేయాలి..? ఎవరికి..? ఆ తంతు ఎలా ఉండాలి..? ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇకపై మీ దేశాన్ని మీరే పాలించుకొండి, ఆల్ ది బెస్ట్ అని ముఖతః చెప్పేసి వెళ్లిపోరు కదా… మరేం చేయాలి..?
ఇండియాకు చివరి వైస్రాయ్ అప్పట్లో లార్డ్ మౌంట్ బాటన్… ఆయనే అడిగాడు… అధికారాన్ని అప్పగించడానికి నిర్వహించే తంతు ఏమిటో మీరే ఖరారు చేసుకుంటారా..? ఎవరిని అడిగాడు… నెహ్రూను..! తను ప్రధాని గాకముందు నుంచే తన పెత్తనం స్టార్టయింది… కోట్ల మంది భారతీయులకు, దేశానికి నెహ్రూ ఆటోమేటిక్‌గా, ఎవరి అభ్యంతరమూ లేకుండా ప్రతినిధి అయిపోయాడు…
నెహ్రూకు ఈ అధికార మార్పిడి తంతు ఎలా చేయాలో అంతుపట్టలేదు… రాజగోపాలాచారిని అడిగాడు… ఆయనకు భారతీయ పద్దతులు బాగా తెలుసు… థింకర్… ఈ దేశ ఆచార వ్యవహారాల నుంచి ఆయన ఓ తంతు కనిపెట్టాడు… గతంలో చోళరాజ్యంలో ఒక రాజు నుంచి మరొక రాజుకు ఓ తంతు నిర్వహించేవారు… చోళులు అమిత శైవభక్తులు… అధికార మార్పిడికి ఆధ్యాత్మికతనూ లింక్ చేసేవారు… తద్వారా కొత్త రాజు బాగా పాలించాలనే సంకల్పం ఆ తంతులో ప్రధానం… ఇప్పటికీ పురాతన గుళ్లలో ఈ పద్థతి ఉందంటారు… తమిళనాడులో…
Ads
ఇదే తంతు మనమూ నిర్వహిద్దాం అని రాజాజీ చెప్పాడు, నెహ్రూ సై అన్నాడు… అసలు ఈ తంతు అంటే పెద్దగా ఏమీ లేదు…, ఓ పొడవైన రాచదండాన్ని (ఇంగ్లిషులో సెంగల్) ఓ మంచి ముహూర్తంలో కొత్త పాలకుడికి అందించడమే ఈ తంతు… అప్పట్లో నెహ్రూ ఏది చెబితే అది ఫైనల్ కదా… అప్పుడేం చేశారంటే… ప్రముఖ ధార్మిక మఠానికి చెందిన ఓ గురువుకు ఈ రాచదండం రూపకల్పన బాధ్యత అప్పగించారు… ఆయన చెన్నైలోని ప్రముఖ స్వర్ణకారులతో రాచదండాన్ని చేయించాడు… ఓ పొడవైన గొట్టం, పై భాగంలో బలం, సత్యం, ధర్మానికి ప్రతీకగా ఓ నంది బొమ్మ… అదే రాచదండం…
సరే, బాగుంది… మరి తరువాత కాలంలో ఈ బంగారు రాచదండం ఏమైంది..? దీన్ని ‘నెహ్రూ వాకింగ్ స్టిక్ పేరిట అలహాబాద్ మ్యూజియంలో పడేశారు… అసలు ఈ తంతు ఇప్పటి తరాలకు తెలియనే తెలియదు… తెలియకుండా చేశారు… ఇదంతా పాత కథ… మరి ఇప్పుడు..?
