ఇప్పుడేం చేయాలి..? అల్లరి నరేష్‌లో మరో డైలమా… కామెడీ హీరోగా చేసీ చేసీ, అది బాగానే సాగినంతకాలం సాగింది… తరువాత మొనాటనీ వచ్చింది, కామెడీ తీరు కూడా మారింది… తన కామెడీ మారలేదు, దాంతో జనం తన సినిమాలు చూడటం మానేశారు, జనం నన్ను కామెడీ చేయడం వద్దంటున్నారేమో అనుకుని, సీరియస్ పాత్రల వైపు మళ్లాడు…
నాంది, మారేడుమల్లి వంటి ఏవో పాత్రలు చేశాడు… స్వతహాగా గొప్ప నటుడేమీ కాకపోయినా, ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలడు… ఎందుకోగానీ తనకు ఆ సీరియస్ పాత్రలూ అచ్చిరాలేదు… ఏమో, జనానికే నరేష్ ట్రాన్స్‌ఫార్మేషన్ నచ్చలేదేమో… ఎహె, ఇదంతా కాదు, నా ఒరిజినల్ జానర్‌కు నేను వెళ్లిపోతాను అని ఫిక్సయి పోయి… అప్పట్లో సూపర్ హిట్టయిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్‌తో ఓ సినిమా తీశాడు…
బ్యాక్ టు బ్యాక్ నవ్వులు, పాత నరేష్‌ను చూస్తారు, ఔట్ అండ్ ఔట్ కామెడీ వంటివి ఎంత ఊదరగొట్టినా… సినిమా అంత పెద్దగా రక్తికట్టలేదు సరికదా… నరేష్ అటూఇటూ గాకుండా అయిపోయాడు… కామెడీ, సీరియస్ ఏదీ గాకుండా ఇంకేం చేయాలి..? ఇంకెటు పోవాలి..? మళ్లీ డైలమా స్టార్ట్ అవుతుందేమో…
Ads
నిజానికి కొన్ని ప్లస్ పాయింట్లు ఏమిటంటే..? నరేష్ ఎప్పుడూ మాస్ హీరోయిజం వైపు అంటే ఫార్ములా, ఇమేజీ బిల్డప్పుల కథల జోలికి పోలేదు… తన సినిమాలు ఏవీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బందిగా చూసేట్టుగా వల్గారిటీతో అస్సలు ఉండవు… ఉన్నంతలో కామెడీ టైమింగు బాగానే ఉంటుంది… బిల్డప్పులు తక్కువ కాబట్టి ప్రేక్షకులకూ అజీర్ణం సమస్య రాలేదు, ఇప్పుడూ అంతే…
ఆ ఒక్కటీ అడక్కు సినిమా నీట్‌గా ఉంది… స్టోరీ బేస్ లైన్ కూడా భిన్నమైందే… మేట్రిమోనీ సైట్లు చేసే మోసాలు, హీరోయేమో పెళ్లికాని ప్రసాదు… ఆల్రెడీ తమ్ముడికి పెళ్లయింది, తనకేమో కాలేదు, కొలువుంది, ఐనా సంబంధాలు రావు, ఆ అవస్థల మీద గతంలో కూడా సినిమాలు వచ్చాయి కానీ మేట్రిమోనీల డ్రామాలు ప్రేక్షకుడికి ఇట్టే కనెక్ట్ కావల్సిన పాయింట్… సరిగ్గా ప్రజెంట్ చేస్తే..!
హీరోయిన్ ఫేక్ పెళ్లికూతురు అనేదీ ఇంట్రస్టింగు పాయింటే… ఇదే పాయింట్ బేస్‌గా మంచి కామెడీ సీన్లు అల్లుకుంటే కథ బాగానే నడిచేది… కానీ కామెడీ సీన్లు సీన్లుగా చూసినప్పుడు బాగానే అనిపించినా ఓవరాల్‌గా అంతగా మెప్పించేలా కథనం లేదు… ఒక పాట తప్ప సంగీతం సోసో… హీరోయిన్ చాన్నాళ్లు ఫీల్డ్‌లో ఉండటం కష్టమే… నరేష్ పక్కన ప్చ్, కుదరలేదు…
నిజానికి కామెడీ తీరు మారింది… ఏదో పాత తరహా కామెడీని జనం పట్టించుకోవడం లేదు… జబర్దస్త్, శ్రీదేవి డ్రామాకంపెనీ, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎట్సెట్రా బోలెడు టీవీ షోలు… వాటినే జనం పెద్దగా చూడటం లేదు… ఇప్పుడు కామెడీ అంటే టిల్లూ టైపు… ఇదే టైపులో టిల్లూ 100 అని పార్ట్-3 తీసినా చూస్తారనేదీ డౌటే… అప్పట్లో జాతిరత్నాలు, ఇప్పుడు అలాంటిదే మళ్లీ తీసినా జనం చూడరేమో… కామెడీకి సీరియస్‌నెస్ జోడించినా, ఏదైనా క్రైమ్ లేదా హారర్ జానర్ తగిలించినా సరే జనం చూడటం లేదు… కష్టమే..!
Share this Article