.
ఎందుకు మన సైంటిస్టులు, డాక్టర్లు, టెక్నోక్రాట్లు విదేశాలకు వెళ్లిపోతారు…? దేశంలోనే ఉండి, ఈ దేశానికే మేలు చేయవచ్చు కదా… ఇదీ చాలామంది ప్రశ్న… కానీ పని చేయనిస్తే కదా… రాజకీయాలు, కుళ్లు, అన్‌ప్రొఫెషనల్ పోకడలు, కుట్రలు, తొక్కేయడాలు… అదనంగా కుల, మత పంచాయితీలు…
ఓ సైంటిస్టు కథ చెప్పుకుందాం… మీలో చాలామంది చదివే ఉండొచ్చు, కానీ చదవని వారి కోసం, చదివిన వాళ్లకు మరోసారి గుర్తుచేయడం కోసం…
Ads
ఆయన పేరు డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ… పేరు వినగానే అర్థమైంది కదా… అవును, కాస్త బెంగాలీ రూప లక్షణాలే… ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రం, హజారీబాగ్‌లో పుట్టాడు… మెరిటోరియస్ స్టూడెంట్… కలకత్తా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివేటప్పుడే అద్భుతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.., ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో మొదటి స్థానంలో నిలిచి హిమాంగిని స్కాలర్‌షిప్‌ను అందుకున్నాడు…
అనంతరం, ఆయన రిప్రొడక్టివ్ ఫిజియాలజీలో కలకత్తా యూనివర్సిటీ నుండి మొదటి PhD పట్టా అందుకున్నాడు… తరువాత, ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు వెళ్లి, అక్కడ రిప్రొడక్టివ్ ఎండోక్రినాలజీలో రెండవ PhDని సంపాదించాడు… ఆయన నిస్సందేహంగా, అసాధారణమైన మేధస్సు, పరిశోధనా పట్టుదల ఉన్న వ్యక్తి…
విప్లవాత్మక ఆవిష్కరణ (The Groundbreaking Discovery)
1970ల చివరలో, వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలకు పరిష్కారం చూపాలని డా. ముఖోపాధ్యాయ లక్ష్యంగా పెట్టుకున్నాడు… అత్యంత పరిమితమైన వనరులు, ఓ మామూలు మైక్రోస్కోప్, ఓ సాదాసీదా ఫ్రిజ్… తన బృందంతో (S.K. భట్టాచార్య, సునీత్ ముఖర్జీ) కలిసి ఆయన కలకత్తాలోని తన నివాసంలోని ల్యాబ్‌లో ప్రయోగాలను ప్రారంభించాడు…
ఆయన కృషి ఫలించింది.., 1978 అక్టోబరు 3న భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ‘దుర్గా’ (కనుప్రియ అగర్వాల్) కలకత్తాలో జన్మించింది…
-
ప్రపంచ రికార్డు…: బ్రిటన్ పరిశోధకులు లూయిస్ బ్రౌన్‌ను సృష్టించిన కేవలం 67 రోజుల తర్వాత ఈ ఘనత సాధించిన ముఖోపాధ్యాయ, ప్రపంచంలో రెండవ IVF విజయాన్ని నమోదు చేశాడు…

వ్యవస్థ తిరస్కరణ, అవమానం (The System’s Humiliation)
ప్రపంచం తనని అభినందిస్తుందని ఆశించిన ముఖోపాధ్యాయకు, స్వదేశంలోనే పూర్తిగా భిన్నమైన అనుభవం ఎదురైంది…
-
విచారణ కమిటీ..: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన పనిని నమ్మడానికి బదులుగా, ఆయన పరిశోధనను “బూటకం” అని కొట్టిపారేసింది… పరిశోధన పత్రాలు సమర్పించకపోయినా సరే, ఆయన “ఎక్స్‌పర్ట్ కమిటీ” చేత విచారించబడ్డాడు…
-
అపహాస్యం…: ఆ కమిటీ సభ్యులు ఆయనను “పిచ్చివాడు” అని, “శాస్త్రవేత్త కాదు” అని అవమానించారు…. ఆయన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లకు హాజరవడానికి అనుమతి నిరాకరించబడింది.., దీనివల్ల ఆయన తన పరిశోధనను ప్రపంచవ్యాప్తంగా నిరూపించుకునే అవకాశం కోల్పోయాడు…
-
శిక్షాత్మక బదిలీలు…: ఆయనను పరిశోధనా రంగానికి సంబంధం లేని విభాగాలకు (ఒక ఆప్తమాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొఫెసర్‌గా) బదిలీ చేశారు… ఇలాంటివే బదిలీలు… ఇవి ఆయన పరిశోధనా సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి…
-
ఆరోగ్యం క్షీణత..: ఈ మానసిక వేదన, ఒత్తిడి కారణంగా ఆయన గుండెపోటుకు గురయ్యాడు… పరిశోధనా పత్రాలు రాయడానికి సెలవు అడిగినా, అధికారులు నిరాకరించారు…
విషాదాంతం (The Tragic End)
ప్రభుత్వం, తోటి వైద్యులు, మొత్తం వ్యవస్థ చూపిన అపనమ్మకం, తిరస్కరణ, అవమానాలతో ముఖోపాధ్యాయ పూర్తిగా కుంగిపోయాడు… తన ఆవిష్కరణను సమాజం స్వీకరించకపోవడం, నిరూపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చంపేసింది…
1981 జూన్ 19న, డా. సుభాష్ ముఖోపాధ్యాయ కేవలం 50 సంవత్సరాల వయస్సులో కలకత్తాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు… ఆయన తన చివరి నోట్‌లో (కొన్ని ఆధారాల ప్రకారం) “నేను ఇంకెంతకాలం ఈ కష్టమైన జీవితంలో గుండెపోటు కోసం ఎదురుచూడాలి?” అని రాసుకున్నట్లు చెబుతారు…
ఆలస్యమైన గుర్తింపు (The Late Recognition)
ఆయన మరణం తర్వాత దశాబ్దానికి, డా. టి.సి. ఆనంద్ కుమార్ అనే మరో పరిశోధకుడు ముఖోపాధ్యాయ చేతిరాత పత్రాలను పరిశీలించాడు… ఈ పత్రాలు, దుర్గా తల్లిదండ్రుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా, ఆయన ముఖోపాధ్యాయ గారి పని పూర్తిగా నిజమైనది, శాస్త్రీయంగా సరైనది అని నిర్ధారించాడు…
2002లో.., ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చివరకు డా. సుభాష్ ముఖోపాధ్యాయను భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్తగా అధికారికంగా గుర్తించింది… ఆయన మరణించిన 21 సంవత్సరాల తర్వాత…
ఈయన కథ ఒక మేధావి విజయాన్ని గుర్తించని ఒక నిరంకుశ వ్యవస్థ పోడకల్ని, దేశం ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను కోల్పోయిన విషాదాన్ని మనకు గుర్తుచేస్తుంది… ఇదే కథ “ఏక్ డాక్టర్ కీ మౌత్” సినిమాకు ప్రేరణగా నిలిచింది…
Share this Article