Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…

April 1, 2026 by M S R


పులిట్జర్ అవార్డు పొందిన ఒక ఫోటో… 1993లో సూడాన్‌లో భీకరమైన దుర్భిక్షం… కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ వార్తాచిత్రాల కోసం వెళ్లాడు… ఓ చిన్న పిల్ల, అస్థిపంజరంలా దయనీయంగా… ఆమె చనిపోతే ఎత్తుకుపోతాను అన్నట్టుగా పక్కన ఓ రాబందు… ఆ ఫోటో తీశాడు… ప్రపంచం అబ్బురపడింది, ఏడ్చింది… కానీ ఒకరెవరో లేఖ రాశారు, ప్రశ్నించారు… నువ్వు ఫోటోగ్రాఫర్‌వా, మనిషివా అని…

సీన్ కట్ చేస్తే…. ఓ మథనంతో ఆ ఫోటోగ్రాఫర్ కొన్నాళ్లకే ఆత్మహత్య చేసుకున్నాడు… ఆత్మమథనం, ప్రాయశ్చిత్తం… ఆ కథ వేరే… సరే, మరో చిన్న కథ చదువుదాం….



Raghu Mandaati….. చిన్న కథ.
కిటికీ అవతల వర్షం వెనకాడుతోంది…
కురవాలా? ఆగిపోవాలా? అని ఆకాశమే ఒక సందిగ్ధంలో నిలబడి ఉన్నట్టుంది.
బూడిద రంగు మబ్బులు ఆకాశాన్ని కప్పేసి… ప్రపంచాన్ని ఒక అర్ధసత్యంగా మార్చేశాయి.
రైలు చప్పుడు…
నా గుండె చప్పుడికి పోటీ పడుతోంది.
ఇనుప చక్రాలు పట్టాల మీద రాసుకుంటూ వెళ్తున్న ఆ శబ్దం
ఒక లయ… ఒక సంగీతం…
కానీ నా లోపల మాత్రం
ఏదో పగిలిన స్వరం… ఒక అపశ్రుతి… ఒక అర్థం కాని నొప్పి.

Ads

నా ఒడిలో నా పాత కెమెరా.
ఇది కేవలం యంత్రం కాదు…
ఇది నా జీవితాన్ని చూసిన ఏకైక సాక్షి.
నా పాతికేళ్ళ ఏళ్ల జ్ఞాపకాలను మోసుకుంటూ నిశ్శబ్దంగా నాతో పాటు ప్రయాణిస్తున్న ఒక జీవం.
ఈ లెన్స్ ద్వారా నేను ప్రపంచాన్ని చూశాను…
కానీ…
నన్ను నేను చూడడం ఎప్పుడో మర్చిపోయాను.
నేను…
ఊళ్ళూ, దేశాలూ తిరిగే ఒక ఫోటోగ్రాఫర్‌ని.
ఎవరికైనా దగ్గరవ్వగలను.
ఒక అపరిచితుడి కళ్లలో దాగి ఉన్న కథను…
ఒక క్లిక్‌తో ప్రపంచానికి చూపగలను.
కానీ…

ఈ ప్రయాణంలో నా పక్కన ఉన్న సీటు ఖాళీగా ఉంది.
ఆ ఖాళీ కేవలం ఈ సీటులో కాదు…
నా జీవితంలో కూడా ఉంది.
ఒక పెద్ద నిశ్శబ్దం లాగా.
రైలు వేగం పెరిగింది.
బయట చెట్లు చీకటిలో కరిగిపోతూ వెనక్కి పరిగెడుతున్నాయి.
నా మనసు కూడా…
కాలంలో వెనక్కి పరిగెడుతోంది.
ఆ రోజుల్లో…
నేను వెలుగును వెతికే వాడిని.
ఉదయించే సూర్యుడు…
నవ్వే ముఖాలు…
రంగులతో నిండిన పండుగలు…
అవి నా ప్రపంచం.
అప్పుడు…

