గుర్తుంది… మొన్నామధ్య సీటీమార్ అనే సినిమా విడుదలైనప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నం… గోపీచంద్ అనబడే నటుడి పని ఇక అయిపోయినట్టే అని…! ఐనా అది రాస్తున్నప్పుడు ఎక్కడో ఏ మూలో ఇంకాస్త ఆశ ఉండేది, అలనాటి ఆదర్శ దర్శకుడు టి.కృష్ణ కొడుకు కదా, ఆ సోయి ఏమైనా గోపీచంద్‌లో ఉందేమో, బుర్రలో ఆ తెలివి ఎక్కడైనా పిసరంత దాగుందేమో, ఆ నెత్తుటి వాసన ఏమైనా ఏందేమో అని…! నో… లేదు, అలాంటి భ్రమలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు గోపీచంద్… ప్రస్తుతం విడుదలైన ఆరడుగుల బుల్లెట్ సినిమా ఒకరకంగా గోపీచంద్ కెరీర్‌లో దిగిన చివరి తూటా కావచ్చు బహుశా…. ఒకేరోజు వర్ధమాన హీరో, జస్ట్ రెండు సినిమాల వయస్సున్న వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం, బోలెడంత సీనియారిటీ ఉన్న గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ రిలీజయ్యాయి… గోపీచంద్ సినిమాను దేకినోడు లేడు… చివరకు ఫిలిమ్ క్రిటిక్స్ కూడా వదిలేశారు… అదొక సినిమా, పైగా దానికి రివ్యూ అవసరమా అన్నట్టుగా..!! గోపీచంద్ అర్థమైంది కదా, నీ సోయి, నీ అడుగులు, నీ ఆలోచనలు, నీ ఎంపికలు, నీ కెరీర్ ఏ పాతాళంలోకి జారిపోయిందో…
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రిలీజ్ కావల్సిన సినిమా ఇది… ఒకప్పటి పాపులర్ దర్శకుడు గోపాల్… కానీ ఇంకా ఆరోజుల్లోనే ఉండిపోయాడు మహాశయుడు… రెండో మూడో ఫైట్లు, మూడునాలుగు పిచ్చి పాటలు, తిక్క తిక్క గెంతులు, అల్లరి చిల్లర హీరో కేరక్టరైజేషన్, చెత్తా కామెడీ, పాటలు అనగానే ఎగేసుకుని వచ్చి అన్నీ ఊపేసే ఓ వెటరన్ హీరోయిన్, నేనూ ఉన్నానోయ్ అన్నట్టుగా కనిపించే తేలికపాటి విలన్… ఇంకా ఎన్నిరోజులు తీస్తార్రా భయ్ ఇలాంటి దిక్కుమాలిన రొడ్డకొట్టుడు ఫార్ములా సినిమాలు… కాలం మారుతోంది, కథ మారుతోంది, జనం మారుతున్నారు, మీరు మాత్రం ఇంకా ఆ పాతకాలంలో దొర్లుతున్నారు… గోపీచంద్ మంచి నటుడే, కానీ ఏం లాభం..? ఈ రొటీన్ చెత్తా ఇమేజీ బందిఖానాలో ఇరుక్కుని అందులోనే పొర్లుతున్నాడుగా… ఎవడికి కావాలి ఇప్పుడు ఆ సూపర్ హీరో పోకడలు…!
Ads
ఒక్కొక్క కొత్త హీరో కొత్త ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు… ఇంకా మడత నలగని, క్రాఫ్ చెరగని ఆ పాతతరం హీరోల్లాగే ఉంటానూ అంటే నీ మొహం, ఇంట్లో కూర్చోపో అని ప్రేక్షకులు ఛీకొట్టేస్తున్నారు… ఈ సినిమా చూశాక మెదిలే భావాలు ఇవే… కాకపోతే ఇందులో దివంగత కమెడియన్లు జయప్రకాష్‌రెడ్డి, ఎంఎస్ నారాయణ కూడా ఉన్నారు… సినిమా షూటింగ్ నాటికి వాళ్లు చనిపోలేదు… ఎంఎస్‌కు ఎవరితోనో డబ్బింగ్ చెప్పించారు కానీ నప్పలేదు… ఆడ్‌గా ఉంది… ఇక సినిమా గురించి అంటారా..? చెప్పడానికి ఏమీలేదు, చూడటానికీ ఏమీ లేదు.,. సారీ టు సే… ఈ సీటీమార్‌లు, ఈ బుల్లెట్ల కాలం ఎప్పుడో పోయింది… ష్, సినిమా చూశాక బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమాలో ఏమీ లేదు అనే సంగతి ఖుల్లంఖుల్లా అర్థమైంది… అందుకే ఈ సినిమా మొత్తం బిజినెస్ జస్ట్, 3 కోట్లేనట… అర్థమైంది కదా… ఈ సినిమా రేంజ్ ఏమిటో… మరి మనకెందుకు పోయి పోయి, జేబు గుల్ల చేసుకుని, థియేటర్‌కు వెళ్లి, గుండు గీయించుకోవడం…!! ఇది ఓటీటీకి, టీవీకి కూడా పనికిరాని సినిమా…!!
Share this Article