A WORLD CLASS WRITER OF OUR TIME…. డి సెంబర్ 9 అల్లం శేషగిరిరావు పుట్టినరోజు… విశాఖ అంటే సముద్రమూ, ఆంధ్రా యూనివర్సిటీ, యారాడకొండ మదిలో మెదిలినట్టే , తెలుగులో వేట కథలు అంటే పూసపాటి కృష్ణంరాజు, అల్లం శేషగిరిరావు, కే ఎన్ వై పతంజలి గుర్తొస్తారు. శేషగిరిరావు, ఆయన కథలు నాకు బాగా తెలుసు. ఆయనకి నేను కొద్దిగా తెలుసు. ఆయన తక్కువ మాట్లాడతారు. ‘రావోయి చాయ్ తాగుదాం’ అని కబుర్లు కొట్టే రకం కాదు. ఒకవేళ కూర్చుని చాయ్ తాగినా, మనమే మాట్లాడాలి. ఊc కొడతాడు. చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. సన్నటి బక్కపల్చని సాదాసీదా మనిషి. సన్నటి – బక్కపల్చని – రెండూ ఒకటేగా అని గొడవ పెట్టుకోకండి. దాన్ని Emphasis అంటాం గదా.
నెలలో చివరి వారం గడవని క్లర్కు సూర్యారావు లాగా, సుఖం అంటే ఎలా వుంటుందో తెలుసుకోలేకపోయిన ‘అయినాపురం కోటేశ్వరరావు’ లాగా వుంటారు అల్లం శేషగిరిరావు గారు. వరడు, డెత్ ఆఫ్ ఎ మేనీటర్ లాంటి పాఠకుల ప్రాణాలు తోడేసే కథలు రాసిన ‘నరహంతక కథకుడు’ ఈయనే అని ఎవరికన్నా పరిచయం చేస్తే “పోదురూ బడాయి. ఈ వెర్రిబాగుల వాడేంటీ? ఆ కథలు రాయడమేంటి?” అని నవ్విపోతారు. అంత unassuming గా వుంటాడు. అసలంత Humility అవసరమా అనిపించేలానూ వుంటాడు.
ఆంగ్ల సాహిత్యం మీద గట్టి పట్టున్నవాడు. “నేను కొద్దోగొప్పో ఆంగ్ల సాహిత్యాన్ని చదివేను. మహర్షి టాల్ స్టాయ్ నుంచి CLASSICAL PESSIMISM పొందుపరిచిన CAMUS వరకూ, HARPERLEE దగ్గర నుంచి అరుంధతీరాయ్ వరకూ, TONI MORRISON నుంచి BENEKOV వరకూ ఎందరో అభిమాన రచయితలున్నారు – Different School of Thoughts కి చెందినవారు. JOSEPH BOURAD కూడా నా అభిమాన రచయితే. ఆయన OBLIQUE NARRATION నాకు చాలా ఇష్టం … ఇలా ఎందరో మహానుభావుల రచనలు చదివేను – ఏమో! బహుశా వాళ్ల ప్రభావం నాలో అంతర్లీనంగా వుందేమో!” అని శేషగిరిరావు ఒక సందర్భంలో అన్నారు.
Ads
అల్లం శేషగిరిరావు వచనంలో ఆడంబరమూ, షోకూ, విరుపూ, విన్యాసం ఏమీ వుండవు. స్థిరంగా నేల మీదే రెండు కాళ్ళతో నడిచే వచనం అది. అలా ఎలాంటి చమత్కారమూ లేకుండా, నిర్దయగా, నిర్మమకారంగా వాక్యం రాయడానికి చాలా తెగువ వుండాలి. వైకం బషీర్, కొడవటిగంటి కుటుంబరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య లాంటివాళ్లు అలాంటి విద్యలో ఆరితేరినవాళ్ళు. Flat గా pepper and salt లేని చప్పని మాటలు పేరుస్తున్నట్టే వుంటుంది. అలాంటి పదాలతోనే పొందికగా అల్లడమే ఒక trap. క్రమంగా ఒక భావసంస్కారం unfold అవుతుంది. హృదయ నైర్మల్యం మానవత్వాన్ని చేతులు సాచి పిలుస్తుంది.
వాక్యం వెంట వాక్యం…ఆ జీవద్భాష మనసునొక కరుణామయమైన రసజగత్తులోకి తీసుకెళుతుంది. చాలాసార్లు మనిషికి మిగిలే నైరాశ్యాన్నే పాఠకుడికీ మిగిల్చి కథ ముగిస్తారాయన. శిల్పం పైకి విశేషంగా ఏమీ అన్పించనట్టే వుంటుంది. వస్తువు, శిల్పం రెండిటికీ సమతూకంలో ప్రాధాన్యత యిచ్చే తీరు శేషగిరిరావుని అరుదైన రచయితగా నిలిపింది. ‘మృగతృష్ణ’లో బైరిగాడు, ‘అభిశప్తులు’లో రామారావు, ‘నరమేధం’లో ధక్కువాడు – ప్రిన్స్ రవీంద్రలు తమని వేధిస్తున్న సమస్యలకి చావునే పరిష్కారంగా ఎంచుకుంటారు. ది డెత్ ఆఫ్ ఎ మేనీటర్, రుద్రనేత్రం, పులిచెరువులో పిట్టల వేట – కథల్లో అనూహ్యంగా మృత్యువే మనిషిపై మెరుపు దాడి చేస్తుంది. చావుని రచయిత ఒక మెటఫర్ గా వాడారు.
అల్లం శేషగిరిరావుని ఆంధ్రా JIM CORBETT అనీ, వేటకథల స్పెషలిస్టు అనీ చాలామంది పొగిడారు. మనుషుల్ని వేటాడి తినే పులుల్ని ఎంత నేర్పుగా మట్టుబెట్టాలో, దానికెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో CORBETT కథల్లో వివరంగా చెబుతారు. శేషగిరిరావు వేటకథే నడిపిస్తూ కనిపించని శక్తులేవో మనిషిని వేటాడటం అసలు విషాదమని కథ చివరి మలుపులో చెబుతారు. ఈ కథల్లోని హింస, నిరాశ, దిక్కుతోచని స్థితి, మరణం… మనల్ని చిమ్మచీకటి తెరలై కమ్ముకుంటాయి. బతుకు వినోదం లాంటి వేట కానేకాదని, ఎటునుంచి దాడి చేస్తుందో చివరిదాకా తెలియని మృత్యువనీ తేల్చిచెబుతాయి. శేషగిరిరావు మొత్తం 17 కథలు మాత్రమే రాశారు. వరడు, డెత్ ఆఫ్ ఎ మేనీటర్, చీకటి కథలు ఎప్పటికీ మరిచిపోలేనివి.
1980 – 81లో నేను విశాఖ ‘ఈనాడు’లో పనిచేస్తున్నపుడు అల్లం శేషగిరిరావు కథా సంపుటి ‘మంచిముత్యాలు’ ఆవిష్కరణ సభకి వెళ్ళాను. 30, 40 మంది దాకా రచయితలు, కవులూ వచ్చారు. కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి మాట్లాడారు. పుస్తకావిష్కరణ తర్వాత కారా కథల్ని మెచ్చుకుంటూ రెండుమూడు నిమిషాలు మాట్లాడారు. తర్వాత రావిశాస్త్రి – ఇవి నిజాయితీ నిండిన, నిరలంకారమైన గొప్ప కథలనీ – అన్నారు. ఆయనా రెండు నిమిషాలే మాట్లాడారు. ఇప్పుడు అల్లం శేషగిరిరావు కథల గురించి మాట్లాడతారని ఒకాయన రచయితని వేదిక మీదికి పిలిచారు. ఎంతో బిడియంతో, యిబ్బందిగా మైకు ముందుకొచ్చారు. “నేనింక పెద్దగా చెప్పేదేమీ లేదు. అందరికీ థాంక్స్” అని శేషగిరిరావు ముగించారు. ఆ సాహిత్య సభ కేవలం పది నిమిషాల్లో ముగిసిపోయింది. వచ్చినవాళ్ళకి ఇంకొద్దిసేపు కూచోవాలో, వెళిపోవాలో అర్థం కాలేదు. కాసిని కబుర్లు, టీతో బై చెప్పుకుని బైటపడ్డాం.
