కరోనా సమయంలో ప్రతి పత్రిక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంది… పేపర్ బాయ్స్‌ను అసలు చాలా లొకాలిటీల్లోకి ప్రజలు రానివ్వలేదు… చాలా పత్రికలు అనివార్యంగా తమ సర్క్యులేషన్‌ను తగ్గించుకున్నాయి… అనగా తాము ప్రింట్ చేసే కాపీల్ని కట్ చేసుకున్నాయి… కొన్ని పత్రికలు ప్రింటింగ్ మానేసి, నామ్‌కేవాస్తే ప్రభుత్వ ప్రకటనల కోసం కొన్ని కాపీలు ప్రింట్ కొడుతూ, వాట్సప్ ఎడిషన్లు పెట్టేసుకున్నాయి… పెద్ద పెద్ద మీడియా సంస్థలే అన్నీ మూసుకుని, డిజిటల్ ఎడిషన్ల వైపు మళ్లిపోయాయి…
మరి అప్పుడెప్పుడో 2019లో (జూలై- డిసెంబరు) ఏబీసీ చివరిసారిగా పత్రికల సర్క్యులేషన్ లెక్క కట్టింది… ఇన్నాళ్ల తరువాత మళ్లీ ఏబీసీ తాజా ఫిగర్స్ వెల్లడించింది… 2022 జనవరి-జూన్… దీని ప్రకారం… జాగ్రత్తగా చదవండి… ఈనాడు సర్క్యులేషన్ 16.14 లక్షల నుంచి ఏకంగా 12.23 లక్షలకు పడిపోయింది… అంటే 3.90 లక్షలు… అంటే నాలుగో వంతు క్షీణత… ఇది మామూలు పతనం కాదు… కారణాలు ఎన్ని చెప్పుకున్నా సరే, కరోనా భయాల అనంతరం చాలాచోట్ల పాఠకులు మళ్లీ పత్రికలు వేయించుకోవడం ప్రారంభించారు… ఐనాసరే, ఈ స్థాయి భారీ పతనం ఎందుకు..?
ఇప్పటికీ ఈనాడు తెలుగు పత్రికల్లో నంబర్ వన్… కానీ దాని పతన వేగం అబ్బురపరుస్తోంది… గతంతో పోలిస్తే ఈనాడు ప్రమాణాల పతనం కూడా ఓ కారణం… ఇక ఆ కారణాల విశ్లేషణలోకి వెళ్తే అదొక పెద్ద పుస్తకం అవుతుంది… ఓసారి ఆంధ్రజ్యోతి గురించి చెప్పాలి… అది ఎప్పుడూ మూడో స్థానమే… ఇప్పుడూ మూడో స్థానమే… కానీ మూడే స్థానం… అంటే మూడింది అని అర్థం… ఎంత అంటే… ఆ ఫైనల్ లెక్కలు చూసి రాధాకృష్ణ కూడా పలుసార్లు కళ్లు నులుముకుని ఉంటాడు…
Ads
6.64 లక్షల నుంచి ఏకంగా ఆంధ్రజ్యోతి 3.62 లక్షలకు పడిపోయింది… అంటే 3 లక్షల కాపీల పతనం… అంటే సగం సర్క్యులేషన్ ఖతం అయిపోయింది… ప్రాంతాల వారీగా ఓసారి పరిశీలిద్దాం… (నమస్తే తెలంగాణ ఏబీసీ పరిధిలో లేదు, బయటికి వచ్చేసింది… అందుకే ఏబీసీ రిపోర్ట్‌లో ఆ పత్రిక పేరు కూడా కనిపించదు… మిగతా చిన్నాచితకా పత్రికల్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు…)
కమర్షియల్‌గా హైదరాబాద్ ఎడిషన్ ఏ పత్రికకైనా గుండెకాయ… ఇక్కడ ఈనాడును, ఆంధ్రజ్యోతిని సాక్షి బలమైన దెబ్బ కొట్టింది… ఇంకా కొడుతూనే ఉంది… ఏబీసీ లెక్కల ప్రకారం గతంలో ఈనాడుకు ఇక్కడ 3.71 లక్షల కాపీలు ఉంటే, అది 2.52కు పడిపోయింది… ఆంధ్రజ్యోతి 1.17 లక్షల నుంచి మరీ ఘోరంగా 53 వేలకు పడిపోయింది… కానీ సాక్షి మాత్రం ఈ భారీ పతనం నుంచి తప్పించుకుంది… సాక్షి కూడా 2.74 నుంచి 2.55 లక్షలకు పడిపోయింది… కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల పతనంతో పోలిస్తే చాలా తక్కువ… దాంతో ఆటోమేటిక్‌గా నంబర్ వన్ అయిపోయింది…
ఒక్క తెలంగాణలోనే ఈనాడు రెండు లక్షల కాపీల్ని కోల్పోయింది… ఆంధ్రజ్యోతి 2.69 నుంచి 1.40కు పడిపోయింది… మరి ఏపీ పరిస్థితి..? అదీ చెప్పుకుందాం… అక్కడ సాక్షి బాస్ అధికారంలో ఉండటం, అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాపీల్ని పెంచే ప్రయత్నాలు జరగడంతో సాక్షి బాగా పెరిగిందని అనుకున్నారు అందరూ… కానీ అంత ఫాయిదా ఏమీ లేదు, పాఠకులు అంత పాజిటివ్‌గా ఏమీ రియాక్ట్ కాలేదు… వెరసి మూడు పత్రికలకూ డౌన్ ఫాలే…
ఏపీలో ఈనాడు 8.49 నుంచి 6.79 లక్షలకు పడిపోగా… ఆంధ్రజ్యోతి 3.80 నుంచి 2.18 లక్షలకు పడిపోయింది… అదే సమయంలో సాక్షి సర్క్యులేషన్ 6.08 లక్షల నుంచి 5.30 లక్షలకు తగ్గింది… ఏతావాతా సంక్షిప్త విశ్లేషణ ఏమిటయ్యా అంటే… కరోనా అనంతరం ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్దగా కోలుకోలేదు… కానీ సాక్షి ఆ పతనం నుంచి తప్పించుకుని, తిరిగి గట్టిగా నిలబడటానికి బాగా ప్రయత్నించింది…
ప్రమాణాల రీత్యా మూడింటికీ పెద్దగా తేడా లేదు… ఆ రెండు తెలుగుదేశం డప్పులు కాగా, సాక్షి వైసీపీ బాకా… కాకపోతే సాక్షి తన మార్కెటింగ్ వైఫల్యాలను దిద్దుకోవడంలో కొంత సక్సెస్ అయినట్టు లెక్క… కర్నూలు, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో సాక్షి నంబర్ వన్ ఇప్పుడు… స్థూలంగా చూస్తే… ప్రింట్ మీడియా పరిస్థితి ఇప్పటికీ బాగా లేదు… లేదు… ఇంకా బాగా ఉండబోవడం లేదు… లేదు…!!
Share this Article