సినిమాల్లో… ప్రత్యేకించి టీవీ సీరియళ్లలో చూస్తుంటాం కదా… ఒక్క ఇంట్లోనే అత్తాకోడళ్లు, తోడికోడళ్లు ఒకరిని ముంచడానికి మరొకరు, వీలైతే చంపడానికి కూడా కుట్రలు, ప్రయత్నాలు గట్రా… సోవాట్, ఇంటింటి రామాయణాలే కదా అంటారా..? సరే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకు గానీ… జార్ఖండ్ ముక్తిమోర్చా, విభజన ఉద్యమనేత శిబూ సోరెన్ కుటుంబం మాత్రం అచ్చం అలాంటిదే…
పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన హేమంత్ సోరెన్ కథ తెలిసిందే కదా… తను దిగిపోయే సిట్యుయేషన్ వచ్చినప్పుడు తన భార్యను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాలని అనుకున్నాడు… జేఎంఎం పార్టీ నాయకులు కూడా మెంటల్‌గా ప్రిపేరయ్యారు… కాంగ్రెస్ కూడా సీఎం ఎవరనేది మీ సొంత పార్టీ యవ్వారం, మా మద్దతు మాత్రం మీకే అనేసింది… కాదంటే బీజేపీ తన్నుకుపోతుందని భయం…
కానీ చివరలో ఏం జరిగింది… ఫాఫం, కల్పనా సోరెన్ బదులు మరో సీనియర్ మంత్రి చంపయ్ సోరెన్ తెర మీదకు వచ్చాడు… ముఖ్యమంత్రి అయిపోతున్నాడు… మరి ఏమిటీ హఠాత్ పరిణామం…? దీనికి ఆ ఇంట్లోని కుళ్లుబోతు తత్వాలే కారణం… మాజీ సీఎం హేమంత్ తండ్రి శిబూ సోరెన్… ఆయన పెద్ద కొడుకు పేరు దుర్గా సోరెన్… చాన్నాళ్ల క్రితమే చనిపోయాడు… కోడలు పేరు సీతా సోరెన్… చాన్నాళ్లుగా జేఎంఎంలో ఉంది… ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా…
Ads
14 ఏళ్లుగా ఎమ్మెల్యే… పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్… మరిది సీఎంగా ఉన్నన్ని రోజులూ అసహనంతో కుళ్లుకునేది… 2022లో బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు చేస్తోంది అని హేమంత్ మొత్తుకుంటూ ఉంటే… ఆయన వదిన, అంటే ఈ సీతా సోరెన్ బహిరంగంగానే ‘హేమంత్ ఏమీ తక్కువ కాదు, భూముల్ని భోంచేస్తున్నాడు’ అని ఆరోపణలు చేసేది… ‘విలువైన ఖనిజసంపద ఉన్న రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు’ అని విమర్శించేది… పలు ఆరోపణలు చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఈడీని ట్యాగ్ చేసేది… అంటే, హేమంత్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పడమే కదా…
తరువాత ఈడీ కన్నేయడం, పలు అక్రమాలు నిజంగానే బయటపడటంతో ఇక హేమంత్ దిగిపోవడం ఖాయమైంది… కానీ ఇంటి పెద్ద కోడలు తాను ఉండగా హేమంత్ భార్య కల్పన సీఎం కాబోతోందనే భావన సీతా సోరెన్‌ను కాల్చేసింది… ‘నా తోడికోడలు సీఎం కావడం నాకిష్టం లేదు,.. ఆమెకు రాజకీయాల్లో ఏం అనుభవం ఉంది..? ఆమె సీఎం కావడాన్ని నేను వ్యతిరేకిస్తా… నేను 14 ఏళ్లుగా ఎమ్మెల్యేను, సీనియర్‌ను, పార్టీ ప్రధాన కార్యదర్శిని… అయితే గియితే నేను అవుతాను సీఎంను… కాదంటే పార్టీలో ఇక సీనియర్లే లేరా..?’ అని ప్రశ్నించడం ప్రారంభించింది…
మూడుసార్లు ఎమ్మెల్యే ఈమె… 2022లోనే హేమంత్ సోరెన్ మీద తీవ్రంగానే దాడి చేసింది… ‘‘గురూజీ (శిబూసోరెన్, మామగారు), ఆయన కొడుకు, నా భర్త కలలు గన్న జల్, జంగిల్, జమీన్ (నీరు, అడవి, భూమి) మొత్తం భ్రష్టుపట్టించారు… అవినీతి అధికారులను రక్షిస్తున్నారు, మా పార్టీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్ము అయిపోయాయి’’ ఇలా ఉండేవి ఆమె వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు… బీజేపీ గనుక సరిగ్గా ప్రయత్నిస్తే మరో లేడీ షిండే అయ్యేది…
మొన్నటి ఎమ్మెల్యేల మీటింగుకు కూడా ఆమె హాజరు కాలేదు… ఈ సీత ఏం మాట్లాడుతున్నా సరే హేమంత్ భార్య కల్పన మాట్లాడేది కాదు… ఆమెకు తన పిల్లలు, తన భర్త మాత్రమే ముఖ్యం… పెద్దగా జనంలోకి, ఫంక్షన్లలోకి కూడా వచ్చేది కాదు… కాబోయే సీఎం అనే వ్యాఖ్యల మీద కూడా స్పందించేది కాదు… చివరకు ఆ ఇంటి పంచాయితీతో పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు కల్పన వద్దు, సీత వద్దు అని హేమంత్‌ను ఒప్పించారు… అలా చంపయ్ సోరెన్ అని మరో నేత తెర మీదకు వచ్చి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు… అదీ కథ…
Share this Article