హేమయ్యా… హోంఖారూ… హన్ని టీవీ షోలు చేసినవ్… ఖర్చు కాదు, ఒక టీవీ షో క్లిక్ కావాలంటే కాస్త క్రియేటివిటీ, కొత్తదనం, కమిట్మెంటు కనిపించాలి ఖదటోయ్… హేమో, నువ్వు బొచ్చెడు ఆశలు పెట్టుకున్న డాన్స్ ప్లస్ అనబడే టీవీ షో అడ్డంగా తన్నేసిందేమిటి..? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావా..? అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ విచిత్రమైన స్టోన్‌తో ట్విస్టులు ఇచ్చేవాడివి కదా… జనం కూడా ఈ డాన్స్ ప్లస్ షో కనిపించగానే… ‘వన్ సెకండ్’ అంటూ స్కిప్ చేసేసి, వేరే ప్రోగ్రాం వైపు గబగబా పరుగు తీస్తున్నారు దేనికి..? హహహ… అసలు ఆ బారెడు గడ్డమే భీకరంగా, బీభత్సంగా ఉంది… దానికితోడు తన స్టోన్ ప్లస్ వింత మాడ్యులేషన్…
ఇవన్నీ ఎందుకు చెప్పుకోవల్సి వస్తున్నదీ అంటే… తాజా బార్క్ రేటింగుల్లో తమరి షోకు వచ్చిన మార్కులు నాలుగు… అచ్చంగా నాలుగు… అంటే ఈటీవీ వాడి ఢీ షో ముందు ఢమాల్ అని పేలిపోయినట్టే లెక్క… ఏ షో టార్గెట్‌గా తమరు దీన్ని ప్లాన్ చేశారో ఆ పర్పస్ ఫ్లాప్ అయిపోయింది… లేకపోతే హేమిటయ్యా… ఈ రికార్డింగు డాన్సుల షోకు ఏకంగా ఆరుగురు జడ్జిలా..? ప్లస్ చీఫ్ జస్టిస్ తమరు… అంటే మొత్తం ఏడుగురు… కొరియోగ్రాఫర్లు రఘు, బాబా భాస్కర్, యశ్, యానీ, పాత నటి ముమైత్ ఖాన్, పాతబడుతున్న నటి మోనాల్…
Ads
ఆ బాబా భాస్కర్ తనకు తెలిసిన కిలికిలి భాషలో ఏదో అరుస్తూ, ఈల వేస్తూ, స్టేజీ ఎక్కి స్టెప్పులేస్తూ ఓవరాక్షన్… హగ్గులు, కిస్సులతో బిగ్‌బాస్ షోను అదరగొట్టిన మోనాల్‌తో ఆ యశ్ లవ్ ట్రాకు… స్క్రిప్టెడే కదా, మరీ కృతకంగా ఉంది… దీనికితోడు మధ్యలో ఓ హారతిపళ్లెం పట్టుకుని, కొంగు నెత్తిన పెట్టుకుని యశ్ భార్య భోరున ఏడుస్తూ రావడం… ఒకటీరెండుసార్లు వోకే గానీ ఇక అదే పనా..? వీళ్లకు తగినట్టు యానీ, ముమైత్… అసలు డాన్సులు అనే కాన్సెప్టుకన్నా ఈ జడ్జిల కామెడీ పర్ఫామెన్సే ఓవర్ అయిపోతోంది… కాస్త వెగటు కూడా పుడుతోంది… అసలు మీరు చేయించే డాన్సులే రికార్డింగు డాన్సులు కమ్ సర్కస్ ఫీట్లు… దానికి ఇంతమంది జడ్జిలు అవసరమా..? సరే, ఉన్నారుపో… మళ్లీ మధ్యమధ్య ఈ సైడ్ ట్రాకులేమిటి..? ఐనా డాన్సు షోలో కామెడీ ఇరికించాలంటే అది ఢీలో చూడాలి… ఈసీజన్, లాస్ట్ సీజన్ గతి తప్పింది కానీ… అంతకుముందు రష్మి, సుధీర్, శేఖర్ మాస్టర్, సదా… వీళ్లే భలే రక్తికట్టించేవాళ్లు… ఆ పాత సుధీర్, ఆ పాత ప్రదీప్ ఇప్పుడు కనిపించడం లేదు, ఆ జోష్ లేదు, ఆది వచ్చినా, ఇంకెవరో పిల్లి దీపిక వచ్చినా ఆ స్కిట్లు పెద్దగా పేలడం లేదు ఇప్పుడు, ఐనా సరే, ఈ డాన్స్ ప్లస్ కామెడీకన్నా ఢీలో కామెడీయే బాగుంటుంది… ఓ స్పాంటేనిటీ, లైవ్‌నెస్ కనిపిస్తయ్…
ఇక ఇప్పుడు డాన్స్ విత్ సెలెబ్స్ అని ఇంకో థీమ్ అట… విష్ణుప్రియ వచ్చింది… ఏదో పిచ్చి డాన్స్ చేసింది ఇద్దరు మగ డాన్సర్లతో కలిసి… ఓ ఐటమ్ సాంగ్… అంటే ఇక తెలుసు కదా… బాబా భాస్కర్ లేచి ఎక్కడో స్టకప్ అయిపోయినట్టుంది అని ఓ వెకిలి కామెంట్, విష్ణుప్రియ నడుం దగ్గర ఎవరైనా స్టకప్ కావాల్సిందే అంటూ ఇదే హోంకారుడు ఆ వెకిలికి కాస్త వెగటు మసాలా పంచ్… దానికి విష్ణుప్రియ నోరంతా తెరిచి ఓ వింత ఎక్స్ప్రెషన్… ఇదేం డాన్స్ షోరా బాబూ…!? వీళ్లు గాకుండా హారిక, మెహబూబ్ డాన్సులు ఉంటాయట… కార్తీకదీపం పిల్లలు హిమ, సౌర్య డాన్సులు కూడా… సౌర్య పాటలో డాన్స్ మూమెంట్స్ పెద్దగా ఉండవు గానీ హిమ మూమెంట్స్‌లో మంచి ఎనర్జీ, రిథమ్ కనిపిస్తున్నయ్… ఈ పిల్ల ఇంకాస్త కష్టపడితే షైన్ అయ్యే చాన్సులున్నయ్… కాకపోతే ఈ డాన్స్ ప్లస్ వంటి వేదికలు పరిచయానికి పనికొస్తాయి తప్ప పర్ఫామెన్స్‌కు వేస్ట్ అని గుర్తించాలి వాళ్లు… అంతే…!!
Share this Article