.
ఏదో సెర్చుతుంటే అనుకోకుండా ఓ పాట తగిలింది… నవమి నాటి వెన్నెల నేను- దశమి నాటి జాబిలి నీవు… అప్పుడప్పుడూ వచ్చే థాటే… అసలు వేటూరి ఏం చెప్పాలనుకున్నాడు పల్లవిలో…! అది శివరంజని సినిమాలో పాట… దాసరి సొంత సినిమా… తారకప్రభు ఫిలిమ్స్… సంగీతం రమేష్ నాయుడు…
అది ఓ సినిమా తార కథ… అప్పట్లో అనేక ప్రయోగాలు చేసేవాడు కదా, దాసరి… ఇదీ ఓ ప్రయోగమే, డౌట్ లేదు… జయసుధ షీరో… హరిప్రసాద్ అనే నటుడు అందులో ఆమె వీరాభిమాని కమ్ హీరో రోల్… (చిరంజీవి చెన్నై రూమ్మేట్ ఇతనేనా?) మోహన్‌బాబు కూడా ఉంటాడు…
Ads
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి, నీ వయసే వసంత ఋతువై. నీ మనసే జీవన మధువై… అంటూ సాగుతుంది ఆ పాట… ట్యూన్ రమేష్ నాయుడిది, తిరుగేముంటుంది… మంచి మెలొడీ, రొమాంటిక్ వైబ్స్…
వేటూరి తన పదాలకు, పాదాలకు ఎప్పుడూ వివరణ ఇవ్వడు కదా… ఆ సందేహం చాలామందిలో అలాగే ఉండిపోయింది… ఈ నవమి నాటి వెన్నెలకు, దశమి నాటి జాబిలికి లింకేమిటో… వెన్నెల స్త్రీలింగం ఏమిటో, దశమి పుంలింగమేమిటో…
భావుకులు ఎవరైనా, భావకవులు ఎవరైనా తన కథానాయికను వర్ణించడానికి నిండు పూర్ణబింబంతో పోలుస్తారు… అది ప్రియుడు లేదా కథానాయకుడి భావన… కానీ ఇక్కడ ఆ నవమి వెన్నెల, దశమి నాటి జాబిలి కలిసిన ప్రతిసారీ అది కార్తీక పున్నమి రేయేనట… సరే, సంభోగించిన ప్రతిసారీ పున్నమి నాటి పరిపూర్ణ వెన్నెల్ల వెలుతురు వంటి ఆనందం, తమకం అనే భావన వరకూ బాగానే ఉంది…

కోరా దగ్గర నుంచి అనేక వెబ్‌సైట్ల వరకూ వేటూరి బహుశా ఈ భావనతో రాసి ఉంటాడు అంటూ ఎవరికితోచిన వివరణ, సమర్థన వాళ్లు వినిపించారు… కొందరైతే ప్రాస కోసం ఏదో ప్రయాస పడ్డాడు, ఆ టైమ్‌కు ఆ ట్యూన్‌కు ఏవో తోచిన పదాల్ని ఇరికించాడు తప్ప అందులో సాహితీ విలువ లుప్తమని తీసిపారేసినవారూ ఉన్నారు…
స్వరాభిషేకం గానీ, పాడుతా తీయగా గానీ… బాలు ఏ షో చేసినా వేటూరి ప్రశంస లేకుండా ఒక్క ఎపిసోడ్ కూడా ఉండదు… తన అభిమానం వరకూ వోకే, తనను కారణజన్ముడనీ అంటాడు వోకే, అంగీకరిద్దాం, ప్రజ్ఞాశాలి వేటూరి… కానీ ఈ పాదాలకు అర్థమేమిటి..?
ఓసారి స్వరాభిషేకంలో యాంకర్ సుమ అడిగింది బాలును చనువుగా… అసలు దాని అర్థమేమిటీ అని… బాలు దాన్ని సమర్థించలేక, వివరించలేక నానా యాతన పడ్డాడు… నవమి నాటి అంటే అప్పుడప్పుడే విచ్చుకుంటున్న వెన్నెల అట, అయిదారు రోజుల్లో పౌర్ణమి వస్తుందట, తరువాత దశమి దాటితే మూణ్నాలుగు రోజుల్లోనే పున్నమి వస్తుందట… ఆహా ఏం రాశాడు వేటూరి అంటాడు…
అచ్చంగా ఆ పాదాల అర్థరహితంలాగే బాలు వివరణ కూడా… తలాతోకా లేకుండా… గందరగోళంగా… మళ్లీ తనే అంటాడు… ‘‘నేనూ చాన్నాళ్లు చాలా ఆలోచించాను సుమా… నాకూ అర్థం కాలేదు… కానీ మంచి రొమాంటిక్ థాట్’’ అంటాడు…
స్వరాభిషేకం షోలో బాలు విఫల వివరణ ఇదీ…
ఓచోట ఒకాయన వ్యంగ్యంగా రాసుకొచ్చాడు… కానీ లాజిక్ ఉంది అందులో… ‘‘కథలో ఆమె పెద్దది, వయస్సులో… పాపులారిటీలో, ఆస్తిలో, హోదాలో, అంతస్థులో… అందుకని నేను చిన్నవాడిని, ఇంకా నవమి నాటి వయస్సే, నువ్వేమో జాబిల్లివి, అంటే నాకన్నా ఒకింత పెద్దదానివి సుమా అని కథానాయకుడు ఆమెకు చెబుతూ పాడుతుంటాడు…. నిజజీవితంలో కూడా జయసుధ అప్పటికే స్టార్ హీరోయిన్, హరిప్రసాద్ నథింగ్’’… కాకపోతే మనం కలుసుకున్న ప్రతిసారీ కార్తీక పున్నమే… అంటే వయోభేదాలు గట్రా ఏమీ ఎరుగని అమితానందమే అనేది మనోడి భావన అట..!!
Share this Article