Ashok Vemulapalli…….. … వందలాది మంది జనం కత్తులు, కర్రలు,రాడ్లు పట్టుకుని బయట అరుస్తున్నారు-వాడిని మాకొదిలేయండి పొడిచిపొడిచి చంపుతామంటున్నారు (మణిపురి భాషలో)..
అందులో ఆడవాళ్లున్నారు-మగవాళ్లు-పిల్లలు ఉన్నారు..నేను కూర్చున్న కుర్చీకి అటూఇటు ఇద్దరు కుర్రాళ్లు తుపాకులు పట్టుకుని నిల్చున్నారు.. అప్పటికే నన్ను,కెమేరామ్యాన్ ను చేతులు వెనక్కి విరిచి కట్టేసి కుర్చీలో కూర్చుబెట్టారు..
బయట ఉన్నజనం విపరీతమైన ఆగ్రహంతో అరుస్తూనే ఉన్నారు..అదో స్కూల్ బిల్డింగ్..వరండాకు మొత్తం గ్రిల్ ఉంది.దాని డోర్ కి తాళాలు వేసేశారు..లోపల మేము..బయట జనాలు.. జనమంతా కర్రలు, రాడ్లతో గ్రిల్ పై కొడుతున్నారు..నా పక్కనే కుర్చీలో కూర్చున్న కెమేరామ్యాన్ సంతోష్ ధీనంగా నావైపు చూస్తూ..మనల్ని చంపేస్తారా..సర్ అంటున్నాడు..మా ఇద్దరి దగ్గరా ఫోన్లు లాక్కున్న మరో కుర్రాడు ఆ ఫోన్ లో ఉన్న వీడియోలను డిలీట్ చేస్తున్నాడు..మరొక కుర్రాడు మా కెమేరా ఎలా ఓపెన్ చేయాలో అర్థంగాక ఇష్టమొచ్చినట్టు దానిపై ఉన్న బటన్లు అన్నీ నొక్కేస్తున్నాడు..వరండా గ్రిల్ లోంచి ఒక ముసలాయన పొడవాటి కర్రను నా వైపు తోసి నా పొట్టలో పొడుస్తున్నాడు.. భారీ ఆకారంతో ఉన్న మహిళ ఒకరు నన్ను చూస్తూ ఏదో తిడుతోంది మణిపురి భాషలో..
Ads
ఈ దృశ్యం అప్పటికి ఆరుగంటలకు పైగా చూస్తూనే ఉన్నాను.మధ్య మధ్యలో మంచినీళ్లు కావాలంటే బాటిల్ ఓపెన్ చేసి నా నోట్లో పోస్తున్నాడు మరో కుర్రాడు.అందులో సగం గొంతులోకి మిగిలిన సగం నా షర్ట్ పైకి పోతూనే ఉన్నాయి.. అప్పటికే శరీరంలో సత్తువ పూర్తిగా తగ్గి నీరసించిపోయాను..గొంతు ఎండిపోయింది.. మాట్లాడడం కష్టంగా ఉంది..వచ్చీరాని ఇంగ్లిష్ లో..అర్థంగాని హిందీలో వారికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.. మేం మీకు వ్యతిరేకం కాదు.అలాగని మేం మీ శతృవులం అంతకన్నా కాదు..ఇక్కడ వాస్తవ పరిస్థితి మాత్రమే కవర్ చేయడానికి వచ్చాం..మమ్మల్ని వదేలేయండి అని ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాం..
అడిగీ అడిగీ అలసిపోయాం..
ఇక అడిగే ఓపిక కూడా లేదు..మనల్ని చంపేస్తారు సర్.. అని బొంగురుపోయిన గొంతుతో ఏడుస్తూ అంటున్నాడు సంతోష్..
మీరు చేసిన పనికి మీ ఇద్దరి తలలు నరికి మెయిన్ రోడ్డుమీద బ్యానర్ కట్టి అక్కడ కర్రకు వేలాడదీస్తాం..ఇంకో మీడియా ఇటు వైపు మళ్లీ అడుగుపెట్టకుండా చేస్తాం అంటున్నాడు ఒక నల్లగా ఆఫ్రికన్ మాదిరిగా ఉన్న ఒక వ్యక్తి..
ఇదిగో ఇదే కత్తితో నీ గొంతు కోస్తా..అంటూ ఒక కత్తి తెచ్చి నా మెడమీద పెట్టాడు ఇంకో కుర్రాడు..
కాదు నేను ఈ గన్ తో ఇక్కడ కాలుస్తా అంటూ గన్ తెచ్చి దాని గొట్టాన్ని నా తల వెనుకవైపు పెట్టి..అటూ ఇటు తిప్పుతున్నాడు..ఇంకో యువకుడు..
జీవితం ఇక్కడ ఇంత దారుణంగా ముగిసిపోతుందని అనుకోలేదు సర్..అంటూ కళ్ల నిండా నీళ్లతో నా వైపు చూస్తూ బాధగా అంటున్నాడు సంతోష్..
మీడియావాళ్లని వీళ్లు చంపరు..అంటూ అప్పటివరకూ కనీసం వందసార్లు సంతోష్ లో ధైర్యం నింపడానికి చెప్పి ఉంటాను నేను..
కానీ ఆ ఒక్కసారి మాత్రం అలా అనలేదు..అవును..నువ్వన్నట్టు వీళ్లు చంపేస్తారు..కానీ ఒకే సారి చంపేస్తే బాగుండు..సాయత్రం వరకూ హింసించి హింసించి చంపితే తట్టుకోలేం అన్నాను..ఆ మాట అనగానే ఒక్కసారిగా సంతోష్ కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి..
అది మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న నున్ పోంగ్ షిక్మై…గ్రామ సరిహద్దు.. పూర్తిగా మైతీ కులస్తుల గ్రామం అది..గిరిజని మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన వీఫైయమ్ ఫొయిబీ గ్రామం …ఈ గ్రామానికి పక్కనే ఉంది. ఇప్పటి వరకూ దేశంలో ఉన్న ఏ మీడియా ఆ గ్రామం వరకూ అడుగుపెట్టలేకపోయింది..అప్పటికే రెండురోజులుగా మణిపూర్ లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దారుణాలను బిగ్ టీవీ తరఫున కవరేజ్ కు వెళ్ళిరిపోర్ట్ చేస్తున్నాను నేను.ఎక్కడికి వెళ్లినా…చిన్నచిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి గానీ ఇలాంటిది జరుగతుందని మేం ఈ పరిణామాలను ఊహించలేదు.
అందుకే జులై 26వతేదీన నేరుగా నున్ పోక్ షిక్మై గ్రామానికే వెళ్లి మహిళలను నగ్నంగా ఊరేగించిన గ్రామానికి ఎలా వెళ్లాలని ఆ గ్రామస్తులనే అడిగాము..నేను దారి చూపిస్తానంటూ ఒక వ్యక్తి ఊరి చివరకు తీసుకెళ్లి..తమ నాయకులకు అప్పగించాడు..వాళ్లు అక్కడ నాలుగు గంటలపాటు వాళ్ల దగ్గర కూర్చబెట్టుకున్నారు.. ఇదంతా ఉదయం జరిగింది.. అప్పుడు వాళ్లు బాగానే ఉన్నారు..మాకు ఫ్రూటీలుకూడా ఇచ్చారు.. తర్వాత ఇంటర్ వ్యూలు ఇచ్చారు..కుకీలు అత్యంత దారుణమైన వాళ్లని…వాళ్ల దగ్గర గన్స్ ఉన్నాయని అత్యంత దారుణంగా మైతీలను వాళ్లు చంపేశారని వీళ్ల నాయకుడు భూషణ్, స్వర్ణలత మాకు చెప్పుకొచ్చారు..మహిళలను నగ్నంగా ఊరేగించిన వ్యక్తులు తమకు చెందిన వారు కాదని అయినా సరే తమను అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ స్వర్ణలత మా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.. ఇదంతా నిజమే అనిపించింది వాళ్లు చెబుతుంటే…నాలుగు గంటల తర్వాత వాళ్లు మాకు ఇంటర్ వ్యూ ఇచ్చి ఇక్కడి నుంచి వెనక్కి ఇంఫాల్ వెళ్లిపోమన్నారు..కాదని ముందుకు అంటే వీఫైయమ్ గ్రామానికి వెళ్తే అక్కడి కుకీస్ మిమ్మల్ని కాల్చి చంపుతారని వార్నింగ్ ఇచ్చారు.కుకీస్ జనాన్ని ఎలా నరికి నరికి చంపుతారో చూడండంటూ.. మొబైల్ లో కొన్ని వీడియోలు చూపించారు.. ఈ వీడియోలు చూడగానే వెన్నులో వణుకు పుట్టింది.అందుకే వెనక్కి వెళ్లిపోమని వాళ్లు చెప్పగానే కారు ఎక్కివెనక్కు తిరిగాము.కొద్ది దూరం వెళ్లగానే . వాళ్లు చెప్పింది నిజమని మీరు నమ్ముతున్నారా..అని డ్రైవర్ అమీర్ అడిగాడు..అతను ఆ మాట అనగానే ఏదో తేడా కొట్టింది.. లేదు సర్..వాళ్లంతా చెప్పింది అబద్దం…
….కుకీలు అలాంటివాళ్లు కాదు…మీరు నమ్మొద్దు..కావాలంటే మనం వేరే రోడ్డు లోంచి వెళ్లి ఆ గ్రామాలకు వెళ్లి చూద్దాం అన్నాడు..
….అమీర్ స్థానికుడు అందులో ఈ రెండు తెగలకు చెందని ముస్లిం కులస్తుడు కాబట్టి అతను చెప్పిందే నిజం అనిపించింది..సరే వెళ్దాం పద…అన్నాను..
….అమీర్ వేరే రూట్లోంచి..వీఫైయమ్ గ్రామంవైపు పోనిచ్చాడు
…అక్కడి వెళ్లగానే భారీగా ఆయుధాలతో వందలాది కుకీలు మా కారును చుట్టముడతారని వెంటనే నేను మీడియా తరఫున కవరేజ్ వచ్చానని వాళ్లని రిక్వెస్ట్ చెప్పుకుందామని ఇలా రకరకాలుగా ఊహించుకుంటూ ఉన్నాను..
……..నుంగ్ పోంక్ షిక్మై దాటాకు రెండు కిలోమీటర్ల దూరంలో పూర్తిగా దహనమై పోయిన గ్రామం కనిపించింది..అలాగే మరో గ్రామం..ఆ తర్వాత మరో గ్రామం..ఇలా నామరూపాల్లేకుండా…కాలిబూడిదైపోయిన గ్రామాలే కనిపిస్తున్నాయి..ఎక్కడికక్కడ బుల్డోజర్లతో కూల్చేసిన భవనాలు, నేలమట్టం చేసేసిన చెట్లు, కాలిపోయిన ఇళ్లు,రాళ్ల గుట్టలు ఇవే కనిపిస్తున్నాయి..ఎక్కడా మనిషి అలికిడే లేదు..అలా రెండు గ్రామాల్లో దిగి అక్కడి దృశ్యాలను వివరిస్తూ రిపోర్ట్ చేశాను.ఈలోపు నాగ కులానికి చెందిన ఒక ముసలాయన పక్కనే పొలానికి నీళ్లు పెడుతూ కనిపించాడు.అతన్ని వివరాలు అడిగితే..అసలు ఇక్కడి నుంచి కుకీలు ఎప్పుడో పారిపోయారని.మూడునెలల క్రితమే వారందర్నీ చంపేశారని..కొంతమంది అదుగో ఆ..దూరంగా కొండల్లోకి పారిపోయారని చెప్పుకొచ్చాడు.
మరి ఆ మహిళలను నగ్నంగా ఊరేగించింది ఎక్కడ అని అమీర్ అడిగితే..ఇప్పుడు మీరు దాటి వచ్చిన ఊరే అది అన్నాడు ఆ ముసలాయన
..మాతో పాటు ఆ గ్రామానికి ముసలాయన్ని ఎక్కించుకుని వచ్చాం
…అక్కడే మట్టిగోడలతో కూలిపోయి ఉన్న ఇంటిని చూపించి ఇదే ఆ వీడియోలో ఉన్న మహిళ ఇల్లు..ఆ పక్కనే రెండో మహిళ ఇల్లు ఉందని చెప్పాడు..
…మాకు చూపించి ఆ ముసలాయన నడుచుకుంటూ వెళ్లిపోయాడు..
….నాకు అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు..ఎందుకంటే నుంగ్ పోక్ షిక్మైలో మయితీలు చెప్పినదానిలో కనీసం ఒక్కశాతం కూడా ఇక్కడ కనిపించలేదు..అసలు మేం ఊహించిన దానికి ఇక్కడ కనిపిస్తున్నదానికి అసలు సంబంధమే లేదు..మరి మయితీల దాడి తర్వాత ఈ కుకీలంతా ఏమైపోయినట్టు..ఎక్కడికి వెళ్లినట్టు. కొండగుట్టల్లోకి వెళ్లిన వాళ్లు మూడు నెలల్లో తిరిగి రాలేదా..ఇలాంటి అనేక సందేహాల మధ్య అక్కడ పరిస్థితిని వివరిస్తూ గ్రామాల దాటుకుంటూ వెళ్తున్నాను..
…..ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు సర్..మయితీలు ఇక్కడికి వచ్చేస్తారు.తొందరగా వెళ్లిపోదాం అంటున్నాడు అమీర్
..అలా కొద్దిసేపు వెళ్లగానే అక్కడ నాలుగు బైకుల్లో నలుగురు కుర్రాళ్లు మా కారును ఆపారు..
….వెనక్కు వెళ్దాం పదండీ అంటున్నారు..
….ఎందుకు వెళ్లాలని అని సీరియస్ గా అడినాను.
….ఇక్కడ మీ పని అయిపోయింది కదా..మేం మీకు సెక్యూరిటీగా వచ్చాం..లేకపోతే కుకీలు మిమ్మల్ని కాల్చి చంపుతారు అన్నాడు అందులో ఉన్న ఒక యువకుడు
…ఇది నిజం కాదని నాకు అర్థమయింది..సరే మీరు పదండి వెనుక వస్తాను అన్నాను.
….కారు ఎక్కగానే అమీర్ చెప్పాడు..సర్ వాళ్ల మాట మీరు నమ్మొద్దు..మనం వాళ్ల వెనుక నుంగ్ పోక్ షిక్మై వెళ్తే మనల్ని విడిచి పెట్టరు.మనం ముందుకు కొండరోడ్డుమీదుగా వెళ్తే వేరే రోడ్డు వస్తుందని ముసలాయన చెప్పాడు..అటుగా వెళ్లిపోదాం అన్నాడు.
…సరే పోనీ అనగానే.. అమీర్ చాలా వేగంగా కారు పోనిచ్చాడు..
…హమ్మయ్య వాళ్ల నుంచి మనం బయటపడిపోయాం సర్..అన్నాడు సంతోష్ సంతోషంగా.
…అలా అరగంట జర్నీ తర్వాత వేరే రోడ్డు వచ్చింది..
….అక్కడ కారు ఆపిన తర్వాత డ్రైవర్ అమీర్ అక్కడ కనిపించిన ముస్లింలతో మాట్లాడి వచ్చాడు
…అతను వస్తున్నపుడే అతని ముఖం అంతా చెమటలతో నిండిపోయిం ఉంది
…ఏం అమీర్ ఏమైంది అనగానే అతను..సర్ మనం దొరికిపోయాం..వాళ్లు అందరికీ వైర్ లెస్ లో సమాచారం ఇచ్చారట..మన కోసం వేరే టీమ్స్ వెతుకుతున్నాయట..దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా వాళ్లు కనిపిస్తే పట్టుకొచ్చేయమని అందరికీ సమాచారం ఇచ్చారట..మనం వెళ్లేదారిలోనే వాళ్లు మనల్ని పట్టుకుంటారు సర్..అన్నాడు అమీర్..
…అలాంటిదేమీ ఉండదు అమీర్..కావాలంటే నువ్వు వెనుక సీట్లో కూర్చో అని అతని అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవర్ సీట్ లో కూర్చుని కారు స్టార్ట్ చేశాను..
….డ్రైవర్ సీట్లో కూర్చుని నేను రిపోర్ట్ చేస్తుంటే ముందుసీట్లో కూర్చున్న సంతోష్ అదంతా రికార్డ్ చేస్తున్నాడు
….మయితీల నుంచి క్షేమంగా తప్పించుకున్నామని…డ్రైవర్ భయపడితే..అతన్ని వెనుక కూర్చుబెట్టానని నేను డ్రైవ్ చేస్తూనే రిపోర్ట్ చేస్తున్నాు..ఇంతలో సడెన్ గా రోడ్డుకు అడ్టంగా బొలెరో వాహనం వచ్చింది..మా కారుకు అడ్డంగా ఆ కారు ఆగింది..
…కారులోంచి నలుగురు యువకులు బయటకు దిగి..మా కారు దగ్గరికి వచ్చి..కారులోంచి నన్ను..కెమేరా మ్యాన్ సంతోష్ ను రెక్కలు విరిచి బయటకు లాగేశారు..
…అసలు ఎవరు..మీరు ఎందుకు లాగుతున్నారని మేం అడిగేలోపే..మాఇద్దరి చేతులు గుడ్డతో కట్టేశారు..
…… నా జేబులో ఉన్న సెల్ ఫోన్లు, పర్సులు, సంతోష్ చేతిలో ఫోన్లు, కెమేరా వాళ్లు లాక్కున్నారు..కారుతాళం తీసుకుని ఇంకో కుర్రాడు నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు..కారు వెనుక సీట్లో ఉన్న అమీర్ ను అలాగే కూర్చోనిచ్చారు..ఎందుకంటే అమీర్ ముస్లిం కాబట్టి వాళ్లు కుకీలను తప్ప వేరే కులస్థులపై దాడి చేయరు.. వాళ్ల దగ్గర వైర్ లెస్ సెట్లు ఉన్నాయి..ఆ సెట్ లో ఎవరికో గట్టిగా అరుస్తూ సమాచారం ఇస్తున్నారు..మేం అక్కడ రోడ్డు మీద ఉన్న ఐదు నిమిషాల్లోనే కనీసం రెండువందల మంది జనం అక్కడ పోగయిపోయారు.. ఆటోల్లో, కారుల్లో, ట్రాక్టర్లలో, సైకిళ్లపై, నడుచుకుంటూ ఇలా జనాలు వస్తూనే ఉన్నారు..వాళ్ల నెట్ వర్క్ అంత స్ట్రాంగ్ గా ఉంది… వచ్చిన వారెవ్వరికీ మేం ఎవరిమో..ఎందుకు మమ్మల్మి పట్టుకున్నారో..వివరాలేమీ తెలీదు..వాళ్లకి అందిన కమ్యూనికేషన్ ఒక్కటే.ఇక్కడ కుకీ జాతికి సంబంధించిన వ్యక్తులను పట్టుకున్నాం…అంతే..
