.
ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ… సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే కథ చాలా ఫేమస్ ఒకప్పుడు… కాంతారావు హీరోగా 1960 ప్రాంతంలో ఓ సినిమా కూడా వచ్చినట్టు గుర్తు…
కథానాయిక తన అందాన్ని మోహించి, తనను పెళ్లాడటానికి వస్తే, వాళ్లకు పరీక్షలు పెట్టి, ప్రశ్నలు వేసి, ఓడిపోగానే శిరస్సులు ఎగురగొడుతుంది… మహామహులే వచ్చి ఓడిపోయి, ఆ శిక్షకు గురవుతారు… అదీ కథ…
Ads
సరే, మనం ఓ కథలోకి వెళ్దాం… 1940, 50 ప్రాంతం… ఓ మహిళా రెజ్లర్… పేరు హమీదా బానో… మామూలుగా రెజ్లింగులో అప్పట్లో… అఫ్‌కోర్స్ ఈరోజుకూ… పురుషులదే కదా ఆధిపత్యం… మరీ ఆ కాలంలోనైతే ఓ మహిళ కుస్తీ పోటీల్లో పాల్గొంటే అది ఎంత అసాధారణమో కదా…
ఐతే ఆమె మామూలు రెజ్లర్ కాదు… మహామహుల్ని మట్టికరిపించేది… అవును, మగ కుస్తీ మహారాజుల్నే… ఆమెది ఉత్తరప్రదేశ్… అలీగఢ్ అమెజాన్ అని పిలిచేవారు జనం… ఆమె గెలవాలని కోరుతూ జనం ఆమె పోటీల్ని చూడటానికి తరలివచ్చేవారు… స్టార్ రెజ్లర్ ఆమె…
ఆమెకు 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె అసాధారణ వ్యక్తిత్వం, పోటీతత్వం ఆమెకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది… ఆమెకు అనేక వివాహ ప్రతిపాదనలు వచ్చాయి… కానీ ఆమె వరుడు కావాలనుకునే అభ్యర్థులందరికీ ఒక షరతు విధించేది… “నీవు నన్ను రెజ్లింగ్ పోటీలో ఓడిస్తే, నిన్ను వివాహం చేసుకుంటాను..,” సింపుల్… కానీ అదెంత కష్టమో పోటీపడేవాడికి తెలుసు… చాలామంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు…
అందుకే ఈ కథ చదువుతుంటే సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే ఆ కథే గుర్తొచ్చింది… ఓటమి కూడా శిరచ్ఛేదంతో సమానమే కదా… 1954లో మీడియా ద్వారా ఆమె పురుష రెజ్లర్లకు ఓ సవాల్ విసిరింది… మీకు చేతనైతే నన్ను ఓడించండి అనేదే ఆ సవాల్…
పంజాబ్‌లోని పటియాలా నుండి ఒక ప్రసిద్ధ రెజ్లర్, కోల్‌కతా నుండి మరొకరు ఆమె సవాలును స్వీకరించి ఆమెను ఓడించేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె తన మూడవ పోటీ కోసం బరోడాకు వెళ్లింది…
నగరం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. పెద్ద వార్తాపత్రికలు ఆమె అద్భుతమైన సాహసాల గురించి రాశాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ఆమె గురించి కవరేజ్ ఇచ్చింది. ఆమె బరోడా రాకడ బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయబడింది… ట్రక్కులు, ప్రచార మోటారు వాహనాలు వీధుల్లో తిరుగుతూ ఆమె విజయాలను హోరెత్తించాయి… ఆ సమయానికే ఆమె 300 కంటే ఎక్కువ పోటీలలో విజయం సాధించింది మరి…
ఆ సమయంలో బరోడా మహారాజా ఒక రెజ్లర్‌ను పోషించేవాడు, అతని పేరు చోటా గామా పహెల్వాన్. హమీదాకూ ఆ చోటా గామాకు నడుమ పోటీ జరగాలని జనం కోరిక… ఆమె రెడీ… కానీ సదరు పహెల్వాన్ భయపడిపోయాడు… ఓ మహిళతో పోటీచేయను అనే కుంటిసాకుతో పోటీ నుంచి తప్పుకున్నాడు… బరోడా ఒక్కసారి ఉసూరుమంది…
కొంతమంది పురుష ఆధిపత్యవాదులకు ఇదంతా సహించలేదు.., ఆమె నిత్యం పురుష ఛాంపియన్లను ఓడిస్తుండడంతో ఎవరూ సంతోషంగా లేరు… కొందరు అప్పటి బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్‌ను సంప్రదించి, ఆమెపై అనధికారిక నిషేధం గురించి ఫిర్యాదు చేయవలసి వచ్చింది…
ఆమెను సవాలు చేయడానికి నిర్ణయించుకున్న తదుపరి వ్యక్తి బాబా పహెల్వాన్ అనే మరో ప్రసిద్ధ రెజ్లర్. రెండు నిమిషాలకంటే తక్కువ సమయంలో హమీదా బానో ఆ బాబా పహెల్వాన్‌ను చిత్తు చేసి, తన చేతులు ఎత్తి విజయానందంతో అరిచింది..: “ఈ నగరంలో నా సవాలును స్వీకరించే వారెవరైనా ఉన్నారా?” చెప్పనవసరం లేదు, ఆమెకు ఎటువంటి సమాధానం రాలేదు… దటీజ్ హమీదా బానో…
బొంబాయిలో గూంగా పహెల్వాన్ అనే రెజ్లర్‌తో పోటీ అని ప్రకటిస్తే, 20,000 కంటే ఎక్కువ మంది టిక్కెట్లు కొన్నారు. కానీ ఆ వ్యక్తి భారీ జనసమూహాన్ని చూసి, అందరి ముందు ఒక మహిళ చేతిలో ఓడిపోతే తన పరువు ఏమవుతుందనే భయంతో ప్లేటు ఫిరాయించాడు… సాకులు చెప్పడం ప్రారంభించాడు, ఎక్కువ డబ్బు డిమాండ్ చేశాడు. నిర్వాహకులతో గంటల తరబడి బేరసారాలు… నిర్ణయించిన సమయం దాటిపోయింది. పోటీ జరగదని గ్రహించిన జనసమూహం కోపోద్రిక్తులై, ఈవెంట్ జరగాల్సిన ప్రదేశాన్ని ధ్వంసం చేశారు…
ఒకసారి ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి కుర్రతులైన్ హైదర్ ఒక చిన్న కథలో హమీదా బానో పేరును ప్రస్తావించారు. 1950ల మధ్యలో హమీదా రష్యన్ మహిళా రెజ్లర్ వెరా చిస్టిలిన్‌ను రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఓడించింది. కానీ ఎందుకో తెలియదు గానీ హఠాత్తుగా హమీదా రెజ్లింగ్ రింగ్ నుండి శాశ్వతంగా వైదొలగాలని నిర్ణయించుకుంది…
కథలో ట్విస్టు ఏమిటంటే..? ఆమె రెజ్లింగ్ నుంచి దూరమయ్యాక… ఆమె దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది… ఆమె తన స్వగ్రామానికి తిరిగి వెళ్లి, ఒక చిన్న దుకాణంలో పండ్లు అమ్ముతూ తన శేష జీవితాన్ని గడిపింది… కారణాలు ఎవరికీ తెలియవు… కానీ ఆమె వదిలివెళ్లిన జ్ఞాపకాలు – బలశాలులైన అనేకమంది పురుషులను ఓడించిన అజేయ మహిళగా – చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయింది…
Share this Article