నా జీవితంలోకి తాను వచ్చింది.
తాను ఒక చిత్రకారిణి.
నేను నిజాన్ని బంధించేవాడిని…
తాను నిజాన్ని మార్చి… రంగులతో మరింత అందంగా మలిచేది.
“నువ్వు తీసే ఫోటోల్లో మనుషులు కనిపిస్తారు…
కానీ వాళ్ల ఆత్మ ఎక్కడ?” అని అడిగేది తాను.
నేను నవ్వి తప్పించుకునేవాడిని.
“కెమెరా కాంతిని మాత్రమే గుర్తుపడుతుంది…” అనేవాడిని.
కానీ…

ఒక రోజు
నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు వచ్చింది.
పదేళ్ల క్రితం.
ఒక సరిహద్దు దేశం…
యుద్ధం మొదలైంది.
నాలో ఒక ఆశ…
ఒక ఆశయం…
ఒక ఆరాటం…
“ఇది నా జీవితంలో గొప్ప ఫోటో అవుతుంది” అన్న ఆకాంక్ష.
తాను ఆపింది.
“నువ్వు వెళ్లేది కేవలం యుద్ధం చూడటానికి కాదు…
నీ లోపల ఏదో అంతరిస్తుంది…” అంది.

కానీ…
నా అహంకారం
నా కలల కంటే పెద్దది అయిపోయింది.
అక్కడ నేను చూసింది
నరకం.
బాంబుల మోత…
గాలిలో తేలుతున్న దుమ్ము…
రక్తపు వాసన…
చిరిగిన గుడ్డపీలికలు…
శిథిలాల కింది అర్తనాదాలు…
ఒక తల్లి తన బిడ్డని పిలుస్తోంది…
ఒక బిడ్డ తన తల్లిని వెతుకుతోంది…
అక్కడ మనుషులు లేరు…
కేవలం గాయాల వ్యధలు మాత్రమే ఉన్నాయి.

ఒక శిథిలమైన గోడ వెనుక
ఒక చిన్న పాప.
ఒంటరిగా…
చేతిలో విరిగిన బొమ్మ…
కళ్లలో భయం…
నా వేలు
షట్టర్ మీద ఆగిపోయింది.
ఆ క్షణం…
రెండు ప్రపంచాల మధ్య నిలిచిపోయాను.
ఒకటి
ఆమెను కాపాడే మనిషి.
మరొకటి
ఆమెను బంధించే ఫోటోగ్రాఫర్.
నేను క్లిక్ చేశాను.

ఆ శబ్దం
ఆ పాప ఏడుపును మించిపోయింది.
ఆ క్షణం
నేను గెలిచాను.
కానీ…
మనిషిగా ఓడిపోయాను.
తిరిగి వచ్చిన తర్వాత…
నేను ఆ ఫోటో చూపించాను.
తాను ఏమనలేదు.
తాను నన్ను చూసింది.
అది కోపం కాదు…
అది ద్వేషం కాదు…
అది జాలి.

  • “నువ్వు ఆ పాపని కాపాడలేకపోయావు…
    కానీ ఆమెను బంధించడంలో విజయం సాధించావు” అంది.
    ఆ మాటలు
    నా లోపల ఎక్కడో తగిలింది…
    “నువ్వు వెలుగు కోసం వెళ్లి…
    నీ లోపల వెలుగునే కోల్పోయావు…”
    అది తన చివరి మాట.
    తాను వెళ్లిపోయింది.
    నేను ఆపలేదు.
    ఎందుకంటే
    నా అహంకారం ఇంకా బతికే ఉంది.

