.
చాలా సినిమాలు వస్తుంటయ్, పోతుంటయ్… కొన్ని మాత్రమే సమాజంలో ఓ డిబేట్ రేకెత్తిస్తాయి… తాజాగా ఓ సినిమా… పేరు ఆప్ జైసా కోయీ… చాలామంది అభ్యుదయ సమీక్షకులు చప్పట్లు కొట్టారు… ప్రత్యేకించి జెండర్ ఈక్వాలిటీ… అదీ ఆస్తులు, సౌకర్యాల ఎట్సెట్రా గాకుండా ఫీలింగ్స్‌కు సంబంధించి…
కొందరు అబ్బే, బోర్ బాసూ అని పెదవి విరిచారు… సరే, ఎవరి టేస్టు వాళ్లది… ఎవరి ఓపిక వాళ్లది… కానీ ఫేస్‌బుక్‌లో మిత్రుడు Aranya Krishna....
సమీక్ష బాగుంది… అది యథాతథంగా… ఇలా…
Ads
ఆధునిక కాలం స్త్రీ పురుషులు ఇద్దరికీ ఎదగటానికి దాదాపు సమాన అవకాశాలు ఇస్తున్నా స్వేచ్ఛ, ఆధిపత్యం, నిర్ణయాధికారం వంటి విషయాల్లో జెండర్ ప్రయోజనాల్ని పురుషుడే ఎక్కువ అనుభవిస్తున్నాడు. స్త్రీలు ఎక్కడైనా పురుషుల్లా ప్రవర్తిస్తే, తమ అస్తిత్వానికి సంబంధించిన స్వేచ్ఛ తీసుకుంటే, పురుషుడంత ధీమాగా, ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటే అది సమాజాన్ని కల్లోలపరిచే నైతిక సమస్యగా మారుతుంది.
ఆమె కేరక్టర్ జడ్జ్ చేయబడుతుంది. వ్యక్తిత్వం పరీక్షకి గురవుతుంది. అంటే స్త్రీ విద్య, సంపాదన ఆమె జీవన సంతుష్ఠి కోసం కాక పురుష కేంద్రకమైన కుటుంబ ప్రయోజనానికే ఉపయోగపడాలన్న మాట. ఈ సటిల్ విషయాన్ని చక్కగా డీల్ చేసిన హిందీ సినిమా ‘ఆప్ జైసా కోయీ’…
నలభై రెండేళ్లొచ్చినా పెళ్లి కాని ఓ వ్యక్తి ఈ అతి సాధారణమైన డేటింగ్ యాప్ ని ఆశ్రయించి, ఓ స్త్రీతో రొమాంటిక్ సంభాషణ చేస్తాడు. ఆ తరువాత అతనికి యాప్ బైట పరిచయమైన ఒకామెతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఐతే తనకి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీతోనే తాను రొమాంటిక్ సంభాషణ చేశాడని తెలుసుకొని హతాశుడైపోతాడు…
ఆమె కేరక్టర్ ని జడ్జ్ చేస్తాడు కానీ తానూ అదే పని చేశానని అనుకోడు. మగవాడిగా తాను ఎలా వున్నా తన స్త్రీ మాత్రం మనసా వాచా కర్మణా వర్జిన్ అయి వుండాలని అనుకుంటాడు. ఆమె ఎంత నచ్చచెప్పినా వినడు. కొన్నాళ్ల తరువాత పెద్ద మనసు చేసుకొని తాను ఆమెని క్షమిస్తున్నానని, కొన్ని పరిమితులతో ఆమెకి స్వేచ్ఛ ఇస్తున్నానని మళ్లీ ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది.
తన కుటుంబంలోని వదిన, అన్న కూతురు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు అతని దృక్పథాన్ని మార్చేస్తాయి. ఒక మారుతున్న మనిషిగా మళ్లీ తన ప్రియురాలి దగ్గరకు వెళతాడు. కథగా సింపుల్ గా వున్నప్పటికీ అది చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు ఎఫెక్టీవ్ గా వున్నాయి.
- ఇందులో హీరో అన్న పాత్ర చాలా సహజంగా వుంది. మామూలు ప్రమాణాలతో చూస్తే చెడ్డవాడేమీ కాదు కానీ ఒక స్త్రీగా తన భార్యకూ ఒక మనసుంటుందని, అభిరుచులుంటాయని, ఆమెకీ కొన్ని టాలెంట్స్, ఆమె హృదయంలో ప్రేమ, రొమాంటిక్ ఐడియాస్ వుంటాయని గుర్తించలేడు.
అకడమిక్‌గా కూతురు సాధించిన విజయాల పట్ల ఆనందం కన్నా వంట రానందువల్ల రేపు పెళ్లైతే అత్తవారింట్లో ఇబ్బంది పడుతుందన్న ఆందోళనే ఎక్కువగా వుంటుంది అతనిలో. స్త్రీలు తమ అస్తిత్వ విలువను గుర్తించే క్రమంలో ఎంతో ఘర్షణకు గురవుతారు. ఐతే వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే కాలం కూడా వచ్చిందని, పురుషుల మనస్తత్వంలో, ప్రవర్తనలో రావలిసిన అవసరాన్ని ఈ సినిమా చెబుతుంది.
మొత్తం మీద స్త్రీ పురుష సంబంధాల్లోని ద్వంద్వ విలువల మీద విమర్శని ఎక్కుబెడుతూ, పెరుగుతున్న స్త్రీ చైతన్యం కారణంగా స్త్రీ పురుష సంబంధాల్లో ఆధిపత్యపు విలువల స్థానంలో నిజమైన ప్రేమ, ప్రజాస్వామికత రాకపోతే కుటుంబ వ్యవస్థ బీటలు వారొచ్చని కూడా ఈ సినిమా పరోక్షంగా చెబుతుంది.
- మాధవన్ బాగానే చేశాడు కానీ ఆయనకున్న గ్లామర్ వల్ల ఆ రోల్ కి ఆయన సూట్ కాలేదనిపించింది. హీరోయిన్ గా ఫతిమా సనా షేక్ చాలా చక్కగా చేసింది. హీరో అన్న, వదినలుగా చేసినవారు అదరగొట్టేశారు. సినిమా కొంచెం స్లోగా నడిచినప్పటికీ బోర్ కొట్టదు. నెట్ ఫ్లిక్స్ లో వుంది. ఒకసారి చూడదగ్గ సినిమా…
Share this Article