.
Ashok Pothraj …… జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే ‘టచ్ మీ నాట్’. గతంలో ఒకటి రెండు సినిమాలను తెరకెక్కించిన రమణతేజ, ఈ సిరీస్ కి దర్శకుడు.
నవదీప్ – కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ 7 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ‘హీ ఈజ్ సైకో మెట్రిక్’ అనే కొరియన్ సిరీస్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు.
Ads
ఇక కథలోకి వస్తే.. పదేళ్ల క్రితం మారుతి అపార్టుమెంటులో జరిగిన సంఘటన మాదిరిగానే, ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరుగుతుంది. 20 మంది పేషంట్లు చనిపోతారు. దాంతో మారుతి అపార్టుమెంటు కేసు మరోసారి తెరపైకి వస్తుంది. అప్పటి సంఘటనకు కారణమైనవారే, ఇప్పటి సంఘటనకు పాల్పడి ఉంటారనే సందేహం తలెత్తుతుంది.
ఆ విషయం తెలుసుకోవడానికిగాను, రిషిని ఉపయోగించుకోవాలని రాఘవ అనుకుంటాడు. తన సైకో మెట్రి శక్తితో రిషి ఏం చెబుతాడు? ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి? అనేది కథ.
ఒక బలమైన సంఘటనతో కథను మొదలుపెట్టినప్పుడు, ఆ స్థాయికి తగ్గని కథనంతో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఆ వెంటనే చల్లబడిపోయి .. నిదానంగా .. నింపాదిగా సన్నివేశాలు సాగితే ఆడియన్స్ డీలాపడిపోతారు. ఈ సిరీస్ విషయంలో జరిగింది ఇదే.
ఈ కథలో కొత్త పాయింట్ ‘సైకో మెట్రి’. ఈ అంశం చుట్టూ ఈ కథ అంతా కూడా చాలా ఆసక్తికరంగా తిరుగుతుందని అనుకుంటారు. కానీ ఆ స్థాయిలో ఈ అంశం చుట్టూ ఇంట్రెస్టింగ్ డ్రామాను నడిపించలేదు. తనకి గల పవర్స్ ను హీరో లైట్ తీసుకుంటాడు .. అతనే అంత లైట్ తీసుకుంటే మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవడమని ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్ అంటే నవ్వకూడదు అన్నట్టుగా నవదీప్ పాత్రను డిజైన్ చేశారు.
కథ మొదట్లోనే ఒక దారుణమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఎందుకు జరిగింది? కారకులు ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? అనే విషయాల దిశగా కదలవలసిన కథ, నత్తనడక నడుస్తూ ఉంటుంది. సాధారణంగా పోలీసులు .. ఇన్వెస్టిగేషన్ అంటే తెరపై ఒక రకమైన హడావిడి కనిపిస్తుంది. ఆ హడావిడి కూడా ఈ సిరీస్ లో కనిపించలేదు. అసలైన పాత్రలు అసలు విషయం పక్కన పెట్టి అనవసరమైన కబుర్లతో చేసే కాలక్షేపంలా అనిపిస్తుంది.
పనితీరు: ఈ కథకి కేంద్ర స్థానమైన ‘సైకో మెట్రి’ అనే అంశం చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకోలేకపోయారు. అసలైన కథను సీజన్ 2లో చెప్పాలనుకున్నారేమో, తేలికైన సన్నివేశాలను .. తేలిపోయే సన్నివేశాలకు మాత్రమే ఈ సీజన్లో చోటిచ్చారు.
స్క్రీన్ ప్లే కూడా చాలా సాదాసీదాగా కొనసాగుతూ వెళ్లింది. పాత్రలు పెద్దగా బరువైనవి కాకపోయినా, ఎవరి పరిధిలో వారు నటించారు. గోకుల భారతి ఫొటోగ్రఫీ బాగుంది. మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. అన్వర్ అలీగారి ఎడిటింగ్ ఫరవాలేదు…
Share this Article