రైలు ఒక్కసారిగా ఆగింది.
చిన్న స్టేషన్.
వర్షం ఇప్పుడు గట్టిగా పడుతోంది.
చెట్లు వణుకుతున్నాయి.
గాలి కిటికీ అద్దాన్ని కొడుతోంది.
నా ఎదుట
ఒక ముసలాయన వచ్చి కూర్చున్నారు.
ఆయన చేతిలో పాత పుస్తకం.
“ఎక్కడికి ప్రయాణం?” అని అడిగారు.
నేను నెమ్మదిగా
“తెలియదు…” అన్నాను.
ఆయన నవ్వారు.

“తెలియకపోవడమే నిజమైన ప్రయాణం” అన్నారు.
ఆ మాట
నా లోపల ఒక దీపం వెలిగించినట్టైంది.
నా త్యాగం ఏమిటి?
నేను ప్రేమతో కూడిన స్నేహాన్ని వదిలేశాను.
ఒక కళ కోసం.
కానీ…
ఆ కళలో జీవం ఉందా?
నా ఫోటోలు
గోడలపై వేలాడుతున్నాయి.

కానీ తాను గీసిన ఒక చిన్న బొమ్మ
ఇంకా నా లోపల శ్వాసిస్తోంది.
“నిజమైన కళ… కనిపించేది కాదు… అనుభవించేది…”
అని తాను చెప్పిన మాటలు
ఇప్పుడే అర్థమవుతున్నాయి.
రైలు మళ్లీ కదిలింది.

  • మెరుపులు…
    పిడుగులు…
    చీకటిలో తడిసిన ప్రపంచం…
    జీవితం కూడా
    ఒక డార్క్ రూమ్ లాంటిది.
    చీకటిలోనే చిత్రాలు పుడతాయి.
    అతిగా వెలుగు పడితే
    అన్నింటినీ ఓవర్ ఎక్సపోజ్ చేస్తుంది…
    బహుశా…
    నా జీవితం కూడా అలానే ఓవర్ ఎక్సపోజ్ అయ్యిందేమో…

“నీ కెమెరాలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి?” అని ఆయన అడిగారు.
“వేలల్లో…”
“మరి… నీ మనసులో?”
సమాధానం లేదు.
నేను కెమెరాను మెల్లగా బ్యాగులో పెట్టాను.
మొదటిసారి
లెన్స్ లేకుండా ప్రపంచాన్ని చూడాలని నిర్ణయించుకున్నాను.
బయట వర్షం చెట్లను వంగిస్తోంది.
ఆ వంగిన కొమ్మల్లో ఓ వినయం ఉంది.

  • ఓ అంగీకారం.
    జీవితం అంటే
    క్షణాలను బంధించడం కాదు…
    ఆ క్షణంలో కరిగిపోవడం.
    ఆ పాపను హత్తుకుని ఉండి ఉంటే…
    నా కెమెరా ఖాళీగా ఉండేది…
    కానీ నా ఆత్మ నిండిపోయేది.

రైలు వంతెన మీద ఉంది.
కింద నది ఉప్పొంగుతోంది.
వర్షం తగ్గింది…
కానీ గాలిలో ఇంకా తడి ఉంది.
నేను కళ్లు మూసుకున్నాను.
ఇప్పుడు
నా ముందు ఒక ఫోటో కాదు…
ఒక భావం ఉంది.
తాను నవ్వుతోంది.
నిశ్శబ్దం…
ఎంత శబ్దంగా ఉందో!

నా ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలియదు.
కానీ ఇకపై
నేను చిత్రాలను తీయను.
నేనే ఒక చిత్రం అవుతాను.
నీటి చుక్కలు అద్దంపై కలుస్తున్నాయి…
వాటికి పేరు లేదు…
గమ్యం లేదు…
కేవలం ప్రయాణం.
ఆకాశంలో ఒక మెరుపు.
ప్రకృతి తీసిన ఆ ఒక్క క్లిక్ ముందు
నా కెమెరా ఎంత చిన్నది!

