ఇది Mohammed Khadeerbabu… విరచితం… ఎంత బాగుందో… మనమూ ఓసారి పలకరించి, పరవశించిపోదాం… అతని పాటలు పది
అందరూ రాసి అక్షరాల్లోనే వెళ్లబోసుకోవాలనుకోరు. అసలు నోరు తెరిచి చెప్పాలని కూడా అనుకోరు. ఇష్టాన్ని చెప్పడం ఏంటి? సమక్షంలో కాసేపు చుబుకానికి పిడికిలి ఆన్చి కూచోవడం… నడుస్తూ ఉండగా ఊరికే చేతిని ఒక లిప్త పట్టుకు వదిలేయడం… రేపటి సాయంత్రం కోసం ఇవ్వాళ్టి రాత్రి చంద్రుణ్ణి త్వరగా తెమలమని పేచీ పడటం… ఎక్కడ ఉన్నా ఆ మెత్తటి పాదాల చప్పుడును పోల్చుకోవడం… ఇది కదా ఇష్టం అంటే. మళ్లీ చెప్పాలా దానిని. రాసి చూపాలా. పోస్టు కూడా చేయాలా. కుదర్దు. ఇతని పాట వినిపించడం వరకైతే సరే. ఆ గొంతు కోసమైనా అందుకు ములాజా పోవచ్చు.
రాశాను ప్రేమలేఖలెన్నో… దాచాను ఆశలన్ని నీలో
Ads
భువిలోన మల్లియలాయే… దివిలోన తారకలాయే నీ నవ్వులే…
తెలుసు జీవుడి బాధ. మరి కాసేపుంటే తబ్బిబ్బు అవుతాడనీ తెలుసు. మరో కాసేపుంటే ఆ ఘడియలను పొదివి అన్నపానీయాలను జయిస్తాడనీ తెలుసు. ఏం చెప్పి కూచోబెడతాడు? వెళ్లాలి… వెళ్లాలి అనడమే కదా అమ్మాయి ధర్మం. అరె అబ్బాయ్… నీకు చేతగాకపోతే ఆ పాట ప్లే చేయరాదూ… వందమార్లు వినే వరకు అలానే ఉండిపోతాను.
తనివి తీరలేదే… నా మనసు నిండ లేదే
ఏనాటి బంధమీ అనురాగం.. చెలియా.. ఓ చెలియా…
కట్టి పడేయడానికి సంకెలలు లేనప్పుడు బదులుగా పొగడ్తలను వాడాలి. తియ్యటి పెరుక్కూడా చిటికెడు ఉప్పును కనికరిస్తుంది నువ్వు గుప్పెడు క్షణాలను కటాక్షించలేవా అని అనగలగాలి. నువు కూచుని లేచిన తావు నీ తాకిడితో వెచ్చబడింది… అది చల్లారే వరకూ ఉండటం మర్యాద అని కట్టడి చేయగలగాలి. ఇన్నేల? స్లీపింగ్ మోడల్ టేప్ రికార్డర్‌లో టి.డి.కె కేసెట్ పెట్టి ఈ పాటతో గదిలో అడ్డుగీత గీయగలగాలి.
తనువా… హరిచందనమే… పలుకా… అది మకరందమే…
కుసుమాలు తాకగనే… నలిగేను కాదా ఈ మేను…
ఉదయాలు ఆమెకు పనులు జాస్తి. సాయంత్రాలు బయటకు వద్దామంటే ఇంట్లో ఆంక్షలు జాస్తి. వర్షాకాలం… వద్దనే వద్దు. చలికాలం అతి మొద్దంటే మొద్దు. వేసవి వచ్చింది. దేవుడా.. ఆమె డాబా ఎక్కింది. లైటు వెలిగించి ఏం పుస్తకం చదువుతున్నదో మనకేం తెలుసు? ఇటు వైపు గుండెకు రక్తసరఫరా అయితే చేస్తున్నది. ఆ ఇంట కొబ్బరిచెట్లు ఉన్నందుకు వందనం. అవి గాలికి తలలూపుతున్నందుకు వందనం. ఇతను… దుర్మార్గుడు… పాటందుకున్నందుకు వందనాతి వందనం.
ఈ రేయి తీయనది… ఈ చిరుగాలి మనసైనది..
ఈ హాయి మాయనిది… ఇంతకు మించి ఏమున్నది…
ఎందుకిస్తారో సెలవలు ఇస్తారు. ఎవరిదో పెళ్లికి ఒక వారం హాంఫట్. టైఫాయిడ్ అని ఒక జ్వరం అట. అది వస్తే 21 రోజులు ఇంతే సంగతులట. ఫ్రెండ్స్ టూరంటే తప్పక అటూ ఇటూ వెళ్లి రావడం. ఈ ఎడబాటు కూడా మంచిదే. కుశలం అడిగే కూనిరాగం పెదాలపై తడి దేరడమూ మంచిదే.
కుశలమా… నీకు కుశలమేనా…
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను…
అంతే.. అంతే… అంతే…
చూడండి… చెట్లంన్నింటికీ ఆకుపచ్చదనం వస్తుంది. అంబరాన్ని చూస్తే ఈ కొస నుంచి ఆ కొస దాకా నీలమే నీలమై ఉంటుంది. ఒక మనిషికి గుప్పెడు మనసు తప్పక ఉంటుంది. ఒక హృదయానికి ఒక స్పందన ఖరారుగా కలుగుతుంది. మరి అందరికీ ఎందుకబ్బా పాట రాదు. ఎందుకు ఇతనికే వచ్చింది. ఎందుకు ఇతనికై మనల్ని ఇచ్చింది?
ఆ పొన్న నీడలో… ఈ కన్నెవాడలో
ఉన్నా… వేచి ఉన్నా… కదలి రావేలనే నా అన్నులమిన్నా…
బొత్తిగా నేలక్లాసబ్బా. ఊటీ చూళ్లేదు. బ్యాక్ వాటర్స్‌లో బోట్ నడపలేదు. కాండం నునుపుగా ఉండే ఆ పొడవైన వృక్షాల మీద ఇద్దరి పేర్లూ చెక్కలేదు. ఉషోదయాన ఎర్రటి శాలువా కప్పుకుంటూ మంచుపూలై రాలే తన నవ్వునూ చూళ్లేదు. అయితే ఏంటట? తెలుగునేలన ప్రతి నిరుపేద భావకునికి ఒక భాగ్యం ఉంది. వేయి తలపులకు ఒక పల్లవి. లక్ష ఊహలకు ఒక చరణం.
ఏమని నే చెలి పాడుదును… తికమకలో ఈ మకతికలో..
తోటలలో పొదమాటులలో తెరచాటులలో…
రోజులు సజావుగా ఉండవు ఒకోసారి. ప్రేమకై సమయాలు కొడిగడతాయి ఆసారి. ఎండ తీవ్రం. రేయి ఉష్ణం. చుట్టూతా శోకం. మాట పెగలదు. నవ్వడమే మర్చిపోతాము. నీళ్లు కావాలి. లేదా ఎవరైనా దోసలిలో కాసింత ఆశను పోయాలి. పోనీ ఇతగాడి పాటను లౌడ్ స్పీకర్లలో ప్రతి చౌరాస్తాలో వినిపించాలి.
గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు
నీ పరుగు నిను ఒంటరిని చేసింది. నువ్వు ఎంచుకున్న బతుకు నిను ఒంటరిని చేసింది. నీ సమయం నీ నుంచి దొంగిలించబడింది. నీ అభిరుచి నీ నుంచి కొల్లగొట్టబడినది. తోడు లేని బైరాగి నేటి మనిషి. పాట అతణ్ణి కాపాడగలుగుతుంది. ఒక పాటైనా నీకు తెలిస్తే దేవుడు నీ కర్ణభేరులను కర్ణపేయం చేయగలిగితే నాలుగడుగులు నడుస్తావు. తడబడినా నడుస్తావు. పడినా నడుస్తావు. పాట కూడా వినలేని నిరుపేదలతో ఈ నేల నిండకుండా కొన్ని పల్లవులను పదే పదే వినిపిస్తావు.
నీవుంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బ్రతుకెందుకు
నీ బాటలోని నడుగులు నావే నా పాటలోని మాటలు నీవే
– జూన్ 4, 2021 (బాలూ విశ్రమం తర్వాత తొలి జయంతి)
Share this Article