… దిల్లీలో ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌తోపాటు ఉత్తమ నటీమణులుగా అలియాభట్ (గంగూబాయ్ కాఠియావాడీ), కృతిసనన్ (మిమి) అవార్డులు అందుకున్నారు. ఆ కార్యక్రమాన్ని చాలామంది టీవీల్లో చూశారు. మీ అందరికీ ఒక ప్రశ్న!
తన సినిమాకి ‘హీరోయిన్’ కావాలని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో యాడ్ ఇచ్చాడు. దాదాపు 400 దాకా అప్లికేషన్లు వచ్చాయి. వాళ్లని విడతలవారీగా రమ్మని పిలవడం, చక్కగా మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకోవడం, నమ్మకం కలిగించడం, ఆ తర్వాత మరింత దగ్గరై వారి చేత ఆడిషన్స్ ఇప్పించి వీడియోలు తీయడం.. ఇదే అతని కార్యక్రమం. అతని పక్కనే సహాయకురాలు బాలజ్యోతి ఉండేది. దర్శకుడి నమ్మకమైన మాటలు, పక్కనే మరో సహాయకురాలు. ఇదేదో నిజమైన వ్యవహారమే అనుకున్నారు చాలామంది అమ్మాయిలు. వారి వెంట వచ్చేవారూ అలాగే నమ్మారు.
అలా కొందరిని నమ్మించాక నటన పేరుతో వారిని ముట్టుకుని, ముద్దు పెట్టుకుంటూ, కౌగిలించుకుంటూ వీడియోలు తీసేవాడు. ఇదేంటని అడిగితే, “నేను తీసే సినిమాలో నటన ఇలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు జాతీయ అవార్డు వస్తుంది” అని అనేవాడు. జాతీయ అవార్డుకూ, ఈ సన్నివేశాలకూ సంబంధం ఏమిటని అడిగితే వారికేదో సర్ది చెప్పేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలు అడ్డుపెట్టుకుని వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
Ads
అడిగిన డబ్బు ఇవ్వకపోతే వీడియోలు లీక్ చేస్తానని బెదిరించేవాడు. కొందర్ని బలవంతపెట్టి నగ్న వీడియోలు తీసేవాడు. అలా కొన్ని నెలలపాటు ఈ వ్యవహారం నడిచింది. దాదాపు 300 మంది అమ్మాయిలు అతని వలలో చిక్కారు. బయటికి చెప్తే తమ వీడియోలు లీక్ అవుతాయని భయపడి ఎవరూ నోరు మెదపలేదు.
నేరం ఎక్కువ కాలం దాగదు కదా! గతేడాది ఒక అమ్మాయి సినిమాలో అవకాశం కోసం వేల్ సత్రియన్ దగ్గరకు వెళ్లింది. రూ.30 వేలు ఇస్తే సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అంత డబ్బు తన దగ్గర లేదు అందామె. “సరే! మా ఆఫీసులో పని చేసేందుకు ఒక మనిషి కావాలి. చేరిపో” అన్నాడు. చేరింది. అక్కడ జరిగే వ్యవహారం ఆమెకు తెలియదు. కానీ అతని పద్ధతి, ప్రవర్తన మీద అనుమానం కలిగింది.
కొన్నాళ్లకు ఆ ఉద్యోగం మానేయాలనుకుని తనకు రావాల్సిన మూడు నెలల జీతం అడిగింది. అతను రేపు, మాపు అంటూ తిప్పాడు. ఎలాగైనా తన జీతం పొందాలన్న ఆలోచనతో ఆమె ఆ ఆఫీసులోని ఫైల్స్, వివరాలు చూస్తూ ఉన్నప్పుడు మోసపోయిన అమ్మాయిల ఫోటోలు, నగ్న వీడియోలు కంటబడ్డాయి. వేల్ సత్రియన్ గుట్టు బయటపడింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన తమిళనాడువ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 300 అమ్మాయిలు బాధితులనే విషయం ప్రస్తుతానికి తెలిసినా, ఆ సంఖ్య మరింత పెరగొచ్చు అని అంటున్నారు. పోలీసులు వేల్ సత్రియన్ మోసాల గురించి విచారణ చేస్తున్న సమయంలో ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో ఒక అమ్మాయి వాళ్ల అమ్మతో అతను మాట్లాడుతూ “నాది వాస్తవికమైన శిక్షణ. నేను మీ అమ్మాయిని ముట్టుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను. కౌగిలించుకుంటాను. ఇదంతా ఈ సినిమా కోసమే! మీరు సరే అంటే శిక్షణ కొనసాగిస్తాను” అని చెప్పడం వినిపించింది. అతను ఎంత పకడ్బందీగా తన మోసాన్ని ఆచరణలో పెట్టాడో ఈ ఆడియో ద్వారా అందరికీ అర్థమైంది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వేల్ సత్రియన్‌కి సహాయకురాలిగా పని చేసిన 23 ఏళ్ల జయజ్యోతి కూడా అతని బాధితురాలా, లేక అతనితోపాటు ఆమె కూడా ఇందులో భాగంగా మారిందా అనేది ఇంకా తేలలేదు. పోలీసులు ఆమెనూ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెది విరుదానగర్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యాయ కళాశాలలో చేరడానికి సేలం వచ్చింది. ఆ క్రమంలో వేల్ సెత్రియన్‌ని కలిసింది. “కాలేజీలో చేరడానికి నేను నీకు సాయం చేస్తాను. నాకు నువ్వు సహాయకురాలిగా ఉండు” అని అతను జయజ్యోతికి చెప్పాడు. అలా అతని సినిమా కంపెనీలో ఆమె చేరింది. అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి ఆమెకు తెలుసా, తెలియదా, తెలిసినా బయటకు చెప్పలేదా? ఆమెనూ అతను బెదిరించాడా అనే విషయాలు విచారణలో తేలాలి.
“నేను చెప్పినట్టు చేస్తే జాతీయ అవార్డు వస్తుంది” అనగానే ఇన్ని వందల మంది అమ్మాయిలు అతని మాటలు నమ్మడం చాలా చిత్రంగా ఉంది. నటించడం, అందులో రాణించడం అంత సులభమైన విషయాలు కావు. కానీ ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. దానికి మనం ఎవరం అతీతులం కాదు. మన చుట్టూ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని జాగ్రత్త పడటం, మరికొందర్ని అప్రమత్తం చేయడమే మనం ఇప్పుడు చేయాల్సిన పని… – విశీ
Share this Article