ఒక సకినం… దానికి ఊరగాయ, గడ్డ పెరుగు కాంబో… ఒక మొక్కజొన్న గారె… నేతిలో వేయించినది… ఒక భక్ష్యం… బెల్లం, వెన్న కాంబో… నిమ్మకాయ పులిహోర… కాస్త ఇంగువ… నువ్వుల ముద్ద, పల్లీల ముద్ద… పోనీ, పాయసం… బూరె… ఒకటి గాకపోతే ఒకటైనా సంక్రాంతి విస్తట్లో రుచిగా ఉండాలి కదా… నోట్లో కొన్ని గంటలైనా ఆ ఫ్లేవర్ తిరుగుతూ ఉండాలి కదా… పండుగ వంట అనే పేరు నిలుపుకోవాలి కదా… ఏ ఒక్కటీ బాగా లేకపోతే దాన్ని ఏమనాలి..? దాన్ని మన పోతినేని రాముడి సినిమా రెడ్ అనాలి… నిజం ఇంత అనాసక్త సినిమా తీయడం ఈమధ్యకాలంలో ఎవరి వల్లా కాలేదు… గ్రేట్… హీరోకు, దర్శకుడు తిరుమల కిషోర్‌కు హేట్సాఫ్… ఈ సినిమాను ఏడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారట… ఫాఫం, తెలుగు ప్రేక్షకులే కాదు, మిగతా ఆరు భాషల ప్రేక్షకులూ బకరాలు అయిపోయారన్నమాట… ఈ నిర్మాత ఎవరో గానీ ఈ దేశ ప్రజలు వోల్ మొత్తమ్మీద కసి ఉన్నట్టుంది… భాషలు, డబ్బులు ముఖ్యం కాదురా నాయనా… దర్శకుడు అసలు సినిమాను తీస్తున్నాడో కాస్త వెనకాముందూ చూసుకోవాలి కదా…
ఫాఫం… ఒక్క రాముడు, రెండు పాత్రలు… మాస్, క్లాస్ కాంబినేషన్ ఉన్న ఇస్మార్ట్ శంకర్ హాంగోవర్ నుంచి రాముడు ఇంకా బయటపడనట్టున్నాడు… అదే మూడ్ కంటిన్యూ చేస్తూ ఈ పిచ్చి సినిమా చేశాడు… ఇదుగో, ఇవే దెబ్బతీసేవి… తీశాయి… నిజానికి దీని ఒరిజినల్ తమిళ సినిమా థడం హిట్ టాక్ తెచ్చుకుంది… దాన్నలాగే డబ్ చేసినా ఏడు భాషల ప్రేక్షకులు బతికిపోయేవారు… రీమేక్ హక్కులు కొని, రాముడిని పెట్టుకుని… నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ, హెబ్బా పటేల్…. ఇంత భారీ క్యాస్టింగ్… మణిశర్మ సంగీతం… ఏం తక్కువ చేయలేదు… కానీ ఓ చిన్న బేసిక్ పాయింట్ మరిచిపోయాడు దర్శకుడు… కథ, కథనం ఆసక్తిగా ఉండాలి…
Ads
ఇంకా ఎన్నిరోజులు తీస్తారురా… ఒకే పోలికలున్న ఇద్దరు హీరోలు… దాని మీద కథ… నిజానికి కథ బాగాలేకపోతే కథనం బాగుండాలి… ఇందులో ఏదీ బాగాలేదు… చాలా సన్నని స్టోరీ పాయింట్… అలాంటప్పుడు కథనాన్ని పరుగులు తీయించాలి… అసలు ఇంటర్వెల్ దాకా ఏం సీన్లు వస్తున్నాయో, ఏం వెళ్లిపోతున్నాయో అర్థమే కాదు… ఇదేం సినిమార భయ్ అనుకుని ఇంటర్వెల్లోనే ఇంటికి పారిపోవాలి అనుకునేప్పుడు కాస్త పర్లేదు అనుకునే సీన్… సరే, చూద్దాంలే అనుకుని కూర్చుంటే, ఇంటర్వెల్ తరువాత నుంచి క్లైమాక్స్ దాకా… ఒక్కటంటే ఒక్క సీనూ కనెక్ట్ అయితే ఒట్టు… వాస్తవానికి ఈ సినిమా కథ గురించో, కథనం గురించో విడివిడిగా వేర్వేరు విభాగాల గురించో చెప్పుకోవడం వేస్ట్… ఎందుకంటే..? ఏదీ సరిగ్గా కుదిరి చావలేదు గనుక… చివరకు ఆ మణిశర్ముడు కూడా చేతులెత్తేశాడు… అవున్లెండి… అసలు పునాది వంటి కథాకథనాలే అలా ఉన్నప్పుడు ఎవడూ ఏమీ చేయడానికి కుదిరి చావదు… ఇది బాగుంది, ఇది బాగాలేదు అనే సవివర రివ్యూ కూడా ఈ సినిమా పోస్ట్‌మార్టంలో అక్కర్లేదు… దేహమంతా రిగర్ మార్టిసే…
వాస్తవానికి రవితేజ అదృష్టం బాగున్నట్టుంది… సినిమాలో పెద్దగా కొత్త సరుకేమీ లేకపోయినా సరే, పోటీగా వచ్చిన విజయ్ మాస్టర్ ఢమాల్… కనీసం తోకపటాకు స్థాయిలో కూడా పేలలేదు… రాముడు మంచి ఎనర్జీ ఉన్న హీరో కదా, పైగా ఇస్మార్ట్ వేడిలో ఉన్నాడు, బొచ్చెడు మంది స్టార్లు, హిట్ ఒరిజినల్ అనుకుంటే అదీ నేలకరిచినట్టే… ఈ సినిమాపై ఆశలు కూడా ఆమధ్య బెజవాడ కోవిడ్ హాస్టల్లో రోగుల దేహాలు కాలిపోయినట్టే కాలిపోయాయి… ఇక అల్లుడు అదుర్స్ సినిమా… మనకు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతిభాపాటవాల మీద చాలా చాలా నమ్మకాలున్నాయి కాబట్టి, దాన్నీ వదిలేస్తే… ఇక ఆ క్రాక్ సినిమా ఒక్కటే నాలుగు డబ్బులు సంపాదించుకునేట్టుంది… కంగ్రాట్స్ రవితేజా…!
Share this Article