కొన్ని సందర్భాల్లో అభయ్ నవీన్ లేవనెత్తే పాయింట్స్ చూస్తుంటే తను ఈసారి బిగ్‌బాస్ సీజన్‌లో భలే పోటీ ఇస్తాడు అనిపించింది… సిద్దిపేట పోరడు అనేసరికి కొద్దిగా ఇంకాస్త కొంచెం పాజిటివ్ వైబ్స్ పెరిగి ఉంటాయి నాలో కూడా..!
తీరా చూడబోతే… తను ఆ మెంటల్ కేసు మణికంఠకన్నా నాసిరకం ఆటను చూపిస్తున్నాడు… పిచ్చి డైలాగ్స్ విసురుతున్నాడు బిగ్‌బాస్ మీద..! తను ఓ క్లాన్ చీఫ్ అయి ఉండీ, తన సభ్యులు తన ముందే టాస్కులో తన్నుకుంటుంటే, తను ఓ పక్కన కులాసాగా కూర్చుని నవ్వుతూ చూస్తున్నాడు… మరోవైపు ఇంకో క్లాన్ చీఫ్ నిఖిల్ మాత్రం…
తన సభ్యులను ఎంకరేజ్ చేయడంతోపాటు తను కూడా చురుకుగా పాల్గొన్నాడు ఆ టాస్కులో… (చాలా టాస్కుల్లో నేనే ఆడతాను అని ముందుకొస్తుంటాడు)… ఎలాగూ అభయ్ పెద్దగా శ్రద్ధ చూపించకపోవడంతో గుడ్ల టాస్కులో నిఖిల్ పైచేయి సాధించాడు… ఇక్కడ బిగ్‌బాస్ రూల్స్ మీద అభయ్ నోరుపారేసుకున్నాడు…
Ads
ఇంకేదో టాస్కులో సోనియా సంచాలకురాలిగా ఏదో నిర్ణయం తీసుకుంటే, రూల్స్ అలా ఏడ్చాయి, ఇక నేనేమీ ఆడను, పనిచేయను, ఏం చేసుకుంటావో చేసుకో, బయటికి పంపించాలనుకుంటే నేను రెడీ అన్నాడు… ముగ్గురు సభ్యులే వండుకోవాలి అనే రూల్ దగ్గరా అంతే బిగ్‌బాస్ మీద చిర్రుబుర్రలాడాడు…
3, 4 రోజులుగా ప్రతి సందర్భంలో బిగ్‌బాస్‌ను తిడుతున్నాడు, అంటే ఆ క్రియేటివ్ టీం చెత్తా రూల్స్‌ను నిందిస్తున్నాడు… ఇక ఈరోజు ప్రోమోలో ‘గేట్లు తెరిచి, నా రూల్స్ నచ్చకపోతే బయటికి నడవండి ఎవరైనా సరే’ అని బిగ్‌బాస్ కుండబద్ధలు కొట్టేశాడు… సింపుల్, ఆ చర్య అభయ్ గురించే… మెమో జారీ చేసినట్టయింది… గతంలో కూడా ఆదిరెడ్డి మీద బిగ్‌బాస్ ఇలాగే మండిపడినట్టు గుర్తు…
ఐతే ఇదీ ఓ డ్రామా కావచ్చు… స్క్రిప్టెడ్ కావచ్చు… కానీ అభయ్ స్పందించిన సందర్భాల్లో తను కృతకంగా ఏమీ లేడు, కడుపులో ఉన్నదే కక్కినట్టు కనిపించాడు… కానీ..?
అసలే తను నామినేషన్లలో ఉన్నాడు… పైగా నిఖిల్‌ను రక్షించబోయి తనే నామినేషన్ల జాబితాలో చేరాడు… తన్నుమాలిన ధర్మం అంటారు దీన్నే… తీరా తన ఆలోచన ఎదురుతన్ని ఇప్పుడు ఎలిమినేషన్ ముంగిట్లో నిలబడ్డాడు… ఈసారి వోటింగుల్లో లీస్ట్ వోటింగ్ తనదే… తనకు తోడు పృథ్వి, యష్మి కూడా సేమ్ పూర్ వోటింగ్…
సో, ఆ ముగ్గురిలో ఎవరు బయటికి పోయేది..? బిగ్‌బాస్‌కు చిర్రెత్తిస్తున్నాడు కాబట్టి అభయ్, ఇక దయచెయ్ అంటారా..? పృథ్వి నిజంగానే అగ్రెసివ్ పంథాలో విసిగిస్తున్నాడు, నిజానికి బిగ్‌బాస్‌కు అలాంటి కేరక్టర్లే కావాలి… యష్మి అరుపులు, మాటతీరు జనానికి పెద్దగా నచ్చడం లేదు… ఐనాసరే, అలాంటోళ్లు ఉంటేనే కదా ఆటలో మజా…!! ఒకవైపు సిద్దిపేట పోరాడు చెడగొట్టుకుంటూ ఉంటే, మంథని పోరి సోనియా మాత్రం అవసరాన్ని బట్టి పులిహోర కలపడం, సందర్భాన్ని బట్టి సారీలు చెప్పడం బాగా నేర్చుకుంది… చివరకు క్లాన్ చీఫ్ అయ్యే దిశలో బంగారు గుడ్డు పొందింది నిఖిల్‌ను మాయచేసి..!!
Share this Article