ఈనాడు ఆఫీసుకి వెళ్లి వార్త రాసి ఇచ్చేసి ఇంటికి వెళిపోయాను. మర్నాడు మధ్యాహ్నం వార్తలు రాసుకుంటుంటే, ‘హలో, మీకోసం ఎవరో వచ్చారు’ అన్నారు మా న్యూస్ ఎడిటర్. విశాఖలో నాకోసం ఎవరొస్తారు.. అనుకుంటూ బైటికి వస్తే, అక్కడ అల్లం శేషగిరిరావు గారు నిలబడి వున్నారు. అప్పటికే మూడు నాలుగు కథలు చదివి వుండటం వల్ల ఆయనెంత మహానుభావుడో నాకు తెలుసు. “ఈరోజు పేపర్లో వార్త మీరు రాసిందేనా?” అని ఎంతో అణకువతో అడిగారు. అవునని చెప్పాను.
‘ఎందుకలా అడుగుతున్నారు?’ అన్నాను. “అహా.. ఏంలేదు. వోసారి చూసిపోదామని” అన్నారాయన. నన్ను అభినందించటానికి ఆయన వచ్చారు. వార్త చక్కగా రాశారు. Thanks a lot అనడానికీ ఆయనకి సిగ్గే, ఇబ్బందే. “మరి వెళ్తాను” అని చెప్పి, శేషగిరిరావు తిరిగి నడుస్తూ వెళిపోయారు. ఆయన్నే చూస్తూ ఎడిటోరియల్ సెక్షన్ ముందు నిలుచుండిపోయాను. అదే ఆయన్ని చివరిసారి చూడ్డం. 40 సంవత్సరాలు అయిపోతోంది. ‘మంచిముత్యాలు’లో అన్నీ అద్భుతమైన కథలే. ‘అరణ్యఘోష’ నాకు దొరకలేదు.
రచయిత కూడా మార్కెటింగ్, సేల్స్ ప్రమోషన్ చేసుకోవాలన్న స్పృహలేని వెర్రిబాగుల రచయిత శేషగిరిరావు. ఇప్పటికీ ఆయన గురించి తెలిసినవాళ్లు, ఆయన కథలన్నీ చదివినవాళ్ళు just a grim minority. 1981లో ‘మంచిముత్యాలు’కి నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం వచ్చినపుడు, – వోహో శేషగిరిరావు అనేవాడు ఒకడున్నాడని చాలామందికి తెలిసింది. ఆయనకి రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డూ వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన కథల మీద పీహెచ్డీ, ఎంఫిల్ చేశారు కొందరు.
శేషగిరిరావు వొరిస్సా గంజాం జిల్లా చిత్రపురంలో 1934 డిసెంబర్ 9న జన్మించారు. 2000 సంవత్సరం జనవరి 3న మనల్ని విడిచి వెళిపోయారు. నూరేళ్ళ తెలుగు కథపై కవి ఆవంత్స సోమసుందర్ 30 ఏళ్ళ క్రితం, ‘తెలుగు కథా శతాబ్దానికి అటూ, ఇటూ’ అని ఒక వ్యాసం రాశారు. అందులో అటు గురజాడ – ఇటు మా అల్లం శేషగిరిరావు .. అని డిక్లేర్ చేశారు. ఎవరినైనా మెచ్చుకోవటం అస్సలు గిట్టని సోమసుందర్ ఇలా రాయటం చాలా విశేషం. అదీ శేషగిరిరావు స్థాయి!
ఆయన రాసిన ఆఖరి కథ ‘చీకటి’. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ప్రచురించారు. తర్వాత వారం ఆ కథని సమీక్షిస్తూ, ‘అల్లం శేషగిరిరావు ‘చీకటి’ మాస్టర్ పీస్’ అని అన్నారు పురాణం. అయితే ఆ కథలో ఇంగ్లీషు పదాలు అవసరం లేకపోయినా ఎక్కువగా వాడిపారేశారని కంప్లయింట్ చేస్తూ, సాహితీవేత్త ప్రొఫెసర్ చందు సుబ్బారావు ‘ఇంగ్లీషు చీకటి’ అని విమర్శ రాశారు. పురాణం ఆ వ్యాసాన్ని కూడా జ్యోతిలో ప్రచురించారు.
ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చదివిన శేషగిరిరావు, రైల్వే లో ఆఫీసు సూపరింటెన్డెంట్ గా పనిచేశారు. విశాఖలో కవులు, రచయితల ఈవెనింగ్ పార్టీలకి ఎప్పుడైనా వెళుతుండేవారు. అప్పుడు జిమ్ కార్బెట్ కథల గురించి చెప్పేవారు. అయినా పొదుపుగా, క్లుప్తంగానే మాట్లాడేవారు. ఉద్యోగ విరమణ చేశాక, రెండేళ్ల తర్వాత ఆయన ఒక్కగానొక్క కూతుర్ని చూడటం కోసం బెంగుళూరు వెళ్లారు. కొన్నాళ్ళు కూతురి ఇంట్లో వుండి, 2000 సంవత్సరం జనవరి 2న విశాఖ వెళ్ళడానికి బెంగుళూరులో రైలెక్కారు.
3వ తేదీ ఉదయం ఆ రైలు వాల్తేరు రైల్వే స్టేషన్ చేరింది. బెర్త్ మీద శేషగిరిరావు చనిపోయి వున్నారు. రైల్వే సిబ్బంది ఆయన్ని గుర్తించి, దేహాన్ని కిందికి దింపి, బంధువులకు విషయం చెప్పారు. కాస్త సెంటిమెంటల్ గా చూస్తే, ఆయన చివరి కథ ‘చీకటి’ కావడం, చివరి ప్రయాణం రైల్లోనే ముగిసిపోవడం… ఆయన ఫిలాసఫీ లాగానే అకస్మాత్తుగా మృత్యువు ఎగిరి మీదికి దూకడం – అచ్చూ శేషగిరిరావు గారి చాలా కథల్లో చివరి వాక్యాల్లానే…!
ఒక అరణ్య రోదన…
విజ్ఞత, రసజ్ఞత కలవాళ్లమే అయినా కృతజ్ఞతకి వీలయినంత దూరంగా వుంటున్నాం. కృతఘ్నులుగా, కృతకంగా మిగిలిపోతున్నాం అనిపిస్తోంది. బతుకులోని wonder ని చూస్తూ కూడా, ఎందుకిలా బండబారిపోతున్నాం? అల్లం శేషగిరిరావు లాంటి ఒక అద్భుతమైన రచయితని తలుచుకోడానికే టైమ్ లేదు, పట్టదసలు! ఈ యిరవై, పాతికేళ్లలో శేషగిరిరావు గురించి దినపత్రికల్లో, సాహిత్య పేజీల్లో ఎవరైనా రాసినట్టు నాకైతే గుర్తులేదు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో శేషగిరిరావు రచనలపై ఒక సభ, సెమినార్ ఎక్కడన్నా జరిగాయా? సాహిత్యం మార్కెటింగ్ సరుకుగా మారిపోతున్న విషాద సమయమిది.
కవిత్వం అంటే మందు పార్టీ, మంచి సాహిత్యం అంటే మటన్ బిర్యానీ, డిన్నర్లుగా మారిపోయిన డెలిబరేట్ సెలబ్రేషన్స్ ని చూస్తూనే వున్నాం. అల్లం శేషగిరిరావుని స్మరించుకోకపోతే, ఆయన రాసిన కథల్ని చదువుకోకపోతే, ఆ కథల్లోని మృత్యువుని, ఆనందాన్ని, విషాదాన్ని, సౌందర్యాన్నీ గుండెల్లో నింపుకోకపోతే, జీవితాన్ని పణంగా పెట్టి ఆయన ఆవిష్కరించిన సత్యంతో, జీవనతత్వంతో ఆత్మని నింపుకోకపోతే శేషగిరిరావు గారికి పోయేదేం లేదు. మనమే – జీవం లేని నవ్వుల్లా, పరిమళం లేని పువ్వుల్లా, పెద్దాయన అన్నట్టు వొట్టి వెధవాయిలంగా మిగిలిపోతాం. అలా మూర్ఖులుగానే మిగిలిపోతే పోలా!!
చిట్టచివరి మాట :
పది కథలు రాసిన వేలుపిళ్ళై, సి రామచంద్రరావు, 17 కథలు రాసిన అల్లం శేషగిరిరావు, 23 కథలు మాత్రమే రాసిన చాగంటి సోమయాజులు తెలుగు సాహితీ సాగరంలో యారాడకొండ లాగా ఎప్పటికీ నిలిచి వుంటారు, ధ్యానం చేస్తూనో… సముద్ర స్నానం చేస్తూనో…! – TAADI PRAKASH (9704541559)
Share this Article