ఒక నాట్యభంగిమ… ఆ ఫోటోతో నాట్యం అనే సినిమాకు సంబంధించిన టీజర్ ఒకటి రిలీజైంది… సరే, టీజర్లు, ట్రెయిలర్లు వస్తుంటయ్, పోతుంటయ్… కానీ ఈ భంగిమ ఇంత పర్ఫెక్ట్గా పెట్టింది ఎవరబ్బా..? డాన్స్ ప్రధానంగా తీయబడే సినిమాలో నటిస్తున్నది ఎవరై ఉంటారబ్బా అనుకుని ఓసారి చూస్తే… సంధ్యారాజు అని కనిపించింది… ఎవరీ సంధ్యారాజు..? పెద్దగా ఎప్పుడూ మన దక్షిణాది తెర మీద కనిపించలేదు, వినిపించలేదు, ఎవరబ్బా అని తెలుసుకుంటే… ఆశ్చర్యపోయే షేడ్స్… బహుముఖ ప్రజ్ఞాశాలి… తన టేస్టు, తన ప్యాషన్, తన లైఫ్, తన యాంబిషన్… చక్కగా అమల్లోకి పెడుతున్న ఆమెను మెచ్చుకోవచ్చు… ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? సత్యం రామలింగరాజు తెలుసు కదా… ఆయన కోడలు… అదేమిటి..? ఆయన కోడలేమిటి..? ఈ సినిమాల్లో పాత్రలేమిటీ అంటారా..? అదే ఇంట్రస్టింగు…
ఏదో కోరుకొండ రేవంత్ ఫిల్మ్ అని కనిపించింది… మూవీ పోస్టర్, పేరు పక్కనే ఓ డాన్స్ భంగిమ చూశాక, ఈ దర్శకుడికి భలే టేస్టు ఉన్నట్టుందే అనే ఆసక్తితో టీజర్ చూస్తే… అందులో నిశృంఖల ప్రజెంట్స్ అని కనిపించింది… ఆ పదం ఎప్పుడూ వినలేదు… తరచి తరచి ఆరాలు తీసినా అర్థం దొరకలేదు… చివరాఖరికి డాన్స్‌లో, దర్శకత్వంలో, జర్నలిజంలో ప్రవేశం ఉన్న ప్రియదర్శిని చెప్పింది… సంకెళ్లు లేని, బంధించబడని వంటి అర్థాలు అని… నాట్యశాస్త్రంలో స్వేచ్ఛా వ్యక్తీకరణ… ఈ సంధ్యారాజుకు నిశృంఖల డాన్స్ అకాడమీ ఉంది… ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి… ట్రెయిన్డ్… సర్టిఫైడ్ స్కూబా డైవర్… ఆమెకు డాన్స్ అంటే ప్యాషన్… అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉండీ, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది… మంచి టేస్టున్నవే… ఆమె ఇంట్రస్టు అది… చెన్నైలో చదువుకున్నందున ఆమెకు తమిళంతోపాటు తెలుగు, ఇంగ్లిషు, హిందీ తెలుసు… మళయాళంలో కేర్‌ఫుల్ అని ఓ మూవీ చేసింది… రచనా నంబియార్ అనే ఓ జర్నలిస్టు పాత్ర… ఏదో రోడ్ యాక్సిడెంట్ వార్త రాస్తూ, దాని వెనుక మిస్టరీ మీద వర్క్ చేసే పాత్ర…
Ads
నాట్యం పేరిట ఓ షార్ట్ ఫిలిమ్ కూడా చేసినట్టుంది… ఇప్పుడు అదే పేరుతో ఫుల్ లెంత్ మూవీ ప్లాన్ చేసింది… ఇదీ ఈ సినిమా నేపథ్యం… ఆమె మెట్టినల్లే కాదు, పుట్టింటి వైపూ వ్యాపార నేపథ్యమే… రాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ రామసుబ్రహ్మణ్యరాజా మనమరాలు ఆమె… సంధ్య స్పిన్నింగ్ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమె… తనకు వ్యాపార నిర్వహణ తెలుసు… సత్యం స్కాం రామలింగరాజు ఇమేజీని దెబ్బతీయవచ్చు కానీ ఆ కంపెనీ మానసపుత్రిక 108 సర్వీస్… అనేక రాష్ట్రాల్లోకి ఆ కాన్సెప్టు విస్తరించి అనేక మంది ప్రాణాల్ని కాపాడింది… సరిగ్గా సిమిలర్ ఆలోచనతోనే సంధ్యారాజు కాల్ హెల్త్ సర్వీసెస్ అని కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేసింది ఆమధ్య… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..?
అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండీ… సొంతంగా వ్యాపారాల్లో ఉంటూనే… తన ప్యాషన్ అయిన డాన్స్‌ను మరిచిపోకుండా… ఆ తృష్ణను తీర్చుకోవడానికి ప్రయత్నించడం… అదనంగా నటన… అదీ ఆసక్తికరంగా అనిపించింది… చాలా కుటుంబాల్లో డబ్బు మూలుగుతూ ఉండవచ్చుగాక… సొంత వ్యాపార వ్యవహారాల్లోనే ఊపిరి సలపనంతగా పని ఉండవచ్చుగాక… కానీ వ్యక్తిగత అభిరుచిని, కళల్లో ప్రావీణ్యాన్ని అటక మీద పారేయకుండా… లైఫ్‌లో వాటినీ పార్ట్‌గా చేసుకోవడం బాగుంది… చేసే పనుల్లో పర్ఫెక్షన్ అంటారా..? ఒక్కసారి ఆ మొదటి ఫోటో చూడండి… అర్థం అయిపోతుంది కదా… అదీ సంగతి…! (ఏదో ఇంగ్లిషు పత్రిక తనను కోలీవుడ్ సహాయనటి అని రాస్తే నవ్వొచ్చింది సుమీ…)
Share this Article