.
( రమణ కొంటికర్ల
)…. అప్పటివరకూ హాలీవుడ్ ను ఊపేస్తున్న ఓ ఛార్మింగ్ స్టార్ అతను. అతడి కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కట్టేవారు. ఫోన్ కాల్స్ మార్మోగుతుండేవి. క్షణం తీరిక లేని సమయం. ఆయనతో కరచాలనం చేస్తే చాలు జన్మధన్యమనుకునేవారెందరో. ఇక ఫోటో కూడా దిగితే ఆ ఆనందానికి అవధుల్లేకుంటుండెనేమో.
కానీ, ఒకానొక సమయంలో ఆయన ఫోన్ చేసినా స్పందించేవారే కరువైపోయారు. ఆయన దగ్గరకు రావాలంటేనే తోటి నటీనటులతో పాటు, ఆయన్ను ఆరాధించే సామాన్యులూ భయపడ్డారు. స్నేహితులు మాయమైపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన్నారాధించిన ప్రపంచమంతా దూరం జరిగిపోయింది. కారణం.. Human Immunodeficiency Virus.
Ads
అదేనండీ 1980ల కాలంలో ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ సోకిందతడికి. అలాంటి సమయంలోనూ మానవత్వానికి ప్రతీకగా, స్నేహానికి చిరునామాగా ఆయన వెంట ఒకరు నిల్చారు. సినిమాలో హీరో, హీరోయిన్స్ గా అలరించిన ఆ జంట నిజ జీవిత స్నేహపరిమళమే ఈ కథ.
రాక్ హడ్సన్.. హాలీవుడ్ సినిమా పరిచయమున్న ఇతగాడి గురించి కాస్తోకూస్తో తెలియనివారుండరేమో బహుశా! 1955లో విడుదలైన మ్యాగ్నీఫిషియెంట్ ఆబ్సెషన్ సినిమాతో పరిచయమైన హడ్సన్ ప్రపంచ మేటి అందగాళ్లల్లో ఒకడిగా గుర్తింపు పొందిన హీరో. ముఖ్యంగా తన సహ నటుడైన డోరిస్ డేతో చేసిన హాస్య సినిమాల ద్వారా హడ్సన్ సినీ అభిమానులకు బాగా సుపరిచితుడయ్యాడు.
అదే సమయంలో ఎలిజబెత్ టేలర్ కూడా సినిమాల్లో రాణిస్తోంది. హడ్సన్ మ్యాగ్నిఫిషియెంట్ ఆబ్సెషన్ తో స్టార్ గా ఎదిగితే.. టీనేజ్ స్టార్ గా అరంగేట్రం చేసిన ఎలిజబెత్ టేలర్ నేషనల్ వెల్వెట్, ఫాదర్ ఆఫ్ ది బ్రైడ్, ఎలిఫెంట్ వాక్ వంటి సినిమాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత హడ్సన్, టేలర్ కలిసి 1955లో జయింట్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత 1956లో సినిమా విడుదలైంది.
జయింట్ సినిమా టెక్సాస్ కు చెందిన ఓ గుర్రాన్ని పెంచుకునే రైతు, మేరీల్యాండ్ లో ఉండే ఓ అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతంది. ఇదే సినిమాలో మరో ప్రధాన నటుడు జేమ్స్ డీన్ కూడా నటించాడు. ముఖ్యంగా జయింట్ సినిమాలో టేలర్, హడ్సన్ కెమిస్ట్రీ బాగా వర్కవుటై వారిద్దరూ సూపర్ స్టార్స్ గా మారిపోయారు.
జయింట్ సినిమా చిత్రీకరణలో మరో ప్రధాన నటుడైన జేమ్స్ డీన్ కారు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన 1955, సెప్టెంబర్ 30న జరిగింది. ఆ సమయంలో హీరోయిన్ ఎలిజబెత్ టేలర్ ను ఆ విషాదం కోలుకోలేకుండా చేసింది. ఆ షాక్ నుంచి ఆమె కోలుకోకముందే తిరిగి షూటింగ్ కు రమ్మని జయింట్ డైరెక్టరైన జార్జ్ స్టీవెన్స్ ఆమెపై ఒత్తిడి పెంచాడు.
ఆమె సమయానికి హాజరుకాకపోవడంతో నోటీసులు పంపించాడు. అది కాస్తా హీరో హడ్సన్ కు బాధ కల్గించింది. ఆ సమయంలో ఎలిజబెత్ కు అండగా నిల్చి ఆ నోటీసులను డైరెక్టర్ ఉపసంహరించుకునేలా చేసి.. కాస్త ఉపశమనం తర్వాత ఎలిజబెత్ ను షూటింగ్ లో భాగస్వామ్యం చేశాడు హడ్సన్. ఆ చిత్రం కుదిర్చిన స్నేహం ఇక వారిని జీవితాంతం ప్రాణ స్నేహితులుగా నిలబెట్టింది.
హడ్సన్ ఓ హోమో అని గ్రహించిన టేలర్!
ఇప్పుడంటే ప్రాశ్చాత్య దేశాల్లో ఎల్జీబీటీక్యూ సంస్కృతి కనిపిస్తోంది. స్వలింగ సంపర్కులకు మద్దతూ అంతకంతకూ లభిస్తోందిగానీ.. ఆ రోజుల్లో అది కెరీర్ కే ప్రమాదం. అలాంటి సమయంలో హడ్సన్, లీ గార్లింగ్టన్ అనే గేతో స్వలింగ సంపర్కానికి అలవాటయ్యాడు. లీ గార్లింగ్టన్ కూడా హలీవుడ్ లో నటుడైపోదామని వచ్చి యూనివర్సల్ స్టూడియోలో ఉద్యోగంలో కుదిరిన ఓ టెక్నీషియన్. హడ్సన్, లీ గార్లింగ్టన్ తో బహిరంగంగా ఎక్కడా కనిపించేవాడు కాదు. ఆ విషయం టేలర్ కు తెలిసింది.
అది ఏదో ఒకనాడు బయటపడకపోదని గ్రహించింది. ఆ రోజుల్లో హడ్సన్ కు అదంత మంచిది కాదని గమనించిన టేలర్… వారిద్దరినీ కొద్దికాలం మెక్సికోలోని ప్యూర్టో వలార్టా అనే చిన్న బీచ్ ఉండే పట్టణానికి పంపించింది. ఈ విషయాన్ని హడ్సన్ బయోగ్రఫీ రాసిన మార్క్ గ్రిఫిన్ వెల్లడించారు.
హెచ్ఐవీతో కఠోరంగా హడ్సన్ కలల ప్రపంచం!
హడ్సన్ ఒక రెండు దశాబ్దాల కాలం హాలీవుడ్ లో స్టార్ గా వెలుగొందుతున్న సమయంలో హఠాత్తుగా ఆయన హెచ్ఐవీ బారిన పడ్డాడు. అప్పటివరకూ తిరుగులేని రారాజులా.. ప్రపంచం మొత్తం కొనియాడతున్న అందగాడిగా.. సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ గా పాప్యులరైన హడ్సన్ హెచ్ఐవీ బారినపడ్డాక… అదంతా ఓ కలలా అనిపించింది.
ఎయిడ్స్ అనే మహమ్మారి ప్రపంచంలో ఓ హాట్ టాపిక్ అయి భయపెడుతున్న వేళ.. అంతటి నటుడు హెచ్ఐవీ బారిన పడ్డాక అప్పటివరకూ తనంటే క్రేజ్ కనబర్చిన ప్రపంచమంతా దూరం దూరమైపోయింది. అప్పటివరకూ తన అపాయింట్మెంట్ కోసం వచ్చినవారు కనిపించకుండా పోయారు. తీరికలేకుండా ఫోన కాల్స్ తో మార్మోగిన బిజీ బిజీ దైనందిన జీవితం… ఒక్కసారిగా మూగబోయింది.
కనీసం తాను ఫోన్ చేసి పలకరిద్దామన్నా మాట్లాడేవారు కరువయ్యారు. నా అన్నవారెవ్వరూ లేకుండా దూరమయ్యారు. స్నేహితులు కరువైపోయారు. మొత్తంగా అసలు ఈ లోకం కష్టాల్లో ఉన్నప్పుడెలా ఉంటుందో హాస్పిటల్ బెడ్ పైనున్న హడ్సన్ కు అర్థమైంది.
హడ్సన్ మరణం వరకూ వెన్నంటి…
అదిగో అప్పుడు ఈ సమాజ దృక్కోణానికి భిన్నంగా అలాంటి సమయంలోనూ హడ్సన్ ను వెన్నంటి నిల్చింది ఎలిజబెత్ టేలర్. 1985లో ఎయిడ్స్ సోకిన హడ్సన్ ఆసుపత్రికే పరిమితమయ్యాడు. హడ్సన్ దగ్గరకు నేరుగా వెళ్లితే మీడియా కంటపడే అవకాశముంది. తన సినీ, వ్యక్తిగత జీవితానికీ ముప్పు తేవొచ్చు.
అలాంటి సమయంలో డాక్టర్ మైకేల్ గాట్లీఫ్ తో కలిసి రహస్యంగా మీడియా, ఇతర భద్రతా సిబ్బంది కంటపడకుండా హడ్సన్ దగ్గరకు వెళ్లివస్తూ ఉండేది టేలర్. ఓ ఎలివేటర్ ద్వారా పదో అంతస్తులో ఉన్న హడ్సన్ గదికి వెళ్లి ఆయనకు సాంత్వన చేకూర్చేది.
అదిగో, ఆ సమయంలోనే హడ్సన్ కు టేలర్ స్నేహం గొప్పతనం మరింత అర్థమైంది. అలాగే, పచ్చగా కనిపించేదంతా బంగారమే కాదని.. లోకం స్వభావమూ తెలిసొచ్చింది. అలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే హడ్సన్ 1985, అక్టోబర్ 2వ తేదీన హెచ్ఐవీతో మృతి చెందాడు. అది టేలర్ ను ఓ కుదుపు కుదిపేసింది.
హెచ్ఐవీపై అవగాహన, పోరాటం
హడ్సన్ మరణించాక అతడి అంత్యక్రియలను దగ్గరుండి ఘనంగా చేసిన ఎలిజబెత్ టేలర్.. ఆ తర్వాత బ్లేవరీ హిల్స్ లోని ఆయన ఇంట్లో హడ్సన్ స్మారకార్థం పలు సంగీత కార్యక్రమాలతో అతడి ఆత్మకు శాంతి కల్గేందుకు ఓ స్నేహితురాలిగా అన్నీ తానై చేసింది.
టేలర్ పై హడ్సన్ మరణం ప్రభావం!
హెచ్ఐవీ వంటి వైరస్ తో మృతి చెందాక.. హడ్సన్ మరణం ఎలిజబెత్ టేలర్ పై తీవ్ర ప్రభావం చూపింది. కమిట్మెంట్ టూ లైఫ్ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె స్పాన్సర్ గా నిలవడంతో పాటు.. మిలియన్ డాలర్స్ నిధులు సేకరించి.. హడ్సన్ వంటి మరణాలు ఇంకెవ్వరికీ రాకూడదని.. పలు కార్యక్రమాలు నిర్వహించి ఎయిడ్స్ పై అవగాహన కల్పించింది.
ఆ కార్యక్రమాల్లో హాలీవుడ్ ప్రముఖులైన సిండీ లాపర్, రాడ్ స్టువర్ట్, శ్యామీ డేవిస్ జూనియర్, క్యారోల్ బర్నెట్ వంటివారు హాజరయ్యారు. అప్పటివరకూ ఎయిడ్స్ మహమ్మరి అంటే ఉన్న అపోహలను తొలగించడంతో పాటే, దానిపై అవేర్నెస్ ను కల్పించే ఒక బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది ఎలిజబెత్ టేలర్. ఆ తర్వాత అదే ఒరవడిలో ఆమె 1991లో ఎలిజబెత్ టేలర్ ఫౌండేషన్ ను స్థాపించి 17 మిలియన్ డాలర్స్ ను సేకరించి, ఆ నిధులను ప్రపంచవ్యాప్తంగా 700 స్వచ్ఛంద సంస్థలకందించింది.
మొత్తంగా ఎలిజబెత్ టేలర్, రాక్ హడ్సన్ అనే ఇద్దరు హాలీవుడ్ స్టార్ మధ్య జయింట్ సినిమాతో వర్కౌటైన కెమిస్ట్రీ… ఆ తర్వాత జీవితాతం స్నేహపూర్వకంగా కొనసాగడమే కాకుండా.. హడ్సన్ మరణం టేలర్ ను సమాజహితం దిశగా ఆలోచింపజేసింది…
Share this Article