మహేశ్ బాబు కెరీర్ మొదట్లో ఒకటీరెండు సినిమాలు సరిగ్గా నడవకపోతే, పత్రికల్లో విమర్శలు వస్తే… హీరో కృష్ణ ఓ జవాబు చెప్పాడు… ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫెయిల్ కావాలన్నా చాలా కారణాలు ఉంటయ్… కానీ నేను చూస్తున్నది మహేశ్‌ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేశారా లేదానేది మాత్రమే… చేశారు, అది చాలు… ఒక మంచి పాత్ర పడితే తన కెరీర్ అదే పికప్ అవుతుంది… ఇదీ తన విశ్లేషణ…
వర్తమానానికి వద్దాం… ఒక కమెడియన్, అందులోనూ టీవీల్లో కామెడీ చేసుకునే ఓ కేరక్టర్ సినిమాల్లో హీరోగా నిలబడటం మామూలు విషయం కాదు, మామూలు విజయం కాదు… సుడిగాలి సుధీర్ సాధించాడు… ఎవరెన్ని వెకిలి వ్యాఖ్యానాలు చేసినా సరే, నవ్వుతూ స్వీకరించే గొప్ప అలవాటున్న సుధీర్ విధేయంగా ఉంటూనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు… తెలుగు టీవీల్లో నటులకు ఎవరికీ చేతకాని సక్సెస్…
నిజానికి గాలోడు చెప్పుకోదగిన సినిమా కాదు… సుధీర్‌కు బిల్డప్పులు ఎక్కువయ్యాయి… పెద్ద ఇంప్రెసివ్ కథ కాదు, కథనం లేదు… కానీ 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేశాడు… ఇంకా ఆడుతోంది… 3 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్ చేస్తే… ఎప్పుడో లాభాల్లోకి వచ్చి, ఇప్పుడు సూపర్ హిట్ రేంజుకు పోతోంది… అవును, సుధీర్ రేంజుకు అది పెద్ద విజయమే… పూర్తిగా తన వ్యక్తిగత విజయం ఇది… టీవీలో తను సంపాదించుకున్న ఇమేజీ కూడా తోడైంది…
Ads
సినిమాల్లో కమెడియన్ వేషాలు వేసుకునే నటులు హీరోలుగా ప్రయత్నించి అడ్డంగా బోల్తాకొట్టిన ఉదంతాలు బోలెడు… వాటిని పక్కన పెడితే సుధీర్ జస్ట్, ఓ టీవీ నటుడు… కామెడీ చేస్తుంటాడు… ఈమధ్య హోస్టింగు… కానీ తనలో మంచి డాన్సర్ ఉన్నాడు, ఫైటర్ ఉన్నాడు, అన్నింటికీ మించి తనలో నటుడున్నాడు… పాత్రకు తగినట్టు మౌల్డ్ చేసుకోగలడు తనను తాను… అయితే సుధీర్‌కు టైం కూడా కలిసొచ్చింది… మార్కెట్‌లో ప్రస్తుతం పెద్ద సినిమాలేమీ లేవు… అందుకని థియేటర్లు దక్కాయి….
మార్కెట్‌లో ఈమధ్య విడుదలైన సినిమాలేవీ చూడబుల్‌గా లేవు… అదీ గాలోడికి కొంత కలిసొచ్చింది… ఏదయితేనేం… ఒక్కసారి గుర్తుచేసుకొండి… టీవీల్లో కాస్త పాపులర్ కాగానే, ఏదో సినిమాలో నటించేసి, అక్కడ సెటిలవుదామని చూసేవాళ్లే అందరూ… తప్పులేదు… అంతటి యాంకర్ ప్రదీప్ కూడా ఆమధ్య ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే ఓ పిచ్చి టైటిల్‌తో హీరోగా చేసి పల్టీ కొట్టాడు… ఆమధ్య బిత్తిరి సత్తి కూడా సోలో హీరోగా సినిమా చేశాడు… ఢామ్మని పేలిపోయింది సినిమా… ఇంకా ఇతర ఉదాహరణలేమిటనేది పక్కన పెట్టేస్తే… వాళ్లెవరికీ చేతకాని సక్సెస్ సుధీర్ సాధించాడు…
అయితే, నిలబడతాడా..? కాస్త జాగ్రత్తగా ఉంటే నిలబడతాడు… ఏదైనా చిన్న సినిమా ఎవరైనా ప్లాన్ చేస్తే సుధీర్‌తో రిస్క్ లేని సేఫ్ ప్రాజెక్టు అవుతుంది… కాస్త మంచి కథ, మంచి కథనం ఉంటే తను సినిమాను మోయగలడు… ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు చిన్న నిర్మాతలకు వచ్చినట్టే కనిపిస్తోంది… తోపులు అని చెప్పుకునే వాళ్ల సినిమాలు బోల్తాకొడుతుంటే, అనామకుడు అని వెక్కిరించబడిన ఆ సుధీర్ ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నాడు…!!
Share this Article