అక్కడికి వచ్చిన అందరి ముఖాలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను..చాలామంది వీళ్లు కుకీలు కాదు కదా అన్నట్టుగా చూస్తున్నారు..మరికొంతమంది వీళ్లేం చేసుంటారు అని అనుమానంగా చూస్తున్నారు.. మమ్మల్ని పట్టుకున్న కుర్రాళ్లతో నేను ఆర్గ్యూ చేస్తున్నాను..మీరెవ్వరు..ఎందుకు నన్ను పట్టుకెళ్తున్నారు..పట్టపగలు ఏంటీ దౌర్జన్యం.. అంటూ నాకు వచ్చీ రానీ హిందీ, స్పష్టంగా రాని ఇంగ్లిష్ లో రకరకాలుగా నా హావభావాలు, ఆగ్రహావేశాలతో వాళ్లకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.కానీ ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు..ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసుంటే చెప్పండి. నేను మీమీద పోలీసులకు కంప్లైట్ ఇస్తాను.ఆర్మీకి ఫిర్యాదు చేస్తాను అని బెదిరిస్తున్నాను..పెద్ద గొంతుతో..
…ఇది విన్న అందులో ఉన్న ఒక పెద్ద మీసాల వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెంప మీద కొట్టాడు..నోరు మూసుకుని ఉండు అంటూ నోటి మీద వేలు పెట్టి ఎక్స్ప్రెషన్ తో చెప్పాడు
….బేసిక్ గా ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన నేను..నన్ను చెంపమీద కొట్టిన వ్యక్తిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసాను.కానీ అప్పటికే చేతులు కట్టేసి ఉండడంతో… ఏం చేయలేకపోయాను.
….చేతులు కట్టేయకుండా ఉండి ఉన్నప్పటికీ నేను ఒకవేళ అతన్ని కొట్టడానికి వెళ్తే బహుశా మిగిలిన వాళ్లంతా అక్కడే నామీద దాడి చేసి ఉండేవారు..
…ఇంతలో వాళ్ల నాయకుడు నా దగ్గరకు వచ్చి…మీరు చాలా తప్పు చేశారు.. మీరు రిస్ట్రిక్టెడ్ జోన్ లోకి వెళ్లారు..మీరు ఎవరు పర్మిషన్ తీసుకుని కుకీ గ్రామానికి వెళ్లారు…అన్నాడు
…నేను ఇండియన్ ని..నాకు దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది..నేను జర్నలిస్టుగా అన్ని ప్రాంతాలుతిరుగుతాను..ఇది రిస్ట్రిక్టెడ్ జోన్ అని ప్రభుత్వం నిర్ణయించాలి అంతేగానీ మీరెలా డిసైడ్ చేస్తారు అని అడిగా..
…ఇది అత్యంత సెన్సెటివ్ జోన్.. ఇక్కడికి మీడియావాళ్లెవరూ ఇంతవరకూ రాలేదు..పైగా మావాళ్లు మీకు ముందుగానే హెచ్చరించారు అక్కడికి వెళ్లొద్దని అన్నాడు చాలా కోపంగా
…అవును మీ వాళ్లు నన్ను అక్కడికి వెళ్లొద్దన్నారు..కానీ మీ వాళ్లుచెప్పిందంతా అబద్దం..అక్కడ ఎలాంటి కుకీలు లేరు..కేవలం మీరంతా దాడిచేసి తగులబెట్టిన గ్రామాలు మాత్రమే ఉన్నాయి అన్నాను
…అదే మేము చెబుతున్నాం..ఇక్కడ రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది..అలాంటి చోటికి మీరెలా వస్తారు
…మేం ఎందుకు రాకూడదో చెప్పండి.. మీడియాలో రెండు వర్గాల వాదన వినిపించాలి..కేవలం మైతేయుల వైపు మాత్రమే వార్తలు చూపిస్తే ఎలా..అటు కుకీల ఆవేదన కూడా మేం సమాజానికి చెప్పాలి కదా ..ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అన్నాను
…కుకీలు మా మైతీలను అనేకమందిని చంపేశారు..మా ఆడవాళ్లని రేప్ చేశారు..మా ఇళ్లను తగులబెట్టారు..కానీ మీ మీడియావాళ్లు ఇవేమీ చూపించడం లేదు..కేవలం మేం తగులబెట్టిన ఇళ్లను మాత్రమే చూపిస్తున్నారు..ఇద్దరు ఆడవాళ్లను నగ్నంగా ఊరేగించిన 24సెకండ్ల వీడియోను మాత్రం టెలికాస్ట్ చేసి ప్రపంచం ముందు మా మైతీలను దోషులుగా చూపించారు..ఇది అన్యాయం కాదా..అన్నాడు
….అవును..చూపించిన మాట నిజం..అలాగే మీరు చెప్పిన వాదన కూడా చూపిస్తున్నాం కదా..ఇలా మీరు కుకీల గ్రామాల్లోకి వెళ్లొద్దని ఎలా చెబుతారు
…ఇక్కడ మేం వారిపై యుద్దం ప్రకటించాం..వాళ్లంతా ఇక్కడి వాళ్లు కాదు.అసలు భారతీయులే కాదు..వాళ్లంతా మయన్మార్ నుంచి వచ్చినవాళ్లు.. అక్కడి మిలిటెంట్లు వీళ్లని పెంచి పోషిస్తున్నారు..మీ మీడియా అంతా వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు..
…ఇలా వాదోపవాదాలు జరుగుతుండగానే ఇంకొక ఓపెన్ టాప్ జీప్ లో వచ్చిన మరో నలుగురు యువకులు కిందికి దిగి మమ్మల్ని జీప్ పైకి ఎక్కించారు..
…జీప్ పైకి ఎక్కాక..నేను మీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడాను..మీరు ఇలా మీడియా పై దాడి చేసి ఇలా కిడ్నాప్ చేయడం..అనేది రేపు ప్రపంచం దృష్టిలో మీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..అన్నాను
…అప్పుడు అందులో ఉన్న వ్యక్తి ఒకరు వచ్చి నా కట్లు విప్పి నా ఫోన్ ఇచ్చిఫోన్ చేయమన్నాడు
…నేను ఉదయం నుంగ్ పోక్ షిక్మైలో మేం ఇంటర్ వ్యూ తీసుకున్న మైతీ నాయకుడు భూషణ్ కు కాల్ చేశాను
…..భూషణ్ మీవాళ్లు చేస్తున్నది సరి కాదు..మమ్మల్ని వదిలేయమనండి..మామీద మీవాళ్లు దాడి చేసి కిడ్నాప్ చేస్తున్నారు..మా కెమేరాలు లాక్కున్నారు…దీని కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది..అన్నాను
…మా వాళ్లకి ఫోన్ ఇవ్వమని భూషణ్ చెప్పాడు
…వెంటనే నా దగ్గర ఫోన్ తీసుకున్న ఇక్కడివ్యక్తి అతనితో కొద్దిసేపు మాట్లాడాక మమ్మల్ని యధావిధిగా ఊర్లోకి తీసుకెళ్లమని చెప్పాడు
…ఇంతకీ ఫోన్ లో భూషణ్ ఏం చెప్పాడో తెలీదు
…కానీ అప్పుడే నాకు ఫోన్ లో మెసేజ్ వచ్చింది..నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను అక్కడికి వెళ్లొద్దని .. మిమ్మల్ని షిక్మై వచ్చేయమని చెప్పాను..మీరు వినలేదు.. మీ లైఫ్ కి ప్రమాదం అని ముందే చెప్పాను కదా అంటూ మెసేజ్ ఉంది
..ఆ మెసేజ్ చూడగానే అతను వారికి ఫోన్ లో ఏం చెప్పాడో అర్థమైంది..అసలు వెనుక ఉండి కథ అంతా నడిపిస్తున్నది మమ్మల్ని కిడ్నాప్ చేయించింది అంతా భూషణే అని అప్పుడు అర్థమైంది
..ఉదయం వారి మాట కాదని కుకీ గ్రామానికి వెళ్లినందుకు వాళ్లు ప్రతీకారం తీర్చుకుంటున్నారని క్లారిటీ వచ్చేసింది
…మరోవైపు కెమేరా మ్యాన్ సంతోష్ భయపడిపోతున్నాడు.. వణికిపోతున్నాడు.. నేను అతనికి ధైర్యం చెబుతున్నాను..ఏం కాదు సంతోష్..వీళ్లు మీడియా వాళ్లని ఏమీ చేయరు..ఏదైనా ఉంటే కాసేపు మాట్లాడి వార్నింగ్ ఇచ్చి పంపేస్తారు లే అన్నాను
…కానీ ఇలా ఓపెన్ టాప్ జీప్ లో నిల్చోబెట్టి నేరస్తులను తీసుకెళ్లినట్టు తీసుకెళ్తున్నారేంటి సర్..ఇక్కడ మనల్ని కాపాడడానికి పోలీసులు రాలేరా అన్నాడు
..అంతే…ఇక్కడ వీళ్లు ఇంతే ఇలాగే ఉంటారు.మనకేమీ కాదు..నువ్వు ధైర్యంగా ఉండు..ఇంతకీ మనం ఆ కుకీల గ్రామంలో బాధితు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఊరిలో రికార్డ్ చేసిన చిప్ కెమేరాలోనే ఉందా .అని అడిగాను..
…లేదు సర్..వీళ్లు మన కారుని అడ్డుకోగానే…చిప్ తీసేసి..కారు సీట్ అడుగున మ్యాట్ కింద దాచేశాను…వాళ్లు కారు మొత్తం వెదికినా చిప్ దొరకదు లే..అన్నాడు
….ఓకే.,..కనీసం చిప్ లో ఫీడ్ కి ఢోకా లేదులే అనుకున్నాను..
….ఈలోపే నా చేతిలో మరోసారి ఫోన్ తీసుకున్న యువకుడు.. మళ్లీ నా చేతులు కట్టేశాక జీప్ స్టార్ట్ చేశారు..
…మెయిన్ రోడ్డు మీద నుంచి చిన్న మట్టిరోడ్డులోకి తీసుకెళ్లారు..అలా మూడు కిలోమీటర్ల మేర ఆ రోడ్డులో వెళ్తూనే ఉన్నాం
…మా జీప్ మీద మమ్మల్ని చేతులు కట్టేసి నిల్చోబెట్టి తీసుకెళ్తుంటే మా వెనుక -ముందూ అనేక వాహనాల్లో జనాలు అరుస్తూ వెళ్తున్నారు
….అలాగే మాజీప్ వెంట కొంతమంది పిల్లలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు
….అలా వెళ్తున్న కొద్దీ ఆమట్టిరోడ్డంతా దుమ్మురేగుతూ పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది
…..మధ్యమధ్యలో ఉన్న గ్రామాల్లోంచిజనాలు ఇంకా వస్తూనే ఉన్నారు
…అలా వెళ్లాక… ఒక ఊరి మధ్యలో ఉన్న స్కూల్ భవనం దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్లారు..ఆ స్కూల్ ముందు చాలా ప్లేస్ ఖాళీగా ఉంది..అప్పటికే అక్కడ కొంతమంది జనం ఉన్నారు
…అక్కడికి వెళ్లగానే మా ఇద్దర్నీ జీప్ మీది నుంచి దింపేసి స్కూల్ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తున్నారు..నేను లోపలికి రాను..ఏదైనా ఉంటే మీరు ఇక్కడే మాట్లాడండి.అంతేగానీ మేం ఏదో నేరస్తులం అన్నట్టుగా మమ్మల్ని లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నారు.అని ప్రశ్నించాను..
…నిన్ను ఇక్కడే ఉంచితే మా వాళ్లంతా నిన్ను కొట్టి కొట్టిచంపేస్తారు..మరి అలాగే చస్తారా..లేక లోపలికి వస్తారా అంటూ లోపలికి మా ఇద్దర్నీ లాక్కెళ్లాడు..ఆ స్కూల్ బిల్డింగ్ కు బయట వరండా ఉంది..దానికి గ్రిల్ ఉంది…
..మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లి..లోపల హాల్లో వదిలేసి తలుపులేసేశారు.. లోపల అంతా చీకటిగా ఉంది..బయటి నుంచి అరుపులు వినిపిస్తున్నాయి..అలా గంటకుపైగా లోపలే చీకటి గదిలో ఉన్నాం..
…మనల్ని ఏం చేస్తారు సర్..వీళ్లు..ఏదైనా ఉంటే మనతో మాట్లాడాలి.అంతేగానీ ఇలా బంధించడం ఏంటి… చీకటి గదిలో పడేయం ఏంటి..అన్నాడు సంతోష్..అలా చీకటి గదిలో కూర్చున్న గంటసేపటి తర్వాత గది తలుపులు తెర్చుకున్నాయి…
…అప్పటి వరకూ చీకటి గదిలో ఉన్నమమ్మల్ని బయట వరండాలోకి తీసుకొచ్చారు..బయట చూస్తే జనాలతో అంతా నిండిపోయి ఉంది.మేం లోపలికి వెళ్లకముందు కంటే ఇప్పుడు జనాలు భారీగా పెరిగిపోయారు.. బయట వరండాలో రెండు కుర్చీలు వేసి మా ఇద్దర్నీ కూర్చోబెట్టారు..వరండాకున్న గ్రిల్ బయట మొత్తం మైతీ జనాలు నిల్చుని చూస్తున్నారు..కొంతమంది చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నాయి
…బయటకు వచ్చాక నేను అడిగి ప్రశ్న-మా డ్రైవర్ అమీర్ ఎక్కడ అని..
…అమీర్ సేఫ్ గా ఉన్నాడు…అతన్ని మేం ఏమీ చేయం…మీరేమీ కంగారు పడక్కర్లేదు అన్నాడు ఒకతను
..ఈలోపు అమీర్ ను కూడా మేం ఉన్న వరండాలోకి తెచ్చారు
…అమీర్ వాళ్లని బతిమాలుతున్నాడు..అది అతని కోసం కాదు..మాకోసం.. సర్ ని కొట్టొద్దు..వదిలిపెట్టేయండి..వాళ్లాచాలా రాష్ట్రాలు దాటి మీ న్యూస్ కవర్ చేయడం కోసం వచ్చారు..దయచేసి వాళ్లని వదిలేయండి..కావాలంటే నన్ను కొట్టండి అంటున్నాడు..
….అంతటి దారుణపరిస్థితుల్లోనూ డ్రైవర్ అమీర్ నిజాయతీ…మాట్ల విశ్వాసం నచ్చాయి
…మాకోసం అతను వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలుతుంటే ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా..అనిపించింది
…వాళ్లు అతనికి సర్దిచెబుతున్నారు…ఇందులో దయచేసి నువ్వుజోక్యం చేసుకోవద్దు..వీళ్లు చేసింది చాలా ఘోరమైన తప్పు..వాళ్ల తరఫున మాట్లాడొద్దు..లోకం ముందు మనల్ని నేరస్తులుగా నిల్చోబెట్టింది ఈ మీడియా వాళ్లే.ఇలాంటి వాళ్లని వదలొద్దు అంటున్నాడు..(వాళ్లు మణిపురి భాషలో మాట్లాడుకుంటున్నారు..కానీ వారి హావభావాలు అర్థమవుతున్నాయి)
…..కాసేపటికి మా పర్సులో ఉన్న ఐడీకార్డులు,ఆధార్ కార్డులు తీసుకున్నారు..తుపాకి ధరించి బ్లుూడ్రస్ లోఉన్న యువకుడు వాటిని ఫొటోలు తీసుకుని డీటైల్స్ అన్నీ పేపర్ పై రాసుకుంటున్నాడు
…..కాసేపటికి మరో ఇద్దరు పెద్దవాళ్లు వచ్చి మా ముందు కూర్చున్నారు
..మీరు కుకీ గ్రామాల్లోకి వెళ్లి ఏం షూట్ చేశారో చెప్పండి అన్నాడు
…నేను ఏం షూట్ చేయలేదు..అసలు అక్కడ ఏం ఉందని షూట్ చేస్తాం..మీరు అందర్నీ చంపేశారు కదా.. అక్కడ బూడిద మాత్రమే ఉంది అని అరుస్తున్నాడు సంతోష్..
…సంతోష్ మాట ఇంకా పూర్తిగాకముందే అతని జుట్టు పట్టుకుని చెంపమీద కొట్టాడు ఒక లుంగీ కట్టుకున్న ఒకతను
….అతను మళ్లీ నన్ను అదే ప్రశ్న మళ్లీ అడిగాడు
…నేను నిజానికి..అక్కడ గ్రామాల్లో పరిస్తితి మొత్తం రిపోర్ట్ చేద్దామని వెళ్లాను..మీవాళ్లు చెప్పినట్టు అక్కడ వందలమంది కుకీలు ఉంటారనుకున్నాను..వాళ్లందరి ఇంటర్ వ్యూలు తీసుకోవాలని అనుకున్నాను..కానీ ఎంత దూరం వెళ్లినా సరే.. కుకీలు మాకు కనిపించలేదు..అందుకే ఏమీ షూట్ చేయలేదు.
..మరి మీరు మావాళ్లని అక్కడ ఆడవాళ్లని నగ్నంగా ఊరేగించిన ఊరేదో చెప్పమని అడిగారట కదా..
..అవును అడిగాం కానీ..కానీ అక్కడికి వెళ్లాక ఆడవాళ్లని నగ్నంగా ఊరేగించిన ఊరు ఏదో మాకు అర్థం కాలేదు..ఎక్కడ చూసినా కాలిపోయిన ఇళ్లు..కూలిపోయిన ఇళ్లు ఇవే కనిపించాయి..ఒక్కరంటే ఒక్కరు కూడా మనిషి కనిపించలేదు
…ఇంతలో మందు కొట్టిన మరో ముసలాయన అక్కడికి వచ్చి కోపంగా నా కాలుపై తన్నాడు
..అతన్ని ఆపిన మరో యువకుడు ..పక్కకు లాక్కెళ్లాడు
…ఈలోపు లోపల ఏదో జరుగుతోందని అర్థంచేసుకున్న బయట ఉన్న జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు..వాడిని చంపేయండి …చంపేయండి అంటూ..అరుస్తున్నారు..గ్రిల్ పై ఆయుధాలతో పొడుస్తున్నారు..చిన్నచిన్న రాళ్లను గ్రిల్ లోపలికి విసురుతున్నారు
…మీరు ఏమీ మాట్లాడొద్దు సర్,..వాళ్లతో ఏమీ ఆర్గ్యూ చేయొద్దు..ఏమీ వీడియోలు తీయలేదని చెప్పేయండి…అలాగే వాళ్లు ఏం చెప్పినా వినండి అంటున్నాడు డ్రైవర్ అమీర్
….నిజంగానే ఏమీ తీయలేదు కదా..ఇక్కడ అబద్దం చెప్పేది ఏముంది అంటూ సీరియస్ అయ్యాడు సంతోష్
..మరో వ్యక్తి సంతోష్ పైకి తీసుకెళ్లి అతని ముఖంపై గుద్దాడు..తర్వాత కెమేరా ఓపెన్ చేసి చూపించమన్నాడు
….సంతోష్ ఏడుస్తూనే కెమేరా ఓపెన్ చేసి.. వీడియోలు అన్నీ చూపించాడు..అందులో ఉదయం నుంగ్ పోక్ షిక్మై గ్రామంలో భూషణ్, స్వర్ణలత ఇంటర్ వ్యూలు,,అక్కడ మహిళల నిరస ప్రదర్శనలు,దానికన్నా ముందు హైవేపై బాబూబజార్ వద్ద మైతీ మహిళలు చందాలు వసూళ్లుచేస్తున్న విజువల్స్ ఇవి మాత్రమే ఉన్నాయి
…అలాగే కెమేరాలో విజువల్స్ అన్నీ చూపిస్తోంటే అంతకుముందు రోజు చుర్ చందాపూర్ లో కుకీ మహిళల ఆందోళన కుసంబంధించిన విజువల్స్ కనిపించాయి
..అవి చూడగానే వాళ్లు మరింత సీరియస్ అయ్యారు
..మీరు చుర్ చందాపూర్ వెళ్లారా అని అడిగారు
..అవును నిన్న వెళ్లాం.అక్కడ అంతా కవర్ చేశాం అన్నాను
…అక్కడి ఐదువేలమందికి పైగాకుకీ మహిళలు నల్ల డ్రస్సుల్లో ఆందోళనచేస్తున్న దృశ్యాలు, రోడ్డుపక్కన వందలాది శవపేటికలు పెట్టి నిరసన చేస్తున్న దృశ్యాలు కనిపించాయి..వాటిపక్కన నిలబడి నేను రిపోర్ట్ చేస్తున్నది అంతా చూశారు వాళ్లంతా..
…దాంతో మరోసారి అటు సంతోష్ ,ఇటు నాపై చెంపై కొట్టిన వాళ్లంతా..మీరు కుకీలతో కుమ్మక్కై ఇవాళ పథకం ప్రకారం ఇక్కడికి వచ్చి మమ్మల్ని మోసం చేశారు అంటున్నాడు వాళ్ల నాయకుడు
….మీరంతా వాళ్ల మహిళల్ని ఊరేగించిన విజువల్స్,వాళ్లు శవపేటికలతో ధర్నాలు చేస్తున్నవే సమాజం ముందు చూపిస్తున్నారు కానీ మైతీల కష్టాల గురించి చూపించడం లేదు..మిమ్మల్ని ఎందుకు క్షమించాలి అని అరుస్తున్నాడు
…మేం కిడ్నాప్ చేయడం మొదట తప్పేమో అనుకున్నాం కానీ కాదు…మేం చేస్తున్నది రైటే.. మీలాంటి వాళ్లని చంపి..తలను కర్రకు గుచ్చి ఇంఫాల్ లో మెయిన్ రోడ్డు మీద పెడతాం..ఇంకో మీడియా వాళ్లు ఇక్కడికి రావాలంటే భయపడాలి…అంటున్నాడు
…సరిగ్గా అప్పుడే ఒక యువకుడు కత్తితెచ్చి నా మెడ మీద పెట్టి నేను కోస్తా ఆంటున్నాడు
..కాదు నేను కాల్చి చంపుతా అంటూ మరో యువకుడు గన్ తెచ్చి నా తల మీద పెట్టాడు
…కాదు కాదు..వాడిని బయటకు వదిలితే మేం కొట్టి కొట్టి చంపుతా అంటూ బయట నుంచి మహిళ అరుస్తోంది
…దీంతో ఒక్కసారిగా అక్కడ అలజడి మొదలైంది..బయట నినాదాలు పెరిగిపోయాయి
…సరిగ్గా అప్పుడే సంతోష్ ఇక మనం బతకడం కష్టమే సర్ ..వాళ్లు చంపేస్తారు అంటున్నాడు సంతోష్
…సరే..చంపాలనుకుంటే చంపేయండి..కానీ తర్వాత మీమీద ప్రపంచం ఎక్కడా జాలి చూపించదు..కేంద్రప్రభుత్వం కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు..నన్ను చంపితే మీకు సొల్యూషన్ దొరుకుతుందనుకుంటే వెంటనే చంపేయండి..కానీ మాకెమేర్ మ్యాన్, డ్రైవర్ ను వదిలేయండి..వాళ్లకేం సంబంధం లేదు..వాళ్లది ఏమీ తప్పులేదు అన్నాను
…అప్పటికే సాయంత్రం అయిపోయింది..అంటే..మమ్మల్ని తెచ్చి ఐదారు గంటలకు పైగానే అవుతోందన్నమాట.అనుకున్నాను
….ఇంతలో బయటి నుంచి ఒక కుర్రాడు వచ్చాడు…సర్ నేను హైదరాబాద్ లో చాలాకాలం పనిచేశాను..నాకు కొంత తెలుగు అర్థమవుతుంది..మా వాళ్లు మిమ్మల్నిచంపరు..మీపై ఎలాంటి దాడి చేయకుండా నేను చూసుకుంటాను.. కానీ మీరో సాయం చేసిపెట్టాలి..అసలు వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేయం చాలు అన్నాడు
…ఇప్పుడు మేం అదే చేస్తున్నాం..అటు కుకీల వార్తలు-ఇటు మీవార్తలు రెండూ కవర్ చేస్తున్నాం..అన్నాను
…కానీ నేషనల్ మీడియాఅంతా మా అగైనస్ట్ గా ఉంది..మమ్మల్ని రేపిస్టులుగా, హంతకులుగా ప్రొజెక్ట్ చేస్తోంది..ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ వీడియో బయటకు వచ్చాక మమ్మల్ని ధోషులుగా చూస్తోంది అన్నాడు
…ఇలాంటి నగ్న ఊరేగింపులు కుకీలు అనేకం చేశారు..హత్య లుచేశారు..కానీ ఇవేమీ బయటకు రావడం లేదు. మేం అసలు వాస్తవాలు బయటకు తెస్తామని ప్రభుత్వం ఇంటర్నెట్ మొత్తం నిలిపివేసింది.. అందరూ మాకు అగైనస్ట్ గా ఉన్నారు..ఆఖరికి మీడియా కూడా అదే చేస్తోంది అంటున్నాడు..
…ఇలా మాట్లాడుతున్న సమయంలోనే…బయట పోలీసులు జీప్ ఆగింది.అందులోంచి కమాండర్ అరుణ్ కుమార్ ..గన్ లతో ఉన్నఆరుగురు పోలీసులతో గేట్ తీయించి లోపలికి వచ్చారు
…రావడమే..మా చేతి కట్లు విప్పి మీరెవరు అని అడిగారు
…మా డ్రైవర్ మాగురించి పూర్తిగా చెప్పాడు
..ఇలా మీడియా వాళ్లను కిడ్నాప్ చేసి ఇలా ఇబ్బంది పెడితే మీరు చాలా ప్రాబ్లెమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది వెంటనే వదలండి అనివార్నింగ్ ఇచ్చారు
..అప్పుడే మరో నలుగురు నాయకులు అక్కడికి వచ్చి మరో అరగంటకు పైగా అరుణ్ కుమార్ తో చర్చలు జరిపారు
…మీరు ఇప్పుడు వీరిని విడుదల చేయకపోతే కాసేపట్లో ఇండియన్ ఆర్మీ వస్తుంది..ఈ ప్రాంతం మొత్తాన్ని వాళ్ల హ్యాండోవర్ లోకి తీసుకుంటుంది.,..అలాగే ఇకపై ఈ గ్రామాల్లో మొత్తం సైనికులే ఉంటారు.అలాగే ఈ కిడ్నాప్ లో పాల్గొన్న మీ అందర్నీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.అలాగే మీరు మీడియావాళ్లను కిడ్నాప్ చేసి హింసించారని మరోసారి నేషనల్ మీడియా అంతా మీపై వార్తలు ప్రసారం చేస్తుంది మీకు ఇష్టమేనా అని అడిగారు
…దాంతో వాళ్లంతా మెత్తబడ్డారు..చివరికి మాతో అప్పటివరకూ మాట్లాడిన తెలుగుతెలిసిన కుర్రాడు వచ్చి..మీరు మావాళ్లని క్షమించండి..మా వాళ్లు తొందరపడ్డారు.. మిమ్మల్ని ఇప్పుడు రిలీజ్ చేసేస్తాం..కానీ వెళ్లే ముందు మీరు వీడియో స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నాడు
…ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నాను
..మేం మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదని.చాలాఫ్రెండ్లీగా మాట్లాడామని…మీరు ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చి ఐడీ కార్డులు చూసి పంపేశామని చెప్పాలి అన్నాడు..
…కానీ అది వాస్తవం కాదు కదా..మీరు ఉదయ నుంచి మా ఇద్దర్నీ చిత్రహింసలు పెడుతున్నారు..అది కాదని నేను అబద్దం ఎలా చెబుతాను అన్నాను
…ఇంతలో పోలీస్ అధికారు అరుణ్ వచ్చి కాసేపు మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయొద్దు..అందరూ ఉన్మాదంతో ఉన్నారు..ఇక్కడి నుంచి బయటపడితే వాళ్ల సంగతి చూడొచ్చు..ప్రస్తుతానికి వాళ్లు ఏది అడిగితే అది చేయండి..త్వరగా వెళ్లిపోదా అన్నారు
….సరేనని వాళ్లు చెప్పినట్టు చెబితే అదిరికార్డ్ చేసుకున్నారు..
..తర్వాత ముందుగా డ్రైవర్ అమీర్ ను బయటకు పంపి కారు తీసుకుని ఎక్కడా ఆగకుండా వెళ్లిపోమన్నారు
..ఆ తర్వాత నన్ను ,సంతోష్ ను అరుణ్ చెరో పక్క పట్టుకుని జిప్సీవైపు తీసుకెళ్తుంటే జనాలంతా అడ్డుకున్నారు
…అరుణ్ గారితో వచ్చిన మిగిలిన సిబ్బంది ఆ జనాన్ని పక్కకు తోసేసి మా ఇద్దర్నీ జీప్ లోకి ఎక్కించి అక్కడి నుంచి జీప్ ను చాలా వేగంగా ముందుకు పోనిచ్చారు
…మా జీప్ వెళ్తోంటే వందలాది జనం దానివెంట చాలా దూరం పరిగెడుతూనే వచ్చారు..అలా మెయిన్ రోడ్డుమీదికి ఆ తర్వాత ఇంఫాల్ రోడ్డులోకి పోనించి..అరగంట ప్రయాణం తర్వాత జీప్ ను పక్కన ఆపి..మీకారులో సేఫ్ గా వెళ్లిపోండి అన్నారు అరుణ్..
…ఆ తర్వాత అరుణ్ గారితో సెల్ఫీ దిగి..మాకు మీరు మరో జీవితాన్ని ఇచ్చారు అని ధన్యావాదాలు చెప్పి అక్కడి నుంచి కారులో బయలుదేరాము..ఇక్కడితో కిడ్నాప్ అంకం ముగిసింది…. (వేములపల్లి అశోక్ బిగ్‌టీవీలో సీనియర్ జర్నలిస్ట్)…
Share this Article