  • నేను కళ్లు తెరిచాను.
    వెలుగు ఇప్పుడు బయట లేదు.
    నా లోపల ఉంది.
    వర్షం ఆగిపోయింది.
    కానీ తడి… ఇంకా ఉంది.
    నిశ్శబ్దం…
    ఇంత గాఢంగా ఉంటుందా?

..
.
.
.
రఘు మందాటి



1. వృత్తి vs మానవత్వం (The Conflict)…. కెవిన్ కార్టర్ రాబందు ఫోటో తీసినప్పుడు ప్రపంచం ఎదుర్కొన్న అదే నైతిక ప్రశ్నను ఈ కథలోని పాత్ర కూడా ఎదుర్కొంటుంది…. “ఆమెను కాపాడే మనిషి కావాలా? లేక బంధించే ఫోటోగ్రాఫర్ కావాలా?” అన్న సందిగ్ధంలో, అహంకారం గెలిచి మనిషి ఓడిపోవడం ఈ కథలోని విషాదం….

2. వెలుగు మరియు చీకటి (The Metaphor)…. ఫోటోగ్రఫీ పరిభాషను (Exposure, Dark room, Lens) జీవితానికి అన్వయించిన తీరు చాలా బాగుంది….

  • ఓవర్ ఎక్స్‌పోజర్…: జీవితం అతిగా వెలుగులోకి (ప్రసిద్ధిలోకి) వస్తే అసలు సత్యం కనబడకుండా పోతుందన్న భావన…

  • డార్క్ రూమ్…: చీకటిలోనే చిత్రాలు (జ్ఞాపకాలు) రూపుదిద్దుకుంటాయనే సత్యం….

3. కళ యొక్క అసలు అర్థం…. “నువ్వు తీసే ఫోటోల్లో మనుషులు కనిపిస్తారు… కానీ వాళ్ల ఆత్మ ఎక్కడ?” అని ఆ చిత్రకారిణి అడిగే ప్రశ్న కథకు ప్రాణం పోసింది…. ఒక సంఘటనను డాక్యుమెంట్ చేయడం కంటే, ఆ క్షణంలో మమేకమవ్వడమే (Living the moment) నిజమైన కళ అని కథానాయకుడు ఆలస్యంగా గుర్తిస్తాడు…

4. ప్రయాణం – పరిణామం …. రైలు ప్రయాణం ఇక్కడ కేవలం ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లడం కాదు; అది అహంకారం నుండి వినయం వైపు, కెమెరా లెన్స్ నుండి మనసు కంటి వైపు సాగిన ప్రయాణం. “నేను చిత్రాలను తీయను.. నేనే ఒక చిత్రం అవుతాను” అనడంలో ఒక పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కనిపిస్తుంది….


ఒక చిన్న మాట…: కెవిన్ కార్టర్ కథలోలాగే, ఈ కథలో కూడా “ప్రాయశ్చిత్తం” అనేది మరణం ద్వారా కాకుండా, తనను తాను తెలుసుకోవడం (Self-realization) ద్వారా జరగడం ఒక సానుకూల ముగింపు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…
  • విద్వేష బిల్లుపైనా అదే పింక్ విషం..! సుప్రీం చెప్పిందేమిటో తెలుసా…!!
  • జనగణనలో ‘సహజీవనాని’కీ గుర్తింపు… కానీ అది పెళ్లి సర్టిఫికెట్ కాదు…
  • పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వాకు ఏమైంది..? తల ఎందుకు పగిలింది..?!
  • కాళేశ్వరంపై అభిశంసన సరే… మరి శిక్షించే చర్యలేవి మంత్రివర్యా…
  • కథ, లాజిక్కులు జాన్తా నై …. గరం మసాలాల దట్టింపుతోనే చల్తా…
  • అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
  • దశావతారం…! కథ కోసం పాత్రలా..? పది పాత్రల కోసం కథా..?!
  • ‘‘మీ ఏడుపే మాకు దీవెన’’… లారీల వెనుక కనిపిస్తుంటుంది కదా… ఇదే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions