చట్టం, ధర్మం, న్యాయం… ఈ మూడింటి నడుమ తేడా ఏంటి..? సింపుల్… ఓ వ్యక్తి నమ్మి, నీకు అప్పు ఇచ్చాడు, కన్నుమూశాడు, కాగితం లేదు… కాగితం లేకపోతే అప్పు తీర్చే పనే లేదంటుంది చట్టం… కాదు, తీర్చాలి అంటుంది న్యాయం… అప్పు తీర్చడమే కాదు, కొన్నాళ్లు ఆ కుటుంబం బాగోగులు పట్టించుకోవాలి అంటుంది ధర్మం… ఇప్పుడంటే ఏళ్లకేళ్లు విచారణలు, లాయర్లు, కోర్టులు, కింది కోర్టులు, పైకోర్టులు… మరీ సివిల్ కేసులు అయితే లాయర్ల భవనాలు పెరుగుతూ ఉంటయ్, కక్షిదారుల ఆస్తులు తరుగుతూ ఉంటయ్… ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వెళ్లి బోరుమంటాడు… గతంలోనైతే ఊరికి ఏ పెదరాయుడో ఉండేవాడు… ఎలాంటి కేసైనా సరే, అదే ఫుల్ బెంచ్… ఫటాఫట్ తేలిపోయేవి కేసులు… కానీ ఇప్పుడు పెదరాయుళ్లు లేరు, ఉన్నాసరే, వాళ్లు చెబితే వినేవాడు ఎవడు..? ఫోఫోవోయ్ అంటారు…
ఒకప్పుడు మనిషికి పాపభీతి ఉండేది… అయితే రశీదు, తప్పితే మశీదు… అంటే కాగితం లేకపోతే, ఏ దేవుడి ఆవరణలోనో ప్రమాణం చేయాలి… అంతే… తప్పుచేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం ఉండేది… తురుత్తి అని కేరళలో ఓ చిన్న ఊరు… కాసరగోడ్ జిల్లాలోని చెరువత్తూర్, నీలేశ్వర్ నడుమ ఉంటుంది… సీపీఎంకు బాగా పట్టున్న గ్రామం… ఐనాసరే, ఏదైనా పంచాయితీ తలెత్తితే చాలు, Sree Nellika Thuruthi Kazhakam Nilamangalath Bhagavathy Temple లోకి వెళ్లిపోతారు… కొన్ని వేల కుటుంబాలకు ఆ గుడికోర్టు ఏది చెబితే అదే సుప్రీంకోర్టు తీర్పు…
Ads
ఆ గుళ్లో దాదాపు ప్రతి కులానికీ ప్రాతినిధ్యం ఉంది… ముస్లింలకు కూడా… ఉత్సవాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు… గర్భగుడి దగ్గరలో ఓ చెక్కతో చేసిన పీఠం ఉంటుంది… ప్రధాన న్యాయమూర్తి దాని మీద కూర్చుని తీర్పు చెబుతాడు… దాదాపు 1000 సంవత్సరాలుగా ఈ గుడికోర్టు నడుస్తున్నట్టు ఓ అంచనా… ఆస్తి, కుటుంబ తగాదాలు గనుక ఉంటే అక్కడికి వస్తారు, ఆడవాళ్లయితే ఇంటి దగ్గరే స్నానాలు చేసివస్తారు, మగవాళ్లయితే అక్కడికి వచ్చాక కోనేట్లో స్నానం చేసి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తారు… పూజారులు, ధర్మకర్తలతో కూడిన జడ్జిల కమిటీ పరిశీలిస్తుంది… గుడికి పాలు తీసుకొచ్చే వాళ్లతో ప్రతివాదులకు నోటీసులు పంపిస్తారు…
వీలైనంత వేగంగా… ‘‘ధర్మం’’ కోణంలో తీర్పు వెలువరిస్తారు… అలాగని చట్టాలు వాళ్లకు తెలియవని ఏమీకాదు… 1970లో ఓ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లి వచ్చింది, దాన్ని కూడా ‘తప్షా’ చేసింది ఈ గుడికోర్టు… ఖర్చుల్లేవు, వాయిదాల్లేవు, ఏళ్ల తరబడీ తిరగడాల్లేవు… మరి ఈ తీర్పులకు చట్టబద్ధత ఏమిటి అంటారా..? ఇరుపక్షాలూ పాటిస్తాయి, అంతే… నిజంగానే మన న్యాయవ్యవస్థ ఎన్నిరకాల అవలక్షణాలతో తనకుతానే న్యాయం చేసుకోలేని దురవస్థలో ఉంది కదా… ఇలాంటి సంప్రదాయ, ధార్మిక, ఆధ్యాత్మిక న్యాయస్థానాలు మళ్లీ కనిపిస్తాయా..?
