Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేడి వేడి కరకర కడక్ బెల్లం జిలేబీ వంటి తీయని కథ… బాగుంది…

March 4, 2024 by M S R

కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లం జిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.
***
ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళ వరకూ దేశానికి ఇచ్చేసి… ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక… తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు.

కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.
***
మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.

బంగారు రంగులో, బెల్లం పాకంతో… వేడి వేడిగా… కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు.
***
ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు.

Ads

సినిమా రోడ్డులో ఉండే అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పది కిలోల జిలేజీ ఇచ్చేవారు.

ఆయన గొప్పదనం…. చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు.
***
అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు.

మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు.

తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు.
***
అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ… అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.
***
చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్. చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి… అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు.
***
ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.

జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది.
***
మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి… అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు… మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.

తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటే చాలు… ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.
***
దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం… ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.

దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.
***
ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.

తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాటంకంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువు కోసం దుకాణం వదిలేస్తే… నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే… మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.

చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
***
ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది.

కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటున్నాయి.

ఏ జన్మలోని ఋణానుబంధమో… ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే… జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం మా కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు…. (copied from అరుణాచలశివ పేరిట Tukaram Sarma Bhattiprolu ,  Yeddula Anilkumar ModiKa Parivar వాల్స్ మీద కనిపించిన పోస్ట్ ఇది… నిజంగానే ఈ జిలేబీ దుకాణం ఉందో లేదో, ఇది కథో, నిజమో కూడా తెలియదు… కానీ కంటెంటు ఆ జిలేబీలాగే కరకర తియ్యగా ఉంది… అందుకే ఈ షేరింగు… రచయితకు ధన్యావాదాలతో…) (తన డాక్టరీ వృత్తిని పవిత్రంగా ఎంచి, నిస్వార్థ ధోరణితో ప్రాక్టీస్ చేసుకునే అదే కాకినాడ డాక్టర్ యనమదల మురళీకృష్ణకు ఇది అంకితం… 9440677734)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions