నిజానికి ఇది ఓ పాత కథ… కొన్ని నిత్యస్ఫూర్తి కథల్లాగే ఇదీ ఎప్పుడు చదివినా చాలామందికి కొత్త కథే… అప్పుడెప్పుడో ఓ వింగ్ కమాండర్ రాసుకున్న ఓ నిజ అనుభవం… తనను కదిలించిన ఓ అంశాన్ని షేర్ చేసుకుంటే దాదాపు పదేళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ కథ కనిపిస్తూనే ఉంది… కంటతడి పెట్టిస్తూనే ఉంది… మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటారా..? ఏదో పాత ఇంగ్లిష్ కాపీని గూగుల్ ట్రాన్స్లేటర్లో పెట్టి, అందులో ఉత్పత్తయిన చెత్తను యథాతథంగా సోషల్ మీడియాలో పెట్టి, ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఇదేనా మనమిచ్చే నివాళి అంటూ భారీ భారీ నీతివాక్యాలు గుప్పిస్తున్నారు కొందరు… నాలుగు ముక్కలు తెలుగులో రాయలేని ఆ నివాళి వీరులు కదా నిజానికి సిగ్గుపడాల్సింది..? మనం తెలుగులోనే చెప్పుకుందాం… ఆ కథేమిటో, ఆ వింగ్ కమాండర్ బాధపడిన వ్యథ ఏమిటో… ఆయన మాటల్లోనే ఆ వింగ్ కమాండర్ పేరు వెంకీ అయ్యర్…
‘‘ఉదయం… సూర్యుడు పైపైకి వచ్చేస్తున్నాడు… మేం ఓ హెలికాప్టర్ కోసం ఎదురుచూస్తున్నాం… అందులో ఓ వ్యక్తి రావాలి… ఆయన ఎవరంటే..? మా ఫ్లయింగ్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ తండ్రి… పేరు లచ్మన్ సింగ్ రాథోడ్… ఓ ప్రమాదంలో మరణించిన విక్రమ్ అంత్యక్రియల కోసం వస్తున్నాడు ఆయన… నేను వింగ్ కమాండర్‌ను… ఒకరోజు ముందే ఆయనకు ఓ టెలిగ్రాం పంపించాను… ‘‘అయ్యా, మీ అబ్బాయి విక్రమ్ ఒక ఫ్లయింగ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు…’’ అది పంపించడానికే నాకు కన్నీళ్లు ఆగలేదు… చెట్టంత కొడుకును పోగొట్టుకున్న ఓ బాధత కుటుంబాన్ని ఓదార్చడమో, దగ్గరుండి అంత్యక్రియలు జరిపించడమో నాకు ఇదే మొదటిసారి… ప్రమాదాలు, యుద్ధాలు, మరణాలు కొత్తేమీ కాదు… కానీ మా కుటుంబసభ్యుల కన్నీళ్లు కూడా ఉప్పగానే ఉంటాయి కదా… ఎంత నిబ్బరంగా నిలబడినా సరే, కొన్నిసార్లు కంటనీరు నిగ్రహం దాటేసి మత్తళ్లు దూకుతాయి…
Ads
నిజానికి ఇలాంటి సందర్భాల్లో కుటుంబసభ్యులు చివరిసారిగా తమవారి భౌతికదేహాన్ని చూడాలని కోరుకుంటారు… చివరిచూపు… కానీ ఈ ప్రమాదంలో మరణించిన విక్రమ్ భౌతికదేహం గురించి ఏం చెప్పాలి..? విక్రమ్ తండ్రి అడిగితే ఏం చూపించాలి… ప్రమాద తీవ్రత ఎక్కువ… కాక్‌పిట్‌లో అక్కడక్కడా కొన్ని విక్రమ్ దేహం ముక్కలు కనిపిస్తే, అన్నీ ఏరి, ఒకచోటకు చేర్చాం… నిజం చెప్పాలంటే ఏ ఆకారమూ లేని నాలుగైదు కిలోల ఓ మాంసం ముద్ద అది… దాన్నే శవపేటికలో పెట్టాం… నన్ను అడిగితే నేనేం చెప్పాలి ఆ తండ్రికి… ఏం చూపించాలి..? అదీ నన్ను కలిచివేస్తున్న దుఖం…
ఎయిర్ స్ట్రిప్ వద్ద అందరమూ ఎదురుచూస్తున్నాం, హెలికాప్టర్ వచ్చింది… రాథోడ్ దిగాడు… పొట్టిగా, బక్కపలుచగా… ఎనభై ఏళ్లుంటాయేమో… గంభీరంగా ఉన్నాడు.. తెల్లటి ధోతీ… నేనాయన దగ్గరకు వెళ్లాను… ‘‘ఫ్లయిట్ కమాండర్ వెంకీ మీరేనా..?’’ అనడిగాడు… ‘‘అవును, నేనే…’’ అన్నాను నేను…. ‘‘విక్రమ్ నాకు చెప్పాడు మీ గురించి… ఒక్క నిమిషం నీతో విడిగా మాట్లాడతాను’’ అన్నాడు… ఓ కాంక్రీట్ ప్లాట్ఫారం చివరకు తీసుకెళ్లాను… అది విక్రమ్ అంత్యక్రియలు జరిగే ప్లేస్… అన్ని ఏర్పాట్లూ చేసి ఉంచాం… ‘‘నేను నా కొడుకును కోల్పోయాను, మీరు మీ మిత్రుడిని కోల్పోయారు… అంత్యక్రియలకు మీరు అన్ని ఏర్పాట్లూ చేసే ఉంటారు, నేనేం చేయాలో చెప్పండి, మీరు చెప్పినట్టు చేస్తాను… కానీ ఒక్క విజ్ఞప్తి… మా విక్రమ్ దోస్తులందరితోనూ మాట్లాడతాను… వాడి గదిలో ఉంటాను ఈ ఒక్క రాత్రి.., వాడి వర్క్ ప్లేస్ చూస్తాను, వెళ్లిపోతాను ప్లీజ్…’’ అంతటి బాధాకరమైన స్థితిలోనూ ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా ఓ జనరల్ ఆదేశాలు జారీచేస్తున్నట్టుగా ఉన్నాయి ఆయన మాటలు…
సైనిక లాంఛనాలతో విక్రమ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి… కొడుకు మొహం చూపించాల్సిందిగా ఆయన అడగలేదు… తనే చితికి నిప్పంటించాడు… విక్రమ్ తోటి స్క్వాడ్రన్ పైలట్లు, ఇతర సిబ్బందితో ఆ సాయంత్రం గడిపాడు ఆయన… విక్రమ్ రూమ్మేట్తో కలిసి ఆ గదికి వెళ్లాడు… తన కోసం వేరే గెస్ట్ హౌజ్ సిద్ధం చేశాం, కానీ ఆయన నిన్నటివరకూ తన కొడుకున్న గదిలోనే పడుకున్నాడు… తెల్లవారి విక్రమ్ వర్క్ ప్లేస్ స్క్వాడ్రన్ ఏరియాకు వెళ్లాడు, ఇక అక్కడి నుంచి తనను పంపించేశాం… ఆయన వెళ్లిపోయాక మా బాస్‌తో ఆశ్చర్యంగా అన్నాను… ‘‘ఒక్క కన్నీటి చుక్క లేదు, నిబ్బరం సడలలేదు… ఓ సైనిక జనరల్లాగా కనిపించాడు… నాకు నచ్చాడు సార్’’ అన్నాను… మా బాస్ చెప్పిన వివరాలు నన్ను మరింత ఆశ్చర్యంలో, మరింత ఆవేదనలో ముంచేశాయి…
‘‘లచ్మన్ సింగ్ రాథోడ్… నిజానికి తనే ఓ యుద్ధవీరుడు అనాలి… తనకు ముగ్గురు కొడుకులు… ఈ దేశం కోసం ఆ ముగ్గురు కొడుకుల్ని అర్పించాడు… మొదటి కొడుకు కెప్టెన్ ఘనశ్యామ్ సింగ్… గూర్ఖా రైఫిల్స్… లడఖ్‌లో యుద్ధంలో మరణించాడు… ఆయన రెండో కొడుకు పేరు మేజర్ బీర్ సింగ్… ఉగ్రవాదులు ఇచ్చోగిల్ కెనాల్ దగ్గర ఎరవేసి, మాటేసి, వేటేసిన ఓ కుట్రలో ప్రాణాలు కోల్పోయాడు… మూడో కొడుకు మన విక్రమ్… ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు… మొన్న మనం తనను కోల్పోయాం… ముగ్గురినీ కోల్పోయిన ఆ తండ్రిని మించిన నిజసైనికుడు ఇంకెవరు..? వాస్తవానికి తనే ఓ అమరవీరుడు అనాలి… కానీ ఈ త్యాగాల్ని ఎవరూ గుర్తించరు… అసలు వీళ్లు కదా గుర్తింపబడాల్సింది… అవినీతి అధికారులు, క్షుద్ర నాయకులు, అక్రమాల వ్యాపారులు, సినిమా తారలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు… ఎవరు నిజమైన పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, పద్మవిభూషణ్‌లు… కనీసం ఇలాంటి తండ్రుల గురించి పిల్లలకు పాఠాలు చెబితేనేం..?’’ మా బాస్ అడిగిన ప్రశ్నకు ఈరోజుకూ జవాబు లేదు…!!
Share this Article