నా భర్త ఎప్పుడూ అంటుండేవాడు… ‘‘నేర్చుకో, వడ పావ్ ఎలా చేయాలో నేర్చుకో, ఈ పని ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది’’ అని… ఆయన పొద్దున్నే పొలం పనికి వెళ్లేవాడు… సాయంత్రం అయ్యిందంటే చాలు, తన వడ పావ్ స్టాల్‌కు చేరేవాడు… ప్రతిరోజూ… ఎప్పుడూ నాగా ఉండదు… వడ పావ్ స్టాల్‌కు నన్ను కూడా తీసుకెళ్లేవాడు… వెళ్లేదాన్ని…
నేనూ ఆయనకు చెబుతుండేదాన్ని… ‘‘నువ్వున్నావుగా… ఈ వడ పావ్ తయారీ, అమ్మకాల పని నాకెందుకు..? ఐనా నాకు చేయడం రాదు, అమ్మడం అసలే రాదు’’… కానీ వింటూనే తల అడ్డంగా ఊపేవాడు… ఎప్పుడూ ఈ తంతు నడుస్తూనే ఉండేది… మా ఊళ్లో అందరూ సరదాగా నవ్వులూ అనేవాళ్లు… ‘‘ఒక్క మాట మీద భలే ఉంటారయ్యా మీరు… మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు, ఎప్పుడూ కలిసే ఉంటారులే…’’
మాది ప్రేమ వివాహం… చిన్నప్పటి నుంచీ ఒకరికి ఒకరు బాగా తెలుసు… మా ఎదురింట్లోనే ఉండేవాళ్లు… 23 ఏళ్ల వయస్సులో నాకు పెళ్లయింది… నా పెళ్లి పల్లకి ప్రయాణం మా ఇంటి నుంచి తన ఇంటికి… జస్ట్, వీథి క్రాస్ చేయడం మాత్రమే… బహుశా ఇంత తక్కువ దూరం పెళ్లి పల్లకీ ప్రయాణం ఎవరి జీవితంలోనూ లేదేమో… అందరూ అనేవాళ్లు… రేఖా నువ్వు అదృష్టవంతురాలివే అని… నిజమే, మా ఆయన బంగారం, నేనంటే తనకు ప్రాణం… ఇంట్లో పనిచేసేవాడు, బయట పనిచేసేవాడు… తనతో సమానంగా చూసేవాడు నన్ను… మూడేళ్లలో మాకు ఇద్దరు పిల్లలు… ఓ చిన్న కుటుంబం, చింతల్లేకుండా సాగిపోయేది… కానీ ఎవరు ఊహిస్తారు..?
Ads
16 ఏళ్ల తరువాత… తనలో ఏదో అనారోగ్యం… చిక్కిపోతున్నాడు… బరువు బాగా తగ్గాడు… మొహంలో కళ పోయింది… ఆగకుండా దగ్గు… రాత్రిళ్లు ఆగేది కాదు… ఓరోజు మరీ ఎక్కువగా దగ్గు, నీరసం ఉందని హాస్పిటల్‌కు బయల్దేరాం… డాక్టర్లు చూసి అసలు జబ్బు ఏమిటో చెప్పకుండానే కన్ను మూశాడు… నేను షాక్‌లో ఉండిపోయాను… దేవుడు ఇంత హఠాత్తుగా ఆయన్ని తీసుకుపోవడం నాకు జీర్ణం కావడం లేదు… ఏడుపు ఆగడం లేదు… ఎవరెంత ఓదార్చినా నాది పూడే నష్టం కాదు కదా…
తప్పదు, కాలం మన కోసం ఆగదు… ఇల్లు గడవాలి… పిల్లలు ఎదిగే దశలో ఉన్నారు… చదువుకుంటున్నారు… తప్పలేదు… ఏ వడ పావ్ స్టాల్ పనికి దూరంగా ఉన్నానో అదే దిక్కయింది… రోజూ తనతోపాటు వెళ్లేదాన్ని కానీ ఒంటరిగా దాన్ని నడపడం నాకేం చేతనవుతుంది… పని స్టార్ట్ చేశాను… దాదాపు రోజుకు 70 నుంచి 75 మంది కస్టమర్లు వచ్చేవాళ్లు… ఆ పనే నాకు బాగా ఎక్కువగా అనిపించేది… ఈ స్థితిలో నా అమ్మానాన్న, నా కుటుంబం నాకు సపోర్టుగా నిలబడింది…
ఏదైనా దిక్కుతోచకపోతే… నా భర్త అయితే ఏం చేసేవాడు అని ఆలోచించేదాన్ని, ఏదో మార్గం దొరికేది… కస్టమర్లకు ప్రేమగా వడ పావ్ ఎలా సర్వ్ చేయాలో బాగా అర్థమైంది… స్టాల్‌కు వచ్చేవారి సంఖ్య ఏమీ తగ్గలేదు, సరికదా పెరుగుతున్నారు… స్టాల్ నా అవసరాలు తీరుస్తోంది… సరిపడా డబ్బు వస్తోంది… బాగా కాదు, జస్ట్, సరిపోయేంత… నా కంచంలోకి ఆహారం ఇచ్చింది, నా పిల్లల్ని చదివించింది… నా కూతురి పెళ్లి చేసింది… ఈ స్టాల్ నన్ను నిలబెట్టింది…
ఏడేళ్లు గడిచిపోయాయి… క్రమం తప్పకుండా, నా భర్తలాగే… ప్రతిరోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు స్టాల్ తెరుస్తాను… ఏడున్నర వరకూ ఓపెన్… ఎక్కువో, తక్కువో ఎప్పుడూ ఆలోచించలేదు, రోజూ 150 వడ పావ్‌లు అమ్ముతున్నాను… నిజంగా నేనిలా సొంతంగా స్టాల్ నడిపించుకునే స్థితి వస్తుందేమో అనుకున్నాడేమో… రోజూ ఈ స్టాల్‌కు తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు… నేర్చుకో అని చెప్పేవాడు… ఏది ఎలా చేయాలో చూపించేవాడు… కానీ మనసు పెట్టేదాన్ని కాదు… కానీ ఇప్పుడు తప్పడం లేదు… అన్నీ నేర్పించాడు గానీ తను లేకుండా ఒంటరిగా ఎలా బతకాలో చెప్పకుండానే వెళ్లిపోయాడు…
ఈరోజున మా అబ్బాయి ఓ బ్యాంకులో పెద్ద పోస్టులో ఉన్నాడు… ఇప్పుడు డబ్బు గురించి, జీవితం గడవడం గురించి చింత లేదు… ‘‘ఇంకా ఎన్నాళ్లు చేస్తావమ్మా, ఈ పని మానెయ్’’ అంటుంటాడు… కానీ మానలేను… ఓసారి ఓ కస్టమర్ అన్నాడు… ‘‘ఆంటీ, మీ స్టాల్‌లో వడ పావ్ తిన్నంత రుచి నాకు ఎక్కడా దొరకలేదు’’… నా భర్త పైనుంచి ఇది వినే ఉంటాడు, చూసే ఉంటాడు… తన మొహంపై చిరునవ్వు మొలిచి ఉంటుంది… సరిగ్గా ఈ ఊహే నన్ను, ఇంకా స్టాల్‌ను నడిపిస్తూనే ఉంది… ఆ ఫీలింగ్‌ను నేనెలా వదులుకోగలను…
(ఓ ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం… వడ పావ్ స్థానంలో మిర్చి బజ్జీల బండిగా చిత్రీకరిస్తే పూర్తి తెలుగీకరణ అయ్యేదేమో… ఇది మహారాష్ట్ర కథ కదా, ఇది ఇంతే… ఎందరివో ఇలాంటి కథలు… ఇడ్లీ బళ్లు, కర్రీ పాయింట్లు, పావ్ బాజీ స్టాల్స్, పానీపూరి బళ్లు, జిలేబీ సెంటర్స్ ఎట్సెట్రా…)
Share this Article