ఏదైనా పనికొస్తుందీ అనుకుంటే ఎంచక్కా కాపీ చేసేయడం, వాడుకోవడం… ఇండస్ట్రీలో పెద్ద తలకాయలం, మా జోలికి ఎవడొస్తాడు అని ధీమాగా ఉండటం… టాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని భాషల ఇండస్ట్రీల్లో ఉన్న రోగమే ఇది… విదేశీ సినిమాలు, ట్యూన్లు, కథల్ని కాపీ కొడితే పెద్దగా లీగల్ చిక్కులు ఎదురుకావేమో గానీ, లోకల్ టాలెంట్‌ను మోసగిస్తే మాత్రం గతంలోలా చెలామణీ అయ్యే సిట్యుయేషన్ లేదు… మేధోహక్కుల విషయాల్లో కోర్టులు సీరియస్‌గానే వ్యవహరిస్తున్నాయి…
ఆమధ్య కాంతార సినిమా పాట వివాదం చదివాం కదా… ఆ సినిమా మస్తు వసూళ్లు రాబట్టింది… ఆ సినిమాలో వచ్చే వరాహరూపం పాట, క్లైమాక్స్ ఆ సినిమాకు ప్రాణం… ఆ వరాహరూపం పాట తమ ప్రైవేటు ఆల్బమ్ నుంచి కాపీ కొట్టారని ఓ కంపెనీ కేసు పెడితే, పీక్కోలేక ఇబ్బందిపడింది సినిమా టీం… కొంతకాలం ఓటీటీలో, సినిమాలో కూడా ఆ పాట తొలగించాల్సి వచ్చింది కోర్టు ఆదేశాల మేరకు… తరువాత బయట సెటిల్ చేసుకున్నట్టు సమాచారం…
తాజాగా శ్రీమంతుడు అనే మహేశ్‌బాబు సినిమాకు సంబంధించి దర్శకుడు కొరటాల శివకు వాచిపోయింది… సుప్రీంకోర్టు దాకా వెళ్లి మస్తు డబ్బు ఖర్చుపెట్టుకున్నా సరే, సుప్రీం ఏమాత్రం కనికరించలేదు… విషయం ఏమిటంటే..? ఆ సినిమా కథ తను స్వాతి పత్రికలో రాసిన కథకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు… ఆ కోర్టు రచయితల సంఘం నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని కొరటాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది…
Ads
ఆయన ఈసారి హైకోర్టుకు వెళ్లాడు… ఇక్కడ రచయిత పట్టుదలను, పోరాటాన్ని అభినందించాలి… అలాగే రచయిత పట్ల నిబద్ధతతో నిలబడిన రచయితల సంఘాన్ని కూడా అభినందించాలి… హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు తీర్పునే సమర్థించింది… అంటే దర్శకుడు క్రిమినల్ చర్యల్ని ఎదుర్కోవాల్సిందేనని చెప్పినట్టు… ఇక ఆయన ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాడు… తాజాగా సుప్రీం కూడా దర్శకుడి వాదనను, దిగువ కోర్టుల తీర్పులనే సమర్థించింది…
పిటిషన్ డిస్మిస్ చేయమంటారా, వాపస్ తీసుకుంటారా అని కొరటాల లాయర్‌ను అడిగితే వాపస్ తీసుకుంటున్నట్టు చెప్పాడాయన… వెరసి సుప్రీం దాకా వెళ్లినా సరే స్వాతిలో వచ్చిన కథనే శ్రీమంతుడు సినిమా కోసం కాపీ కొట్టినట్టుగా రుజువైనట్టు లెక్క… ఇప్పుడిక ఏం చేయాలి..? తలవంపులు… నిజానికి కోర్టు బయట పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండాల్సింది… మరి ఇప్పుడు ఆ అవకాశం ఉందో లేదో తెలియదు… సో, ఈ కేసు ఏం పాఠం చెబుతున్నట్టు..?
కాపీలు చేసినా తప్పించుకుంటామనే భ్రమలు వద్దు… ఒకవేళ వివాదాలు వస్తే వీలైనంతవరకూ ఒరిజినల్ క్రియేటర్స్ కృషిని గౌరవించాలి… ఎంతోకొంత రెమ్యునరేషన్ ఇవ్వాలి… అన్నింటికీ మించి కాపీ అనే రోగం నుంచి విముక్తి పొందాలి… బోలెడు కథలు, బోలెడు మంది రచయితలు… మరెందుకీ కాపీ దరిద్రం..? ఈ సందర్భంగా తెలుగు సినిమా రచయితల సంఘానికి, ఈ కేసులో చివరిదాకా పోరాడిన రచయిత శరత్ చంద్రకు అభినందనలు..! పాపులర్ సినిమాయే కాబట్టి మళ్లీ ఇక్కడ ఆ సినిమా కథ ఏమిటో చెప్పడం లేదు…
Share this Article