లక్షలు ఖర్చు పెట్టించి, ఆస్తులు అమ్మించి, తీరా మెడికల్ ఇన్స్యూరెన్స్ పరిమితి తీరాక, శవాన్ని మూటగట్టేసి అప్పగించే ఎన్ని వేల కార్పొరేట్ వైద్యం కేసుల్ని చూస్తున్నాం… కార్పొరేట్ భూతం నిజస్వరూపం ఏమిటో కరోనా బట్టలు విప్పి మరీ చూపించింది… ఇప్పుడు అందరి గుండెలూ కొట్టుకుంటున్నయ్… దేశీయవైద్యం, సంప్రదాయ వైద్యం బాగా డెవలప్ అయితే బాగుండు అని… కానీ వినేవాడెవడు..? వైద్యం ఐసీయూల్లో కాదనీ, వంటింట్లోని పోపులపెట్టెలో కూడా దాగి ఉందనీ, ఎటొచ్చీ ఏ రోగానికి ఏది అవసరమో తెలివిడి ఉండాలనీ ఇప్పుడు అంటున్నారు… అలాగని అల్లోపతి వైద్యం సాధించిన శాస్త్రీయ విజయాలు తక్కువేమీ కాదు…
కానీ కార్పొరేట్ ప్రపంచం అల్లోపతిని జనానికి దూరం చేసింది… చేస్తోంది… అచ్చం మన న్యాయవ్యవస్థ కూడా పేదలకు న్యాయాన్ని అందించడంలో ఫెయిల్… అసలు బెయిళ్లకు అర్హత ఉండీ, డబ్బు లేక, లాయర్లను పెట్టుకోలేక ఎన్ని వేల మంది మన జైళ్లలో మగ్గుతున్నారో కదా… పోనీ, ఇలాంటి గుడికోర్టులో, గ్రామన్యాయ పంచాయితీలో ఇప్పుడు రివైవ్ అవుతాయా..? కష్టం… కానివ్వరు… కనీసం చిన్న చిన్న కేసుల్లో తీర్పులకూ చాన్సివ్వరు… ఎప్పటికప్పుడు న్యాయపంచాయితీలు అనే సబ్జెక్టు మీద డిబేట్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఊదు కాలదు, పీరు లేవదు… కదలనివ్వరు…
అన్నట్టు ఈ గుడి విశేషం మరొకటి ఉంది… కొన్ని కేసుల్లో పోలీసులు, వీవీఐపీలు కూడా వచ్చి సెటిల్ చేసుకుంటున్నారు… అక్కడున్న జడ్జిలను అడిగితే బోలెడు ఉదాహరణలు చెబుతారు… కొన్ని సున్నితమైన కేసులయితే అసలు నోరు విప్పరు… అంత కాన్ఫిడెన్షియల్… ఒకసారి గుడికోర్టులో విచారణ ముగిసిందీ అంటే, ఇక ఆ కేసు గురించి ఎవరూ ఎక్కడా డిస్కస్ చేయకూడదు, అంతే… ఆధ్యాత్మిక వాసనలకు దూరదూరంగా ఉండే సీపీఎం శ్రేణులు కూడా ఈ గుడికోర్టు వ్యవహారాల్లో వేలుపెట్టదు… ఇరుపక్షాలకూ తీర్పు నచ్చితే వ్యతిరేకించడానికి ఏముంది..? అంతే కదా… ఇన్ని వందల ఏళ్లుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న ఈ గుడికోర్టు కథ ఇంటస్ట్రింగ్ కదా…!!
Share this Article