ఈనెల 28న కొత్త పార్లమెంటు భవనాన్ని మోడీ ప్రారంభిస్తున్నాడు కదా… దీనిపై ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయి… మన దేశంలోనే ఇలా ఉంటుంది… ప్రతిదీ రాజకీయ కోణంలో పరిశీలించడం, రచ్చ చేయడం తప్ప మన పార్టీలకు ఇంకేం తెలుసు..? స్పీకర్ మాత్రమే ప్రారంభించాలని ఒకరు… రాష్ట్రపతి ప్రారంభించాలని మరొకరు… ప్రధాని మాత్రం ప్రారంభించకూడదట… స్పీకర్ బీజేపీ మనిషి కాదా..? రాష్ట్రపతి బీజేపీ మహిళ కాదా..? ఆ పదవులేమైనా పార్టీ సంకల్పం, మద్దతు లేకుండా పార్టీరహితులు ఎన్నికవుతున్నారా..?
మోడీ ఈ దేశానికి ప్రధాని… తనకు వోట్లేసినవారికి, వోట్లేయనివారికి కూడా ప్రధానే… ప్రధాని హోదాలోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తాడు, అందులో తప్పేం ఉంది..? పార్లమెంటు ప్రారంభిస్తున్నప్పుడు తను ఓ బీజేపీ నేత కాదు, స్పష్టమైన మెజారిటీతో ప్రజలు ఎంచుకున్న ప్రధాని… ఇది ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రతిపక్షాలు, మీడియా రెడీ…
ఇక్కడ విశేషం ఏమిటంటే… నాటి చోళ రాజ్యపు అధికార మార్పిడి తంతును మళ్లీ ఆచరణలోకి తీసుకు రానున్నారు… మే 28న ఉదయం ఓ హోమం నిర్వహించి, నాడు నెహ్రూ అందుకుని, ప్రస్తుతం మ్యూజియంలో దిక్కూదివాణం లేకుండా పడి ఉన్న ఆయన ‘వాకింగ్ స్టిక్’ను మోడీ అందుకోనున్నాడు… దీనికి తమిళనాడు నుంచి మఠాధిపతులు, లోకసభ స్పీకర్ పాల్గొంటారు… సింపుల్‌గా చెప్పాలంటే… 1947, ఆగస్టు 14న రాత్రి ఏ తంతు నిర్వహించారో అదే మరోసారి నిర్వహిస్తారు… ఇదీ వార్త…
ఇక్కడ మళ్లీ రెండుమూడు డౌట్లు… 1947 ఆగస్టు 14న రాత్రి అధికార మార్పిడి తంతు అంటే… బ్రిటిషర్లు తమ పెత్తనాన్ని భారతీయులకే అప్పగిస్తూ… అంటే అధికార మార్పిడికి చిహ్నంగా ఈ రాచదండాన్ని నెహ్రూకు ఇచ్చారు… ఇక్కడ నెహ్రూ ఎవరు..? ఎందుకు తనకే రాచదండం ఇచ్చారు..? దీనికి జవాబుల్లేవు… పోనీ, మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన ఓ పాలకవర్గం నుంచి మనం అధికారాన్ని పొందాం, దానికి ప్రతీకగా అధికార మార్పిడి తంతు జరిగింది… ఓ క్షణం ఇలాగే సమాధానపడదాం… కానీ..?
ఇప్పుడు ఎవరు ఎవరికి అధికారాన్ని అప్పగిస్తున్నారు..? అధికార మార్పిడి ఏముంది ఓ భవన ప్రారంభంలో… జస్ట్, ఓ పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించుకుని, అందులోకి మారుతున్నాం, అంతే కాదా… మరి అధికారంలో మార్పిడి ఏముంది..? మన్మోహన్ నుంచి మోడీ అధికారాన్ని కైవసం చేసుకుని కూడా తొమ్మిదేళ్లు అయిపోవచ్చాయి కదా… ఇప్పుడు ఈ తంతు ద్వారా ఎవరు ఎవరికి అధికార మార్పిడి చేస్తున్నట్టు మహాశయా..?! ఇది ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారు… అంతేనా..?! నెహ్రూ కాలం నాటి రాచరికం పునఃప్రదర్శితం కాబోతుందా..?!
Share this Article