Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…

October 11, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. నా హృదయంలో నిదురించే చెలీ, కలలతొనే కవ్వించే సఖీ … 1962 లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన ఆరాధన సినిమాలోని పాట ఇది . కళ్ళు లేకపోయినా మనసు మనసు ఆరాధించుకుంటూ ఉంటాయని చెప్పిన రొమాంటిక్ క్లాసిక్ . అక్కినేని , సావిత్రి , జగ్గయ్య కాంబినేషన్లో వచ్చింది .

నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై నా ప్రాణమై … 1976 లో వచ్చింది మరో సూపర్ క్లాసిక్ ఆరాధన సినిమాలో పాట ఇది… యన్టీఆర్ , వాణిశ్రీ , జగ్గయ్య కాంబినేషన్లో వచ్చింది .

Ads

మళ్ళా 11 ఏళ్ళకు… అరె ఏమయిందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అంటూ చిరంజీవి , సుహాసిని , రాధిక కాంబినేషన్లో మరో రొమాంటిక్ క్లాసిక్కుగా మిగిలింది మూడో ఆరాధన …

1+2 సినిమా . చిరంజీవి సుహాసిని మధ్య , రాధిక చిరంజీవి మధ్య ఆరాధన కూడా అలాగే ఉంటుంది . ఆరాధన అంటేనే అర్థం అది కదా ! మనసు మనసుతో మరో మనసుని ఆరాధిస్తుంది . అది ఎలా ఉంటుందో ఆరాధించే మనసుకే తెలుస్తుంది . ఈ సినిమా కధను అలాగే తెరకు ఎక్కించాడు భారతీరాజా .

వ్యాపారపరంగా సక్సెస్ కాకపోవచ్చేమో కానీ నటనాపరంగా ముగ్గురూ నట విశ్వరూపాలనే చూపారు . చాలా సీన్లు గుండెల్ని పిండేస్తాయి .‌ ముగ్గురిలో చిరంజీవే బాగా నటించాడు అనుకునే లోపు సుహాసిని అదరగొట్టే సీన్లు వచ్చేస్తాయి . వీళ్ళిద్దరూ భలే నటించారు అనుకుంటూ ఉండగానే రాధిక అద్భుతంగా నటించిన సీన్లు వచ్చేస్తాయి . సినిమా అంతా పోటాపోటీగా ముగ్గురు నటించారు . ముగ్గురికీ హేట్సాఫ్ .

తమిళ సినిమా కడలోరా కవితైంగళ్ కు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో సత్యరాజ్ , రేఖ అనే తెర పేరుతో పాపులర్ అయిన సుమతి జోసఫిన్ నటించారు .‌ మన తెలుగు సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్లో 1987 మార్చిలో వచ్చింది .

కడలి తీరాన ఓ పల్లెలో అల్లరిచిల్లరిగా తిరిగే మొరటోడు పులిరాజు . ఉద్యోగార్ధం వచ్చిన జెన్నిఫర్ని ఆ మొరటోడు ఆరాధించటం , అతని మరదలు గంగ అతన్ని ఆరాధించటం , మధ్యలో జెన్నిఫర్ తండ్రి ఆమెను తీసుకుని పట్నం పోవటం , పిల్లిరాజు మళ్ళా దేవదాసు కావటం , పాత కక్షదారులు హత్యాప్రయత్నం చేయటం , క్లైమాక్సులో జెన్నిఫర్ మొరటోడి వద్దకు చేరటంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది .

ఈ సినిమాకు ఇంత పేరు రావటానికి మరో కారణం ఇళయరాజా మెలోడియస్ ట్యూన్లు , బీట్లు . అరె ఏమయ్యిందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది పాట ఎంత సూపర్ డూపర్ హిట్టో మనందరికీ తెలిసిందే . ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో , తీగెనై మల్లెలు పూచిన వేళ , ఝముకు ఝమా ధముకు ధమా పాటలు బాగా హిట్టయ్యాయి .

ఆత్రేయ , సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు , బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనో గాత్రాలు ఈ సినిమా పాటల్ని ప్రేక్షకులు ఈరోజుకూ మరచిపోకుండా చేసాయి . ఈ సినిమా డైలాగులను యం బాబూరావు వ్రాసారని టైటిల్సులో వస్తుంది . ఈయన వ్రాసిన ఇతర సినిమాల గురించి తెలిసిన వారు చెప్పాలి .

1+2 తర్వాత ప్రధాన పాత్ర డా రాజశేఖర్‌ది . బాగా నటించాడు . గొప్ప పాత్ర అతని సోదరిది . తమిళంలో నటించిన అనూరాధా వాసుదేవే తెలుగులోనూ నటించింది . పాత్రా , నటన రెండూ ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండేవి . కవి తనకు తెలియకుండానే కొన్ని చిరస్మరణీయ పాత్రల్ని సృష్టిస్తుంటాడు . అలాంటి పాత్రే ఇది . ఇతర పాత్రల్లో పి యల్ నారాయణ , డబ్బింగ్ జానకి , సిహెచ్ కృష్ణమూర్తి , భీమేశ్వరరావు , తదితరులు నటించారు .

బి కన్నన్ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . కడలి అందాలను అద్భుతంగా చూపాడు . 1987 మార్చిలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి వీరాభిమానులకు ఎందుకోగానీ నచ్చలేదు . భారతీరాజా , బాలచందర్ వంటి ఆర్ట్ డైరెక్టర్లు ప్రేక్షకులు బుధ్ధిమంతుల్లాగా , క్లాసులో పిల్లల్లాగా సినిమా చూడాలని ఆశిస్తారు .

ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వస్తాడు . సినిమా స్పీడుగా నడవాలని కోరుకుంటాడు . అందులో చిరంజీవి . ఆ స్పీడ్ లేకపోవటంతో కనకం రాలేదు ; పేరొచ్చింది . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
  • రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
  • ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!
  • ‘‘నేనెందుకు అర్చకవృత్తి చేపట్టానంటే…’’ చిలుకూరు రంగరాజన్ కథ…
  • చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…
  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions